టెన్త్ తర్వాత చదువు మానేస్తున్న 65శాతం మంది
సామాజిక, ఆర్థిక అసమానతలు పెరిగే అవకాశం
దళితులు, గిరిజనులు, బీసీలే ఎక్కువ
తెలంగాణ కులగణన సర్వేలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో మహిళల విద్యలో అసమానతలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలో సుమారు 65.5శాతం మహిళలు పదో తరగతి తర్వాత చదువును మానేస్తున్నట్టు వెల్లడించింది. వారిలో దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు (బీసీ) ఎక్కువ మంది ఉండడం గమనార్హం. రాష్ట్రంలో మహిళల విద్యకు సంబంధించి అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తున్నది. గిరిజనుల్లో కోలం ఉప కులానికి సంబంధించిన మహిళల్లో అత్యధికంగా 83 శాతం మంది పదో తరగతి తర్వాత చదువును కొనసాగించడం లేదు. ఎస్సీల్లో బేడలు, బీసీ-డీలో మాలీలు, బీసీ-ఏలో ఒడ్డె, ఎస్టీలో గోండ్, బీసీ-ఏలో వాల్మీకి, బీసీ-డీలో ఆరేవాళ్లు, ఎస్సీలో మాదాసి, బీసీ-ఏలో పిచ్చిగుంట్ల వంటి సామాజిక తరగతుల్లో మహిళల డ్రాపౌట్ రేటు ఎక్కువగా నమోదైంది. 56 కులాలకు చెందిన మహిళలు పదో తరగతి తర్వాత ఉన్నత చదువులకు వెళ్లడం లేదు. ఆయా సామాజిక తరగతుల్లోని మహిళలు తక్కువ చదువుతోనే సరిపెట్టుకుంటున్నారు.
చదువు మానేస్తున్న బ్రాహ్మణ మహిళలు
కుల గణన సర్వే ప్రకారం బ్రాహ్మణ మహిళలు కూడా పదో తరగతి తర్వాత చదువు మానేస్తుండడం గమనార్హం. పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్న వారు రాష్ట్ర స్థాయిలో 65 శాతం మహిళలు ఉంటే బ్రాహ్మణ మహిళలు 36.2 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఓసీల్లో రాజులు, జైనులు, కోమట్లు, కమ్మలు, అయ్యంగార్లు, వెలమ, రెడ్డి వంటి సామాజిక తరగతుల్లో డ్రాపౌట్ రేటు రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉన్నది. అదే సమయంలో కొన్ని మధ్యస్థ సామాజిక తరగతుల్లోని మహిళల చదువు పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నది. ఎస్సీ క్రైస్తవులు (బీసీ-సీ), గోల్డ్స్మిత్స్ (బీసీ-బీ), పద్మశాలి (బీసీ-బీ), చిప్పోలు (మేర) (బీసీ-డీ), ముస్లిములు (ఓసీ), గంగిరేడియవారు (బీసీ-ఏ), ఆర్యక్షత్రియ (బీసీ-బీ), ఆరెకటిక (బీసీ-డీ), మాల (ఎస్సీ) తరగతుల్లో మహిళల విద్యా స్థాయి కొంత మెరుగ్గా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది.
సామాజిక అసమానతలు
మహిళల విద్యలో ఉన్న అసమానతలు సామాజిక అసమానతలకు దారితీస్తున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్య, సామాజిక అసమానతల వల్ల ఆర్థిక అసమానతలు పెరిగే అవకాశమున్నది. ఇది తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ”ఒక సమాజంలో 50 శాతానికిపైగా ఉన్న మహిళలు పదో తరగతి కూడా దాటలేకపోతే అది కేవలం విద్య సమస్య కాదనీ, అది సామాజిక అసమానతల ప్రతిబింబం. మహిళల్లో బ్రాహ్మణులు 36 శాతం ఉంటే ఎస్టీ కోలం వారు 83 శాతం ఉన్నారు. ఈ వ్యత్యాసం చారిత్రాత్మకంగా విద్యా వనరులు, అవకాశాల్లో ఉన్న అసమానతలను సూచిస్తోంది’ అని విద్యావేత్త కె అనురాధ అభిప్రాయపడ్డారు. పేదరికం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలల కొరత, బాల్య వివాహాలు, బాలికల విద్యకు తగిన ప్రోత్సాహం లేకపోవడం వంటి అనేక కారణాలు ఈ డ్రాపౌట్‌కు కారణమవుతున్నాయని విద్యావేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా పదో తరగతి నుంచి ఇంటర్‌కు మారే దశలో ఎక్కువ మంది బాలికలు చదువు మానేస్తున్నారని సర్వే పేర్కొంది. పాఠశాలలు, కాలేజీల్లో సరైన మౌలిక వసతులు, అవసరమైన మరుగుదొడ్లు, తాగునీరు వంటి సమస్యలతో అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని సమకూర్చడంలో ప్రభుత్వాలు విఫలమవు తున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం భేటీ బచావో… భేటీ పడావో అని నినాదాలు ఇస్తున్నది. కానీ బాలిక విద్యను పెంపొందించేందుకు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను మాత్రం కేటాయించడం లేదు. సరైన విధానాలు, రక్షిత చర్యలు తీసుకోకపోతే మహిళల డ్రాపౌట్ రేటు తగ్గే అవకాశం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టెన్త్ తర్వాత చదువు
మానేస్తున్న మహిళలు
సామాజిక తరగతి శాతం
కోలం (ఎస్టీ) 83
బేడ (ఎస్సీ) 79
మాలి (బీసీ-డీ) 79
ఒడ్డె (బీసీ-ఏ) 78
గోండ్ (ఎస్టీ) 77
వాల్మీకి (బీసీ-ఏ) 76
ఆరేవాల్లు (బీసీ-డీ) 75
మాదాసి (ఎస్సీ) 74
రాష్ట్ర సగటు (65 శాతం) కంటే తక్కువ
బ్రాహ్మణులు (ఓసీ) 36
ఎస్సీ క్రిస్టియన్ (బీసీ-సీ) 42
రాజు (ఓసీ) 44
జైనులు (ఓసీ) 45
కాపు (ఓసీ) 46
కోమటి (ఓసీ) 50
కమ్మ (ఓసీ) 51



