20శాతం నీటిని ఆదా చేస్తే గట్టెక్కినట్టే..
గ్రౌండ్‌వాటర్ తగ్గిన ప్రాంతాల్లో ట్యాంకర్ల డిమాండ్
కొన్ని ప్రాంతాల్లోనే బుకింగ్స్ అధికం
నీటి వృథాను అరికట్టేందుకు అందుబాటులోకి ‘పానీ’ యాప్
ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం : వేసవి కార్యాచరణ వివరించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో రాబోయే 45రోజులు నీటి సరఫరా అత్యంత కీలకమని, డిమాండ్‌కు అనుగుణంగా నీటిని సరఫరా చేస్తామని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు అవసరమైన నీటిని అందించేందుకు జలాశయాల్లో అవసరమైన నీటి నిల్వలున్నాయని, ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’లో భాగంగా ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శనివారం ట్యాంకర్ మేనేజ్మెంట్, ప్రస్తుత వేసవి పరిస్థితుల్లో నీటి సరఫరా, ట్యాంకర్ డిమాండ్, భూగర్భజలాల స్థితి, ప్రజల సహకారంపై మాట్లాడారు. ప్రతి నీటి చుక్కా విలువైందేనని, ఈ ఏడాది కూడా వేసవి కాలానికి ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నగరవాసులు 20శాతం నీటిని పొదుపుగా వాడుకుంటే 45 రోజులు గట్టేక్కినట్టేనని అభిప్రాయపడ్డారు. 2.053.2చ.కి.మీ.తో ఓఆర్ఆర్ వెలుపల వరకు జలమండలి విస్తరించిందన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీలు, వెలుస్తున్న బహుల అంతస్తులతోపాటు పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు అడుగంటడంతోపాటు బోర్‌వెల్స్ ఎండిపోయాయన్నారు.
నాలుగేండ్ల డేటాను పరిశీలిస్తే.. నీటి ట్యాంకర్ల డిమాండ్ గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2021 జనవరిలో సుమారు 52 వేల ట్యాంకర్లు సరఫరా చేయగా, 2026 నాటికి అది లక్షా ఎనిమిది వేల వరకు పెరిగిందని చెప్పారు. మార్చిలో అయితే ఈ డిమాండ్ మూడు రెట్లు పెరిగినట్టు వివరించారు. దానికి అనుగుణంగా 86 ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి అవసరాన్ని బట్టి మూడు షిఫ్ట్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని 80 శాతం ప్రాంతాల్లో ట్యాంకర్ల అవసరం లేకుండా సరఫరా సజావుగా జరుగుతుండగా, 20 శాతం ప్రాంతాల్లో మాత్రమే అధిక డిమాండ్ ఉందని చెప్పారు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గడం, హై రైజ్ భవనాలు పెరగడం వల్ల ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని వివరించారు. ప్రస్తుతం నగరంలో రోజుకు సుమారు 11 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని, అందులో 80 నుండి 90 శాతం డిమాండ్ కొద్ది ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైందని తెలిపారు. మొత్తం 14 లక్షల కనెక్షన్లు ఉన్నప్పటికీ, 48 వేల మంది మాత్రమే ట్యాంకర్ సేవలను వినియోగిస్తున్నారని, అందులోనూ కొద్దిమంది ఎక్కువగా ట్యాంకర్లు బుక్ చేస్తున్నారని వివరించారు.
నీటి సరఫరా రోజుకు సుమారు 560 నుంచి 570 ఏంఎల్‌డీ స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా, ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటు, ట్రాన్స్మిషన్ మానిటరింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభిస్తున్నామని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. మోటార్లు పెట్టి నీటిని అధికంగా లాగడం, వాహనాలు కడగడం, తాగునీటిని వృథా చేయడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వందల కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించినట్టు తెలిపారు. ప్రజల సహకారం కోసం ”పానీ యాప్”ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ యాప్ ద్వారా నీటి దుర్వినియోగాన్ని ఫొటో తీసి పంపితే తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూగర్భ జలాల పెంపు కోసం వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతల నిర్మాణం అత్యంత కీలకమని తెలిపారు.
ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రాంతాల్లో ఈ నిర్మాణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. కలుషిత నీటి సమస్యలను గుర్తించడానికి ఆధునిక రోబోటిక్ సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పరిశ్రమలు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్ కోసం ఈ నీటిని వినియోగిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిం చారు. వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ కనీసం 20 శాతం నీటిని ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా భారీగా నీటిని ఆదా చేయొచ్చని తెలిపారు. నీటి సంరక్షణలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, సమిష్టిగా కృషి చేస్తేనే ఈ వేసవిని విజయవంతంగా ఎదుర్కోగలమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రీజియన్ ఈడీలు పంకజ, అశోక్ సామ్రాట్, సంతోష్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, డైరెక్టర్లు ఆపరేషన్స్-1,2,3 వినోద్ భార్గవ, నారాయణ, శీనివాస రెడ్డి, సీజీఎంలు తదితరులు పాల్గొన్నారు.


