Sunday, April 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసిగాచి బాధితులకు రూ.కోటి పరిహారం వెంటనే ఇవ్వాలి

సిగాచి బాధితులకు రూ.కోటి పరిహారం వెంటనే ఇవ్వాలి

- Advertisement -

– గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సహాయంలో కంపెనీ నిర్లక్ష్యం
– కలెక్టరేట్‌ ముందు టీపీజేఏసీ, సీఐటీయూ ధర్నా
– బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ప్రాణం కోల్పోయిన 54 మంది కార్మికులకు సంబంధించి ఆ కుటుంబాలకు పూర్తిస్థాయి న్యాయం చేయాలని తెలంగాణ పీపుల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీపీజేఏసీ), సీఐటీయూ డిమాండ్‌ చేశాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట శనివారం ‘మహాధర్నా’ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీపుల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ వై.అశోక్‌ కుమార్‌, సీఐటీయూ పాశమైలారం ఇండిస్టియల్‌ క్లస్టర్‌ కన్వీనర్‌, రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యులు అతిమేల మాణిక్‌ ప్రసంగించారు. పాశమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ప్రాణాం కోల్పోయిన 54 మంది కార్మికుల కుటుంబాలకు పూర్తిస్థాయి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే (జులై 1, 2025) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి ప్రతి కుటుంబానికీ రూ.కోటి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని, జులై 2న కంపెనీ కూడా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కంపెనీ తన అదనపు కౌంటర్‌ అఫిడవిట్‌లో ”ఎక్స్‌గ్రేషియా” అనే పదాన్ని పొరపాటున వాడామని పేర్కొంటూ, కార్మికుడి హక్కులైన పీఎఫ్‌, ఈఎస్‌ఐ సొమ్మును కలిపి రూ.42 లక్షలకే పరిహారాన్ని పరిమితం చేయడం అత్యంత అమానవీయమని అన్నారు.
అదే విధంగా, కార్మికుడు రాజేష్‌ కుమార్‌ చౌదరి పూర్తిగా కోలుకోకముందే కంపెనీ ఒత్తిడితో మదీనాగూడలోని ప్రణామ్‌ ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జి చేశారని తెలిపారు. నేటికీ అతను ప్రతిరోజూ సొంతంగా బ్యాండ్‌-ఎయిడ్‌ వేసుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. దివ్య, సుష్మ జీవితాలు శాశ్వతంగా ఛిద్రమయ్యాయని, స్టార్‌, యశోద ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగించకుండా, చిన్న ఆస్పత్రులకు వెళ్లాలని కంపెనీ బెదిరిస్తూ బిల్లులు పెండింగ్‌లో పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిద్దరికీ రూ.50 లక్షల పరిహారం ఇచ్చి, వైద్య బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు ఈఎస్‌ఐ, పీఎప్‌ కాకుండా అదనంగా రూ.కోటి నికర పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాజేష్‌, సుష్మ, దివ్యకు వైద్యం కొనసాగిస్తూ పరిహారాన్ని రూ.50 లక్షలకు పెంచాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం బాధితులంతా కలెక్టర్‌ కు మెమోరాండం ఇవ్వడానికి లోపలికెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గేట్ల వద్ద అడ్డుకున్నారు. దీనితో బాధితులు గేటు ముందే బైటాయించి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కలెక్టరేట్‌ ఏఓ బయటకు వచ్చి మెమోరాండం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-కన్వీనర్‌ కన్నెగంటి రవి, బాధితుల కోసం పిల్‌ వాదిస్తున్న అడ్వకేట్‌ వసుధ నాగరాజ్‌, ఎన్‌ఏపీఎం మీరా సంఘమిత్ర, ఎంవీఎఫ్‌ జాతీయ కన్వీనర్‌ ఆర్‌. వెంకట్‌రెడ్డి, బీసీ జేఏసీ అధ్యక్షుడు ప్రభు గౌడ్‌, బీసీఎస్‌ఎస్‌ నాయకులు మల్లికార్జున్‌ పాటిల్‌, టీజేఎస్‌ నాయకులు తుల్జారెడ్డి, టీపీటీఎఫ్‌ నాయకులు ఎం.లక్ష్మయ్య యాదవ్‌, 29 మంది బాధిత కార్మికుల కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -