ఎన్నికల కమిషన్ తీరుపై సర్వత్రా ఆగ్రహం
బెంగుళూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. భారతరత్న గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీ.ఎన్.ఆర్. రావుకు ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితాలో ఆయన పేరు అక్షర క్రమంలో స్వల్పంగా తేడా ఉన్న కారణంగా గుర్తింపును ధ్రువీకరించేందుకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
ఏం జరిగింది.?
బెంగళూరులోని బసవగుడిలో జన్మించిన సీ.ఎన్.ఆర్. రావు ఘనస్థితి, నిర్మాణ రసాయన శాస్త్ర రంగాల్లో విశేష కృషి చేశారు. దేశంలో భారతరత్న అందుకున్న మూడో శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు పొందారు. అయితే సర్‌లో భాగంగా ఆయనకు జారీ చేసిన నోటీసులో పేరులో వ్యత్యాసాన్ని కారణంగా చూపడం గమనార్హం. పాత ఓటర్ల జాబితాలో ఆయన పేరు ‘‘ప్రొఫెసర్ సీ.ఎన్.ఆర్. రావు’’గా ఉండగా.. ప్రస్తుత జాబితాలో ‘ప్రొఫెసర్’ పదాన్ని ‘‘Proff’’గా అదనపు ‘f’తో నమోదు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యత్యాసంపై వివరణ ఇచ్చేందుకు, తన గుర్తింపును ధ్రువీకరించేందుకు మల్లేశ్వరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సమీపంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులిచ్చారు.
ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో..
జాతీయ మీడియా సంప్రదించే వరకు సీ.ఎన్.ఆర్. రావు పరిచయస్తులకు కూడా నోటీసు విషయం తెలియకపోవడం గమనార్హం. ప్రొఫెసర్ ఆరోగ్యం ప్రస్తుతం అంతగా సహకరించడం లేదని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్సీఏఎస్ఆర్)లోని ఆయన పరిచయస్తులు తెలిపారు. ఫోన్లు, కంప్యూటర్లు ఏకాగ్రతను దెబ్బతీస్తాయని భావించే రావు వాటిని చాలా అరుదుగా ఉపయోగిస్తారని, ఈమెయిల్‌ను కూడా స్వయంగా పరిశీలించరని చెప్పారు.
దేశ శాస్త్ర రంగానికి విశేష సేవలు
సీ.ఎన్.ఆర్. రావు దేశ శాస్త్ర విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శాస్త్రీయ సలహా మండలిలో సభ్యుడిగా పనిచేశారు. అనంతరం రాజీవ్‌గాంధీ, హెచ్.డీ. దేవెగౌడ, ఐ.కే. గుజ్రాల్, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలో వారి శాస్త్రీయ సలహా మండళ్లకు అధ్యక్షత వహించారు.
శాస్త్రపరిశోధన అభివృద్ధికి విశేష కృషి
బెంగళూరులో శాస్త్ర పరిశోధన అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. ఐఐఎస్సీకి అధ్యక్షత వహించడంతో పాటు జక్కూరులో జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌ను స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, కర్ణాటక రత్నతో పాటు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న ఆయనకు ఎస్ఐఆర్ కింద ఓటర్ల జాబితాలో పేరు వ్యత్యాసంపై నోటీసు జారీ కావడం చర్చకు దారితీసింది. కేంద్ర ఎన్నికల సంఘం “పక్షపాత” వైఖరితో వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష ప్రాబల్య ప్రాంతాల్లో నిబంధనలను పాటించకుండా భారీగా ఓట్లను మినహాయించడం, దళితులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించడం, ఎస్ఐఆర్ ముసుగులో పౌరసత్వ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆరోపించాయి.
భారతరత్న గ్రహీత ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు సర్ నోటీసు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



