Sunday, April 19, 2026
E-PAPER
Homeజాతీయంమోడీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే

మోడీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే

- Advertisement -

రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోలేకపోయిన కేంద్రం
పుష్కరకాలంలో లోక్‌సభలో ఇలా తొలిసారి
ఐక్యతతో ప్రతిపక్షం విజయం: రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ :
గత 12 ఏండ్ల మోడీ పాలనలో కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో తొలిసారి విఫలమైంది. లోక్‌సభ స్థానాలను 850కి పెంచే కేంద్రం ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఐక్యతతో వ్యతిరేకంగా ఓటు వేశాయి. దీంతో బిల్లు తిరస్కరణకు గురైంది. మొత్తంగా లోక్‌సభలో మోడీ సర్కారు పరాభవాన్ని మూటగట్టుకుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు హాజరయ్యారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన మూడింటా రెండో వంతు మెజారిటీ (352 ఓట్లు) రాకపోవడంతో 54 ఓట్ల తేడాతో విఫలమైంది. మహిళల రిజర్వేషన్‌ అమలుకు అనుసంధానంగా లోక్‌సభ స్థానాలను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత (యూటీ) చట్టాల సవరణ బిల్లులను కలిపి తీసుకొచ్చింది. 2023లో మహిళా రిజర్వేషన్‌ చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందినప్పటికీ.. దానిని అమలు చేయడానికి జనగణన, డీలిమిటేషన్‌ ప్రక్రియతో కేంద్రం అనుంసధానించింది.

ప్రతిపక్షం టార్గెట్‌గా విమర్శలకు పరిమితం
ఈ కొత్త సవరణ బిల్లులు లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచడమే కాకుండా.. దేశ రాజకీయ సమీరణాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా.. ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేస్తూ, మహిళల రిజర్వేషన్‌కు వారు వ్యతిరేకమని ఆరోపించారు. తన ప్రసంగంలో ఆయన పలు మార్లు ప్రతిపక్షాన్ని విమర్శించినప్పటికీ..2023లో మహిళల రిజర్వేషన్‌ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయాన్ని ప్రస్తావించలేదు. ప్రతిపక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్‌కు మద్దతుగా ఉన్నప్పటికీ.. దాన్ని లోక్‌సభ విస్తరణ, 2011 జనగణన ఆధారిత డీలిమిటేషన్‌తో అనుసంధానించడంతో అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కేంద్రం ‘మాటలు’ నమ్మని విపక్షాలు
ఇక లోక్‌సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సమానంగా పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీ బిల్లులో ఎందుకు పొందుపర్చలేదని ప్రతిపక్షం ప్రశ్నించింది. కాంగ్రెస్‌ ఎంపీ కె.సి వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. మహిళల రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌ నుంచి వేరు చేస్తారా? 50 శాతం సీట్ల పెంపుపై లిఖితపూర్వక హామీ ఇస్తారా అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా.. ‘ఒక గంట సమయం ఇస్తే సవరణ తీసుకొస్తాం’ అని తెలిపారు. సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. గత 12 ఏండ్ల అనుభవం ప్రకారం బీజేపీ హామీలు నమ్మలేమని వ్యాఖ్యానించారు.

దక్షిణాదికి అన్యాయంపై ప్రతిపక్షం ఆందోళన
ఇక 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్‌ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసింది. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయని పలు పార్టీల నాయకులు చెప్పారు. 1976లో విధించిన డీలిమిటేషన్‌ ఫ్రీజ్‌ను ఈ బిల్లు తొలగించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం సీట్ల కేటాయింపు 1971 జనగణన ఆధారంగా ఉంది.

బీజేపీకి ప్రచారాస్త్రంగా..
అయితే మహిళా బిల్లు వీగిపోయినప్పటికీ.. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల క్రీడను మాత్రం విడిచి పెట్టలేదు. ఈ బిల్లు వీగిపోవడానికి ప్రతిపక్షాలే కారణమంటూ ఒక సాధనంగా వాడుకునే ప్రయత్నాలకు ఆ పార్టీ తెరదీసింది. వాటిని మహిళా వ్యతిరేక పార్టీలుగా చిత్రీకరించే ప్రయత్నాలకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాలు ప్రతిపక్షాలపై ఇలాంటి ఆరోపణలే చేశారు. దీనిని బలాన్ని చేకూరుస్తు బీజేపీ మహిళా ఎంపీలు.. పార్లమెంటు బయట నిరసన చేపట్టారు. ప్రతిపక్షాలను విమర్శించారు. అంతేకాదు.. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది ప్రచారాస్త్రాంగా మారనుందనే ఆశతో బీజేపీ ఉందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

ఎన్నికల సమయంలోనే బిల్లులు ఎందుకు?
పశ్చిమబెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కేవలం రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు బిల్లుల విషయంలో ఎలాంటి కసరత్తూ చేయలేదనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మోడీ ప్రభుత్వానికి మహిళా బిల్లు విషయంలో చిత్తశుద్ధి ఉంటే.. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా తీసుకొచ్చేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలోనే తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కారణంగా మహిళా బిల్లు పరాజయం పాలైందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. కాగా మోడీ ప్రభుత్వం స్వార్థపూరిత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యతను ప్రదర్శించాయని అంటున్నారు. లోక్‌సభ వేదికగా మోడీ సర్కారుకు తొలి ఓటమిని చూపించాయని వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -