Sunday, April 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉత్తర తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌

ఉత్తర తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌

- Advertisement -

ఒకే రోజు రణరంగంలోకి సీఎం, మాజీ సీఎం!
20న జగిత్యాల వేదికగా బీఆర్‌ఎస్‌ ‘ప్రజా ఆశీర్వాద సభ’
గులాబీ గూటికి కాంగ్రెస్‌ మాజీ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి
దానికి కౌంటర్‌గా అదే రోజున మేడిగడ్డ బ్యారేజీకి సీఎం రేవంత్‌రెడ్డి
నస్తూరుపల్లిలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

భానుడి భగభగలను మించి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఒకేరోజు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధినేతలు తమ బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. తూర్పున కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను ఎండగట్టి గులాబీ పార్టీని ఇరుకున పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పశ్చిమాన ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకేరోజు (ఈనెల 20న) పర్యటనలు ఖరారు చేసుకోవడం రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. సీనియర్‌ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డిని చేర్చుకోవడం ద్వారా జగిత్యాల నుంచి తమ పార్టీకి పూర్వవైభవం చాటాలని బీఆర్‌ఎస్‌ భావిస్తుండగా.. అదే రోజున మేడిగడ్డను అస్త్రంగా మలచుకుని కౌంటర్‌ అటాక్‌ చేయాలని అధికార కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది.

జగిత్యాల నుంచి ‘గులాబీ’ జైత్రయాత్ర!
అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా కాలంగా క్షేత్రస్థాయి బహిరంగ సభలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఇప్పుడు నేరుగా జగిత్యాల వివేకానంద స్టేడియం వేదికగా జరగబోతున్న సభకు వస్తుండటం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డిని తమ వైపు తిప్పుకోవడంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం సఫలమైంది. దీన్ని కేవలం ఒక చేరికగా కాకుండా, కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకతగా ప్రతిబింబించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ‘ప్రజా ఆశీర్వాద సభ’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు వారం రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియమించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్‌ ప్రసంగం ద్వారా రేవంత్‌ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో అటాక్‌ చేసేందుకు గులాబీ దళం సిద్ధమవుతోంది.

కౌంటర్‌ అటాక్‌ దిశగా రేవంత్‌ ‘మేడిగడ్డ’ అస్త్రం

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా గట్టిగానే వ్యూహరచన చేసింది. కేసీఆర్‌ సభ జరుగుతున్న రోజే.. కౌంటర్‌గా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను సీఎం ఖరారు చేశారు. బ్యారేజీ మరమ్మతుల పరిశీలనకే పరిమితం కాకుండా, కాటారం – మహాదేవపూర్‌ మార్గంలోని నస్తూరుపల్లి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన లోపాలను ఎత్తిచూపుతూ కేసీఆర్‌పై నేరుగా రాజకీయ దాడి చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మంత్రి శ్రీధర్‌బాబు ఈ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

గతంలో చెల్లని రూపాయి..ఇప్పుడూ..? : మంత్రి అడ్లూరి
ఇరు పార్టీల అగ్రనేతల పర్యటనల నేపథ్యంలో, ద్వితీయ శ్రేణి నాయకులు, మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జీవన్‌రెడ్డి పార్టీ వీడటంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ”గతంలో జీవన్‌రెడ్డిని చెల్లని రూపాయిగా అభివర్ణించిన కేటీఆర్‌.. ఇప్పుడు ఆయన్ను ఎలా స్వీకరిస్తున్నారు? గతంలో 40 ఏండ్లు పదవులు అనుభవించిన ఆయన ఇప్పుడు పదవులు దక్కలేదన్న అసంతృప్తితోనే పార్టీ మారుతున్నారు’ అని విమర్శించారు.

గుంట నక్కలు భయపడుతున్నాయి : కేటీఆర్‌, హరీశ్‌రావు
మంత్రి వ్యాఖ్యలు, సీఎం టూర్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం గట్టి కౌంటర్‌ ఇచ్చారు. శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి జీవన్‌రెడ్డితో సమావేశమైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ బయటకు వస్తుంటే గుంట నక్కలు భయపడుతున్నాయి. అందుకే రేవంత్‌ మేడిగడ్డ సభ పెట్టుకున్నారు. రేవంత్‌ హైట్‌ చిన్నది కాదు.. మెదడు చిన్నది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూనే.. బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో లేని లోటు కనిపిస్తోందని సెంటిమెంట్‌ రగిల్చే ప్రయత్నం చేశారు.

నీ ఇల్లే కుంగింది..: ఎర్రబెల్లి
మరోవైపు సీఎం రేవంత్‌ టూర్‌కు కౌంటర్‌గా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన జిల్లా నేతలతో కలిసి ముందే మేడిగడ్డను సందర్శించారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జూబ్లీహిల్స్‌లో నువ్వు కట్టుకున్న ఇల్లే కుంగింది.. అంత పెద్ద ప్రాజెక్టులో చిన్న ఇబ్బంది వస్తే రాద్ధాంతం చేస్తావా?’ అంటూ సీఎం రేవంత్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఏదేమైనా ఈ నెల 20న జగిత్యాల వివేకానంద స్టేడియం, అటు నస్తూరుపల్లిలో ఇరు పక్షాల నేతలు సంధించే విమర్శనాస్త్రాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మరింత వేడెక్కించడం ఖాయమనే చెప్పొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -