రెండేండ్లయినా చెల్లించని బకాయిలు
రూ.35 లక్షల బిల్లులు రావాలంటున్న మాజీ సర్పంచ్
నవతెలంగాణ – ఇల్లంతకుంట
పాఠశాల గదులు నిర్మించి రెండేండ్లు గడిచినా బిల్లులు రాలేదంటూ మాజీ సర్పంచ్ తాళం వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల గదులకు గురువారం తాళం వేశారు. దాంతో ఉపాధ్యాయులు విద్యార్థులను వరండాలో కూర్చో బెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లంతకుంట ఎస్ఐ సిరిసిల్ల అశోక్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిర్మించి రెండేండ్లయినా బిల్లులు రాకపోవడంతో తాళం వేశామని మాజీ సర్పంచ్ అనసూయ, ఆమె భర్త కెబిఎన్ రెడ్డి ఎస్ఐ అశోక్‌కు తెలిపారు. మన ఊరు – మన బడిలో భాగంగా ప్రాథమిక పాఠశాల గదులు రూ.21 లక్షల 23వేలు, జెడ్పీహెచ్ఎస్ గదులను రూ.21 లక్షల 83 వేలు ఖర్చు చేసి నిర్మించినట్టు వాపోయారు. ఇంకా రూ.20 లక్షల బిల్లు రావాల్సి ఉందని వారు చెప్పారు. కాగా, జీపీ నుంచి రూ.15 లక్షలు రావాలని ఆవేదన వ్యక్తం జేశారు. ఎంపీడీవో, డీపీవో, కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అప్పులు చేసి, ఇంట్లో బంగారం అమ్మి ఖర్చు చేశామని, అప్పులు వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయని రోదిస్తూ తెలిపారు. బిల్లులు రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించే వరకు వేసిన తాళం తీసేది లేదన్నారు.
బిల్లులు రాలేదని పాఠశాల గదులకు తాళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



