Sunday, April 19, 2026
E-PAPER
Homeజాతీయంనారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నాయి

నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నాయి

- Advertisement -

విపక్షాలు తప్పు చేశాయి
మహిళా బిల్లును అడ్డుకొని భ్రూణహత్యకు పాల్పడ్డాయి
ప్రధాన పాపం కాంగ్రెస్‌,టీఎంసీ, డీఎంకే, ఎస్పీలదే
ప్రతిపక్ష పార్టీలపై మోడీ ఆగ్రహం
జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ :
భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకున్నాయని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత మహిళల కలలను ధ్వంసం చేశాయని విమర్శించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో.. దేశ ప్రజలను ఉద్దేశించి శనివారం మోడీ ప్రసంగించారు. దేశ హితమే తమకు అత్యంత ముఖ్యమన్నారు. కొందరికి మాత్రం దేశం కంటే రాజకీయాలే ముఖ్యమని ప్రతిపక్షాలే టార్గెట్‌గా విమర్శించారు. దేశ హితం కోసం, నారీ శక్తి హితం కోసం బిల్లు తెచ్చామని చెప్పిన మోడీ.. మహిళా శక్తిని ఈ దేశం ఇంకా చూడాల్సి ఉందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్షాలు నారీ శక్తిని అడ్డుకున్నాయని చెప్పారు. మహిళా బిల్లును కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ అడ్డుకున్నాయని తెలిపారు. అలాంటి కుటుంబ పార్టీలు మహిళలను ఎదగనీయవన్నారు. ఆ పార్టీలు ఓడించింది బిల్లును కాదనీ, మహిళా శక్తిని అని చెప్పారు. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ మర్చిపోరన్నారు. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు కలిసి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలకు తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు. అన్ని విషయాలను మహిళలు గమనిస్తూనే ఉన్నారని మోడీ చెప్పారు. మహిళా బిల్లు క్రెడిట్‌ తీసుకోవాలని విపక్ష నేతలకు విజ్ఞప్తి చేశామన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన బలం దక్కేలా బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. మహిళా బిల్లును అడ్డుకొని విపక్షాలు భ్రూణహత్యకు పాల్పడ్డాయని విమర్శించారు. ఈ భ్రూణహత్యలో ప్రధాన పాపం కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ పార్టీలదేనని ఆరోపించారు. మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లును గతంలో చాలాసార్లు అడ్డుకుందని మోడీ చెప్పారు. కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, ఎస్పీలకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. డీలిమిటేషన్‌పై కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు అసత్యాలు ప్రచారం చేశాయని మోడీ అన్నారు. స్వార్థ రాజకీయాలతో ఆయా రాష్ట్రాల ప్రజలనూ మోసం చేస్తున్నాయనీ, డీలిమిటేషన్‌ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని తాను స్పష్టంగా చెప్పినట్టు వివరించారు. సంస్కరణ పేరు వింటే చాలు.. కాంగ్రెస్‌ వెంటనే వ్యతిరేకిస్తుందని మోడీ ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -