మీరు గనక తాజా పత్రికలు, ఛానళ్ల ప్రసారాలూ చూస్తే కొన్నింటిలో మాత్రమే పతాక శీర్షికల్లో సీఈసీ తొలగింపు ఆందోళనలు కనిపించాయి. కొన్ని అగ్రమీడియాలైతే కనీసం మొదటి పేజీలో డబుల్ కాలమ్ ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు. ఛానల్స్‌లోనూ ఇదే పరిస్థితి. ఢిల్లీలోనూ, ముంబాయిలోనూ అంత నిరసన రగిలినా ప్రతిబింబించలేదు. ఇచ్చినమేరకు కూడా ఏదో కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ)కి సంబంధించిన హెచ్చరికలు, అరెస్టులతో సరిపెట్టాయే గానీ ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కూడా అరెస్టయిన తీరునూ విద్యార్థి యువజన సంఘాల ప్రతిఘటనను చూపించలేదు. ఫ్లైదుబాయ్ విమాన హైజాక్‌ను లేదా ఘటనను అడ్డుకున్న భారతీయ పైలెట్ స్మిత్ మచ్చా సాహసాన్ని హనుమాన్ చాలీసా వరకూ తీసుకెళ్లడానికి ప్రధాని మోడీతో ఆయన సంభాషణను ఆధారం చేసుకున్నాయి. నరహంతక ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూకూ అంతే ప్రచారమిచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్లను మత ప్రచారానికి వాడుకోవడాన్ని తప్పు పట్టారే గానీ అసలు దేశంలో హిందూత్వను రాజకీయ అస్ర్తంగా చేసుకున్న బీజేపీ-ఆరెస్సెస్‌ల ఊసెత్తలేదు. చైనా వ్యతిరేక కథనాలను ఒక ఫార్ములాగా చేసుకున్న బడా మీడియా ‘బ్రిక్స్’ వేదికలోనూ తర్వాత కూడా చైనా-ఇండియాలు కలసి కీలక సంకేతాలిస్తున్న తీరును చెప్పకపోగా దగ్గరవడం తేలిక కాదనే కథనాలే ప్రచురిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ 370, ప్రత్యేక ప్రతిపత్తి రద్దును గొప్ప విజయంగా కీర్తించిన వారే ఇప్పుడు ఆ శాసనసభ మళ్లీ రాష్ట్ర హోదా కోరుతూ తీర్మానం చేయడాన్ని చర్చ చేయనేలేదు. ఎన్నిసార్లు చెంపలేసుకున్నా మోడియా అనబడే మీడియా మారేది కాదని ఈ ఉదాహరణలన్నీ చెబుతున్నాయి. ఇందులో ప్రతి పరిణామం లోతుగా తరచి చూడవలసిన ప్రాధాన్యత కలిగివుంది.
ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట కపటనాటకం మొదలుపెట్టినప్పుడు మీడియాలో పెద్దభాగం దాన్ని మామూలు విషయం గానే చూపుతూ వచ్చింది. కోట్లమంది ఓట్ల తొలగింపును ఆందోళనకరమైన విషయంగా చూపించనేలేదు. సుప్రీంకోర్టులో పదేపదే ఇది విచారణకు వస్తున్నా, రాష్ర్టాలను పాలించే ప్రభుత్వాలు కూడా సవాలు చేస్తున్నా చాలా యథాలాపంగానే వ్యవహరించింది. పైగా పలుమార్లు కోర్టులో వచ్చిన వ్యాఖ్యలనే పెద్దగా చూపుతూ విమర్శకులదే తప్పనట్టు చూపించింది. నిజానికి ఇన్ని వనరులు గల బడా మీడియా వ్యవస్థలు గనక ఈ కాలంలో నిజాలు చెప్పడానికి ప్రయత్నించి వుంటే ఇప్పుడు చూస్తున్న సంచలనం ఎప్పుడోచూసి ఉండేవాళ్లం. ఇప్పుడు కూడా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే’ ఈ కథనం బయట పెట్టింది, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా తనదిగా స్వీకరించలేదు. పైగా పరిశోధనాత్మక కథనం వచ్చాక రెండు రోజులు ఆగి మరోవైపు నుంచి అల్లికలు మొదలు పెట్టాయి. బీజేపీ నేతలు వారి ముఖ్యమంత్రుల ఖండనలే ఘనంగా ఇవ్వడం తప్ప విమర్శనాత్మక పరీక్షకు పెట్టనే లేదు. ‘హిందూ’ వంటి ఒకటి రెండు మీడియాలు తప్ప ఎవరూ పెద్ద తప్పు జరిగిపోయినట్టు, సీఈసీ రాజీనామా చేయాల్సిన అవసరమున్నట్టు వ్యాఖ్యానించడం చూడం. అదే అల్‌జజీరా, బీబీసీ వంటివి చూస్తే ఆ విమర్శనాత్మకత కనిపిస్తుంది.
కాశ్మీర్‌లోనూ కదలిక
సెప్టెంబరు 28న జమ్మూకాశ్మీర్ శాసనసభ పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కోరుతూ ఈ వారం తీర్మానం ఆమోదించింది. నిజానికి పరిస్థితి మెరుగుపడగానే రాష్ర్ట హోదా ఇస్తామన్నది స్వయంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా చేసిన వాగ్దానమే. పార్లమెంటులో పునరుద్ఘాటిం చారు కూడా. కానీ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం అదే తీర్మానం తెచ్చేసరికి ప్రధాన ప్రతిపక్షంగా వున్న బీజేపీ అడ్డుపడింది. ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ ఆగమేఘాల మీద ఢిల్లీ వచ్చి అమిత్‌షాతో చర్చలు జరిపి వెళ్లారు. 2024లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకసారి ఇలాంటి తీర్మానమే చేశారు. ఎన్నికలు సక్రమంగా జరిగి సర్కారు ఏర్పడిందంటే సాధారణ పరిస్థితి ఉందని అర్థం కదా? మరి ఎందుకు కాశ్మీర్‌ను బూచిగా చూపుతూ కేంద్ర పెత్తనమే నడుపుతున్నారు? శాంతిభద్రతలు అమిత్ షా అధీనంలో ఉండగానే సరిగ్గా ఏడాది కిందట పెహల్గాం మారణ కాండ జరిగింది. భారత్-పాకిస్తాన్ ఘర్షణలు ‘ఆపరేషన్ సిందూర్’ చూశాం. ఇటీవల ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల వేశాలలోనూ ఆ ప్రస్తావనలొచ్చాయి. భారత్పాక్ల వివాదాలూ నడిచాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారిగా భారత ప్రతినిధి వర్గం పాక్‌లో షాంఘై సహకార కూటమి(ఎస్సిఓ) సమావేశానికి కూడా హాజరైంది. ఇన్ని జరగవచ్చుగానీ రాష్ర్ట హోదా ఇవ్వడానికి అభ్యంతరమేమిటి? కాశ్మీర్లో సాధారణ పరిస్థితి ఏర్పడకుండా పాకిస్తాన్ కుట్రలు చేస్తుందని కేంద్రం చేస్తున్న విమర్శనే ఒమర్ సభలో ప్రస్తావించారు. ‘శాసనసభ ఎజెండాతో సహా అన్నీ కేంద్రం నిర్ణయిస్తుంటే మేము ఎలా పాలన చేస్తామని’ ఆయన ప్రశ్నించారు. మీరు చెప్పే ప్రకారం కాశ్మీర్లో సాధారణ పరిస్థితి పునరుద్ధరణ బాధ్యత పాకిస్తాన్‌కు వదిలేస్తారా అన్న ఆయన వ్యాఖ్య చాలా కీలకమైంది. శాసనసభ తీర్మానంలో 2000 నాటి సభ తీర్మానాన్ని కూడా ప్రస్తావించడం మహాపరాధంగా బీజేపీ చెబుతున్నది. అది ఒమర్ ఎత్తుగడగా మీడియాలో కథనాలే వచ్చాయి. స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించాలని ఆ తీర్మానంలో కోరారు. (అప్పటికి 370 రద్దు కాలేదు) అప్పుడు ఒమర్ కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా వున్నారు. మరి ఆ దశలో రాజ్యాంగ నిబంధనల పరిధిలో శాసన సభచేసిన పూర్వ తీర్మానం అమలు చేయాలని కోరడం తప్పేంటి? అంటే ఏదోవిధంగా కాశ్మీర్ వివాదాన్ని కూడా తిరగదోడేందుకు కేంద్రం పాచికవేస్తున్నదనేది ఇక్కడ స్పష్టం. కొద్దిమాసాల కిందట కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసిద్ధ పాత్రికేయులు, చరిత్రకారుల పుస్తకాలను నిషేదించారు. లడాఖ్‌లో ఆందోళనను అణచివేయడం కాల్పులు చాలా సంచటనానికి దారితీశాయి. వాస్తవానికి దాని నాయకుడైన వాంగ్‌చుక్ ఇప్పుడు ‘కాక్రోచ్’ల ఆందోళనకు అండగా నిరాహారదీక్ష చేశారు. ఇలా జాతీయంగా, అంతర్జాతీయంగా వరస దెబ్బలు తిన్న మోడీజీ తాజా ‘మన్‌కీ బాత్’లో బాల్ కోట ఉరి సర్జికల్ స్ర్టయిక్స్ ప్రస్తావన చేయడం యాదృచ్చికం కాదు.
పైలట్ పొగడ్తల చాటున..?
ఇప్పుడు మనం విమానదాడి ఘటనకు వద్దాం. ప్లైదుబాయ్ విమనం కో పైలెట్ కత్తిపోట్లకు గురైన ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్ మచ్చార్‌ను మెచ్చుకోవలసిందే. కానీ దాని ఆధారంగా మరోసారి 9/11 ఘటనలను తీసుకురావడం దేనికి? గాజాలో ఇజ్రాయిల్ మారణకాండకు కారకుడైన ప్రధాని నెతన్యాహూ ఎన్నికలలో ఓడిపోతాడని అంచనాలు వేలువడుతున్న వేళ ఆయనపై ఫోకస్ ఇవ్వడంలో రాజకీయాలు లేవా? ఆ కో పైలెట్ రాడికలైజ్ అయ్యాడని నెతన్యాహూ చేసిన ఆరోపణ వెనక జాత్యహంకార ధ్వనులు వినిపించవా? టెర్రరిస్టు చర్యను ఖండించడం వేరు, దానికి మతం రంగు పులమడం వేరు. ఆఖరుకు ఆ విమానం స్వంతదారైన యుఎఇ కూడా మరీ విపరీతమైన కుట్ర సిద్ధాంతాలు తేవద్నది హెచ్చరించవలసి వచ్చింది. కానీ మననేతలు, మీడియా రాతలు మాత్రం మారవు. ఇది కేవలం సంచలన ధోరణిని మించిన సామాజిక కోణం దీంట్లో వుంది. అమెరికా మిత్రదేశాలతో సహా మొన్న ఇజ్రాయిల్ మారణకాండను గట్టిగా ఖండించిన నేపథ్యంలో ఇది జరుగుతున్నది. ఇదే సమయంలో ఇరాక్ నుంచి సైన్యాలను వెనక్కు తీసుకుపోతుండడం కూడా ఇరాన్‌కు సానుకూలమైందిగా భావిస్తున్నారు. ఈ సమయంలో అంతార్జాతీయ దృష్టిని పూర్తిగా విమాన ఘటనపైకి మరల్చడం పోటీపడి నేతలు హడావుడి చేయడం వ్యూహాత్మకమే. మచ్చానే వీరుడిగా ప్రతిష్టించడం తప్పుకాదు గానీ ప్రతి సమయంలో ఇలా ఒకరిని తెచ్చి మిగిలిన కోణాలు వెనక్కు నెట్టడం గుర్తించవలసి వుంటుంది. ఇక ఆయనతో మోడీ సంభాషణ, స్పందన వీటినే ఇంకా ఇంకా రసవత్తరంగా చెబుతూ రాజకీయ సందర్భం మరుగుపర్చడం ఒక మాయా వ్యూహమే.
కోర్టుకూ సంకటం
సీఈసీ వ్యవహారంతో వ్యవస్థల డొల్లతనం బహిర్గతమయిందనుకుంటే సుప్రీంకోర్టు కూడా ఇరకాటంలో పడింది. ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై కేసు విచారించిన ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన సీనియరైన జస్టిస్ దీపాంకర్ దత్తాతో పాటు వున్న జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ కుమారుడు ఈసీ తరపున వచ్చిన న్యాయవాదులలో ఒకరుగా ఉన్నారని వెల్లడైంది. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో సదరు న్యాయమూర్తులు తమకున్న సంబంధాన్ని బట్టి తప్పుకుంటారు.(రెక్యూజ్)కానీ ఇక్కడ అదేమీ జరగలేదు సరికదా ఆయనే అభ్యంతరం పెట్టి కేసు సీజేఐకి అప్పగించ వలసిన పరిస్థితి కల్పించారు. మరోవైపున ఎన్నికల ప్రక్రియ ఓటరు జాబితా గురించి ఇంత రభస జరుగుతుంటే దాన్ని దాటేసేందుకు జమిలి ఎన్నికల చర్చ తీసుకొచ్చారు. సాక్షాత్తూ మాజీ రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్ దానిపై అధ్యయన కమిటీ ఛైర్మెన్‌గా ఇంటర్యూలు వదిలారు. ఇక దీనిపై వేసిన జేపీసీ నేరుగా సుప్రీం జడ్జిలతోనే చర్చలు జరపనున్నట్టు ఎజెండా ప్రకటించింది. మామూలుగా సుప్రీంకోర్టు రాష్ర్టపతి అడిగితేనే సలహాలిస్తుంది. ఇక్కడ జేపీసీ వచ్చి న్యాయ మూర్తుల అభిప్రాయం తీసుకోవడమేమిటి? అది కూడా వివాదాస్పద అంశంలో. అంటే రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి జోక్యాన్ని ఆహ్వానించడమేనన్నమాట. సీనియర్ అడ్వకేట్ మాత్రమే గాక రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ ఈ విషయం బయటపెట్టాక కోర్టు తమకు కలిసే ఉద్దేశం లేదని ప్రకటించింది. ఇక జేపీసీ ఛైర్మెన్ పిఎచౌదరి కూడా ప్రస్తుతానికి తమకు ఆ ఎజెండా లేదని సర్దుకున్నారు. ఎన్నికల సంఘం ‘సర్’ విషయంలో సుప్రీంకోర్టు మరింత గట్గిగా వ్యవహరించి ఉండాల్సిందనే అభిప్రాయం కూడా బలంగా వ్యక్తమైంది. కాకపోతే వ్యవస్థలన్నీ డొల్లతనం వెల్లడించుకున్నా అప్రమత్తమైన ప్రజలు, అందులోనూ యువత ఉద్యమంలోకి రావడం సానుకూల పరిణామం. గణేష్ నిమజ్జనం ముగిసి జ్ఞానేష్ నిమజ్జనానికి సిద్ధమవుతున్నామని ప్రకాశ్ రాజ్ అందుకే అన్నారు. వీటిని బడా మీడియా తగినంత చూపకపోయినా, చెప్ప కుండా కప్పిపెట్టినా ప్రత్యామ్నాయ శక్తులు స్వరాలు మాత్రం ప్రతిఘటనతో ముందుకు సాగుతాయన్నది అసలైన సందేశం.
తెలకపల్లి రవి






కామెంట్లు (0)