అక్టోబర్ 11న జ్యోతి కొత్తపలుకులో సంఘ్ కూటమి కూటనీతి కనిపించింది. దానిపై నా స్పందనిది. జీవించి ఉన్న వ్యక్తి ఓటు రద్దును ఓటు చోరీ (దొంగతనం) అంటున్నారు. ఓటు పోయిన వ్యక్తి బతికి ఉండడమే ఓటు చోరీకి నిరూపణ. నిష్పాక్షిక బుద్ధితో ప్రశ్న, తర్క విశ్లేషణ, సామాజిక న్యాయ విచక్షణలతో ఆలోచిస్తే నిజానిజాలు తెలుస్తాయి. శాస్త్ర సాంకేతికతలతో ప్రపంచం పల్లెగా మారింది. ఎంత పెద్ద దేశమైనా సత్యనిర్ధారణకిదే సూత్రం. వ్యవస్థలు రాజ్యాంగ బద్దంగా ప్రజల కోసం పనిచేస్తే వాటిపై జనవిశ్వాసం ఏర్పడుతుంది. ఓటు చోరీ వివరాలు సందేహనివృత్తి చేస్తాయి. తప్పు చేసిన ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (ఈసి) నోరెత్త లేదు. న్యాయవ్యవస్థ మౌనంగా లేదు. కొన్ని కేసుల్లో న్యాయం చేసింది. మెట్రో స్టేషన్లను మూయరాదని, ప్రజలకు రవాణా ఇబ్బందులు కలిగించరాదని చెప్పింది. ఓటు చోరీ అర్జీల్లో బాధ్యతారహిత పక్షపాత ధోరణి వహించింది. పాలకపక్ష వ్యవస్థలు ఓటు చోరీ నిజమని చెపుతాయా? ఏడాదికి నాలుగుసార్లు ఓట్ల చేర్పుమార్పులు జరుగుతాయి. ఇప్పటిదాకా వాటిపై గొడవ లేదు. జ్ఞానేశ్ కుమార్ ఎస్.ఐ.ఆర్.లో కొత్త నిబంధనలను చేర్చారు. వాటితో అయినవారి చేర్పు, కానివారి తొలగింపు జరిగాయి. ఫారం 7తో ఎవరైనా ఎవరి ఓట్లనైనా రద్దు చేయించవచ్చు. ఒక్కొక్క సంఘ్ వ్యక్తి తమకు ఓటేయరన్న అనుమానంతో వందలాది ఇతరుల (ముస్లింల) ఓట్లను తీసేయమని ఫారం 7 ఇచ్చాడు. వారి ఓట్లు పోయాయి. అదే కొత్త సర్ తో వివాదం. ఈసి మౌనం వెనుక మోడీ రాగముంది.
ప్రభుత్వ నేత పక్షపాతంతో నియమించబడిన అధికారి ఆ నేత చెప్పిన పనిని, అది అనుచితమైనా, చేస్తాడు. అవినీతిచరిత్ర కల వ్యక్తి చేసితీరుతాడు.
జ్ఞానేశ్ కుమార్ ఈ తరహా వ్యక్తి అని ఆయన అధికార చరిత్ర నిరూపిస్తోంది. 2023 చట్టం అవినీతి ఆరోపణల నుంచి జ్ఞానేశ్కు జీవితకాల మినహాయింపునిచ్చింది. అక్రమ పనులు చేయించు కోవడంలో మోడీ దిట్ట అని ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి పాలన, ప్రధాని పాలన తెలుపుతున్నాయి. అలాంటి మోడీ చెప్పిన పనిని ఆయన దయాపాత్రుడైన సిఈసి జ్ఞానేశ్ ఎందుకు చేయరు? ఆయన కింది అధికారులు, సిబ్బంది, సౌజన్య పక్షపాతం (పైవారు చెప్పినట్లు చేసే మనస్తత్వం)తో జ్ఞానేశ్ చెప్పినట్లు చేశారు. అదే గుణంతో ఇద్దరు ఈసిలు పదినెలలు మాట్లాడలేదు. ఒక పత్రిక పరిశోధనలో తమను జ్ఞానేశ్ సంప్రదించలేదని, తమ ఉత్తరాలను ఆయన, శాఖాధికారి పట్టించుకోలేదని చెప్పారు. బాధ్యతతో ఇలా చేశారో? తాము చెప్పిన సంగతి ఎవరికీ తెలియదనుకున్నారో?
ఆంధ్ర లో పోలింగ్ వేళ దాటి అర్ధ రాత్రి వరకూ ఒక్కొక్క బూతులో వేల ఓట్లు పడ్డాయని, వేసిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువని అప్పుడే పొక్కింది. పరకాల ప్రభాకర్ పూర్తిగా శోధించిన వివరాలతో మోసాలను బయటపెట్టారు. ఒకరు ఓటు ఎవరికి వేశారో మరొకరికి తెలియదు. ఫలితాలు తమ ఓట్లకు విరుద్ధంగా ఉన్నాయని అనుకోలేరు.
కాబట్టి ఫలితాలపై ప్రజల్లో అశాంతి అనూహ్యం. ఈవిఎంల తారుమారు ఏ అభిమానులకూ తెలియదు. మేధావులు, తటస్తవాదులు రుజువులతోనే ఈవిఎంల గోల్మాల్ జరిగిందని చెప్పారు.
గోల్మాల్ లబ్ధిదారులు సత్యశోధకులను ఎగతాళి చేస్తారు. జ్ఞానేశ్తో మోడీ ఓటు చోరీ చేయించారన్న ప్రతిపక్షాల ఆరోపణ సత్యం. 2019 లో చంద్రబాబు ఈవిఎంల నిందకు, నేటి జ్ఞానేశ్ ఓట్ల చోరీకి సారూప్యత లేదు. సర్లో ఓట్ల చోరీ ఎక్కువ జరిగింది. దేశవ్యాపితంగా సర్ అమలు కాలేదు. అది అమలైన బీహార్, తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో ఓటు చోరీ ప్రభావంకనిపించింది. 2024 సాధారణ ఎన్నికల్లో, ఒడిశా, ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో పలు పద్ధతుల్లో ఓట్లు తారుమారయ్యాయి. అందుకే బీజేపీకి 240 సీట్లయినా వచ్చాయి. సర్కు ఈసి అమర్చిన లోపయుక్త సాఫ్టువేర్ వలన బూత్ లెవెల్ అధికారులకు తొలగించిన ఓట్ల సవరణ, చేర్పు కుదరలేదు. నెల్ల క్రితమే అధికారం చేపట్టిన పార్టీ పట్ల వ్యతిరేకత ఉండదు. ప్రభుత్వ పలుకుబడితో తమ సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు ఉప ఎన్నికల్లో పాలక పక్ష ప్రతినిధులనే ఎన్నుకుంటారు. అందువల్ల నెల్ల
వ్యవధిలో జరిగే ఉప ఎన్నికల్లో అధికార పక్షం గెలుపు సహజం.
స్త్రీలపై లైంగికాడులు, ఇతర నేరాలు వాటి మూలకారణాలను నిర్మూలించేవరకూ జరుగుతూనే ఉంటాయి. నేరంచేసే వారి వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి వస్తే నేరాలు జరగవనడం సరైన అవగాహన కాదు. లైంగికదాడులు, నేరాలు చేసినవారిని పోలీసులు కొన్నిసార్లు కాల్చిచంపినా అవి ఆగలేదు. వ్యవస్థలు బాధ్యత, జవాబుదారీతనంతో పనిచేస్తే అక్రమాలు, అవినీతి తగ్గుతాయి. లైంగిక, సాంఘిక నేరాలు తగ్గవు.
వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించడం కంటే, నేరస్తులకు పాలక పక్ష సహకారం, అత్యాచారులకు పాలక పక్ష భక్తుల సన్మానం వలన నేరస్తులు రొమ్ము విరుచుకొని తిరుగుతున్నారు. వివేకానందరెడ్డి హత్య విషయంలో ఎవరినో నిందించే బదులు నేటి పాలకులు చొరవ తీసుకొని హంతకులను పట్టుకోవచ్చు.
పాలకులు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని నడిపితే తటస్థ న్యాయవ్యవస్థ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. విద్య, వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉండాలి. మంత్రులకు సింగపూర్ లో
పాలన శిక్షణ నివ్వడం కాదు. చిత్తశుద్ధి కలిగిన పాలక వర్గ ప్రతినిధులు స్కాండినేవియన్ దేశాలకు పోయి రాజకీయులు ఎలా ఉండాలి, రాజకీయాలను ఎలా నడపాలి అన్న అంశాలను అధ్యయనం చేయాలి. మొత్తం పాలకవర్గానికి శిక్షణ నివ్వాలి. నేరాలకు బాధ్యులు రాజీనామా చేయాలన్న రాజకీయ డిమాండుతో జరిగే ఆందోళనలలో సామాజిక ప్రయోజ నాలున్నాయి. అందుకే ప్రజల మద్దతు విపరీతంగా లభిస్తోంది. ప్రజా వ్యతిరేక పాలకులకు మద్దతిస్తున్నవారు, ప్రజలతో పాటు, తెలివి తెచ్చుకోవాలి. టీడీపీ, జనతా దళ్ యు, ఎస్ లు, పాశ్వాన్, అథావలె లు (తర్వాతి ప్రజాగ్రహం వీరిపైనే) దుష్ట కూటమికి మద్దతును విరమించుకోవాలి. అప్పుడు ప్రభుత్వం పడిపోగలదు. చైతన్య యువత, ప్రజలు మధ్యంతర ఎన్నికల్లో సరయిన పార్టీలను ఎన్నుకుంటారు.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 94902 04545







కామెంట్లు (0)