Magazines

దీపావళి చేద్దాం రండి!

27 నిమిషాల క్రితం

Diwali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 3 నిమిషాల చదవడం

‘‘దీపావళి రూపశోభే, పెను చీకట్లు వెలుగుతూనే కూర్చున్నవి, అంతరంగాన, మనసు విప్పుకోవడమే అసలు వెలుగు’’ అంటారు కవి. దీపావళి గురించి కవులు చాలానే చెప్పారు. ‘‘దీపావళి ఉత్సవమండీ! దీపావళి చేద్దాం రండి! ఆకాశం మండిద్దామా? పాతాళం తగలేద్దామా? నరకాసురుడెందుకు? ప్రపంచ నరకాన్ని మసిచేద్దామా? తమ బతుకుల అఖరి శ్వాసలు, వదలిన చల్లారిన ఆశలు, మొగముపైన నల్లని దుప్పటి, కన్నుమిన్ను కానని చీకటి, రండోయ్! చితులు రగల్చండి!’’ అంటూ పిలుపునిచ్చాడు ఆలూరి బైరాగి. కవి చెప్పినట్లుగానే తమ బతుకుల అఖరిశ్వాసలు తీస్తున్న రైతన్న వెతలు ఇప్పుడు మన నేలపై దర్శనమిస్తున్నాయి. వెలుగుల జీవితం కనుమరుగుయైపోయింది. అలుముకున్న చీకట్ల బతుకుల్లో దీపాలు వెలిగించేదెవరు? దీపం, చీకట్లను తరిమే వెలుగే కానీ జీవితంలోని చీకటిని తరిమేయకుండా కేవలం దీపాలను వెలిగించి సంబరపడితే ఉపయోగమేముంది!

నరకాసురుని వధించిన సందర్భాన్ని, ఒక పీడకుని మరణాన్ని ఉత్సవం చేసుకోవడం మనకు పురాణకాలం నుంచే ఉందనడానికి ఇదో ఉదాహరణ. పీడకులు, జనం చేత తరిమికొట్టబడుతారనేది వాస్తవమే. కానీ కొందరి మరణ సన్నివేశాన్ని పండుగెలా చేసుకుంటారు? ఇప్పుడది తమకు నచ్చని, ప్రత్యర్థి మరణమూ వేడుకలా మారిపోయింది. ఇది అత్యంత అనాగరికం. నేడొక అనాగరిక ఆలోచనా ధోరణి పెరిగిపోతోంది. దీనికి మనకు తరతరాలుగా వస్తున్న పురాణా కథా సందర్భాలు పునాదిగా నిలుస్తున్నాయా! ఆలోచించాల్సిన అంశం. చర్చ జరగవలసి ఉంది. రాజుల, ఆధిపత్య వర్గాల కాలంలోని కథనాల పరంపర ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ అంతర్గతంగా కొనసాగటాన్ని గమనించవచ్చు. ఇది నిరంకుశ, ఆధిపత్య వర్గాలను బలపరచు అంశంగానూ పనిచేస్తుంది. ఇవన్నీ చర్చించి తేల్చదగిన అంశాలు. అయితే సంతోషానికి, సంబరాలకు ప్రతీకగా నిలిచే వెలుగుల శోభకు దీపం కారణమే. ఈ దీపాన్ని, దీపపు మూలమైన అగ్నిని, నిప్పును కనిపెట్టిన వాడు మాత్రం ఆదిమ మానవుడే.

అతని నిరంతరాన్వేషణ, పరిశ్రమలోంచి చీకటిని తరిమే వెలుగూ, నిప్పూ ఆవిష్కృతమయ్యాయి. ఆ చరిత్రను అలా ఉంచితే ఇపుడు అనాదిగా వస్తున్న దీపావళి పండుగను సంతోషంగా జరుపుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ముఖ్యంగా దేశానికి వెన్నెముక అన్నదాత తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. ప్రకృతి విపత్తుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు రైతు. మురస తుఫాను కారణంగా చేలనిండా కన్నీళ్లు నిండి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా కొట్టుకుపోయింది. గుండెలు పగిలిపోయిన రైతన్నలు ఏం సంబరాలు చేసుకుంటారు! ఏం చేయాలో తెలియక నిరాశలో గ్రామీణమంతా మునిగిపోయి ఉంది. ఒకవైపు ఎల్‌‌నినో కారణంగా కరువు కోరలు చాస్తుంటే, రెండోవైపు తుఫాను బీభత్సం వ్యవసాయాన్ని దుఃఖ సాగరం చేసింది. ప్రభుత్వాలు మరి ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఏం చేస్తాయో ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు, కార్పొరేట్ పద్మ వ్యూహంలో చిక్కుకుని రోధిస్తున్నాడు.

ప్రభుత్వాలు పైపు మాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నాయి. రాజకీయాలు, అధికారం తప్ప ప్రజలగోడు పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇది రైతు ఒక్కడి పరిస్థితే కాదు దేశంలోని సామాన్యప్రజలు ఎన్నో ఇక్కట్లతో బతుకులీడుస్తున్నారు. నిత్యావసరవస్తువుల ధరలు నింగినంటి పోతున్నాయి. ఉపాధిలేమి, ఆదాయాల కొరత సమస్యగా మారుతున్నది. ఒక్క కరువే కాదు, మంచినీటి కొరతా, భూగర్భజలాలు ఇంకిపోవటం పెద్ద సమస్యగా తలెత్తుతున్న తరుణంలో దీపాలు వెలిగిస్తేనే సరిపోదు. జీవనమేలా గడుస్తుందో చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులే కాదు, వీటితో సామాజిక సమస్యలు, మానసిక సమస్యలు పెరిగి విపరీత నేరధోరణి, హింసా ప్రవృత్తి పెరిగిపోతున్నది. అనంతపురం రంపపు ఘటన చూస్తే, మనం ఎలాంటి మనస్తత్వాలను ఉత్పత్తి చేస్తున్నామో అర్థమ వుతుంది. ఇవి వ్యక్తిగతాలు కావు. సమాజానికి మనమేమి ఇస్తామో, సమాజమూ తిరిగి ఇస్తూ ఉంటుంది.

మంచి సమాజాన్ని నిర్మిస్తే, మంచి మనుషులూ తయారవుతారు లేదంటే ఇలా ఉంటుంది. దీపాలు వెలిగించాల్సిందే, కానీ సమాజంలో సమస్యల చీకట్లు వెలుగుతుంటే, చమరు దీపాలు వెలుగును నింపలేవు. అయితే నిజమైన వెలుగులు నింపే ప్రయత్నమూ చిగురిస్తూ ఉంది. మానవ హననానికి పూనుకున్న హంతకులు ఓటమి పాలవుతున్నారు. ఇజ్రాయిల్‌లో ‌నెతన్యాహును, అమెరికాలో ట్రంప్ ను, అక్కడే ప్రజలే ఛీ కొడుతున్నారు. మన దేశంలో కూడా యువత అద్భుతమైన శక్తితో గొంతు విప్పుతోంది. ఇవి నిజమైన దీపావళికి దోహదం చేస్తాయని ఆశిద్దాం!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్