Magazines

ఇజ్రాయిల్‌లో మరోసారి ఎన్నికలు?

2 గంటల క్రితం

Elections in Israel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 3 నిమిషాల చదవడం

మంగళవారం నాడు ఇజ్రాయిల్‌ పార్లమెంటు కెనెసెట్‌కు జరిగిన 26వ ఎన్నికల్లో ఏ పార్టీ లేదా కూటమికి మెజారిటీ ఇవ్వకుండా ఓటర్లు ఒక విచిత్రమైన తీర్పు ఇచ్చారు. వర్తమాన చరిత్రలో బహుశా ఏ దేశంలోనూ ఇలాంటి పరిణామం సంభవించలేదని చెప్పవచ్చు. మొత్తంగా మూడు కూటములు పోటీపడ్డాయి. యూదు దురహంకారం, పాలస్తీనియన్ల అణచివేత, వారి మాతృభూమి ఉనికిలోకి రాకుండా అడ్డుకోవటంలో కుడి ఎడమల తేడా తప్ప రెండు కూటములు యూదు దురహంకారులతో నిండినవే. మూడవ పక్షంగా పాలస్తీనియన్లతో కూడిన అరబ్బు పార్టీలు ఉన్నాయి. పార్లమెంటులోని 120 స్థానాల్లో మెజారిటీకి 61 అవసరం కాగా ఏ ఒక్క కూటమికి అన్ని సీట్లు రాలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నరహంతకుడు నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీ బలం 32 నుంచి 26కు, కూటమి సంఖ్య 67 నుంచి 53కు పడిపో యింది. మాజీ సైన్యాధికారి నాయకత్వంలోని కొత్త పార్టీ యషర్ 21తో రెండవ పెద్ద పక్షంగా అవతరించింది.

వామపక్ష, పురోగామి ప్రజాతంత్ర శక్తులైన మూడు పార్టీల అరబ్బుల సంయుక్త జాబితా కూటమికి పన్నెండు రాగా, ఇస్లామిక్ ఛాందసుల నాయకత్వంలోని మరొక అరబ్బు పార్టీ రామ్‌కు ఏడు సీట్లు వచ్చాయి. అరబ్బులు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని చోరీ చేశారంటూ ఓటమిని జీర్ణించుకోలేని లికుడ్ పార్టీ ఆరోపించింది. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే డోనాల్డ్ ట్రంప్ లేదా ఇజ్రాయిల్‌కు మద్దతిచ్చే ఇతర దేశాలు అక్కడ జరిగిన ఎన్నికలు ఒక ప్రహసన ప్రాయంగా జరిగాయన్న దాన్ని మూసిపెడుతున్నాయి. ఎన్నికలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ గతంలో దూరంగా ఉన్న అరబ్బులందరూ ఈసారి ఓటింగ్‌కు రావటం ఒక ముఖ్యపరిణామం. దామాషా ప్రాతినిధ్య విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి గనుక వారికి ప్రాతినిధ్యం వహించే పార్టీల బలం పది నుంచి 19కి పెరిగింది. ఆ మేరకు యూదు దురహంకారులు తగ్గారు. ‘ఇరాన్ పాలకులను మట్టుబెడతాం, దేశాన్ని సర్వనాశనం చేస్తామంటూ’ అమెరికాతో కలసి దాడులకు దిగిన నెతన్యాహు సాధించిందేమిటి అన్న ప్రశ్న తలెత్తింది.

రెండవది, మూడేండ్ల క్రితం అక్టోబరు ఏడున హమాస్ సాయుధులు ఒక పెద్దదాడికి ప్రయత్నిస్తున్నారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుగానే హెచ్చరించినప్పటికీ ఎందుకు నివారించలేకపోయారన్న ప్రశ్న అతగాడిని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఓటమికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు.తన బంటు గురించి తొలుత భయంకరమైన వార్తలు వచ్చాయని ఫలితాలు చూసిన తరువాత గుండె నిబ్బరపడిందన్నట్లు డోనాల్డ్ ట్రంప్ స్పందన ఉంది. యూదు దురహంకారి నెతన్యాహును వ్యతిరేకించే శక్తులు కూడా అదే తరగతికి చెందినవే అయినా అధికార కుమ్ములాటల కారణంగా విడివిడిగా పోటీచేశాయి. ఇజ్రా యిల్‌లో రెండవ తరగతి పౌరులుగా ఉన్న పాలస్తీనియన్ అరబ్బులకు ప్రాతినిధ్యం వహి స్తున్న పార్టీలలో కూడా సైద్ధాంతిక సారూపత్యత లేని కారణంగా రెండు పక్షాలుగా పోటీ చేశాయి. పందొమ్మిది స్థానాలున్న ఈ పార్టీలు ఇప్పుడు కీలకంగా మారాయి. వాటి మద్దతు లేకుండా ఏ యూదు కూటమీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు.

ఒకదానికి 53, మరొకదానికి 48 వచ్చాయి. ‘పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేం’ అన్నట్లుగా ఈ రెండూ ఒకటే అయినప్పుడు అరబ్బుల పార్టీలు ఎవరికి మద్దతివ్వాలి అనేది పెద్ద సమస్య. నెతన్యాహును తిరిగి అధికారానికి రానిచ్చే ప్రసక్తే లేదని, తమ అజెండాను అంగీకరిస్తే ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచి మద్దతిచ్చే అవకాశం ఉందని సంయుక్త జాబితా కూటమి నేతలు చెబుతుండగా రామ్ పార్టీ తాము ప్రభుత్వంలో చేరటానికి సిద్ధమేనన్న సంకేతాలిస్తోంది. గతంలో ఒకసారి అలా చేరి ఈ పార్టీ చేతులు కాల్చుకుంది. చిత్రం ఏమిటంటే ఈ పార్టీలో ఇస్లామిక్ ఛాందసులతో పాటు యూదు దురహంకారులు కూడా ఉన్నారు. దుర్మార్గుడైన నెతన్యాహును అడ్డుకోవటం వరకు సరే, తమపై కొనసాగుతున్న అణచివేత చర్యల మాటేమిటన్న ప్రశ్న సహజంగానే అరబ్బులో తలెత్తుతుంది.. నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతాన్ని సర్వనాశనం చేసి దాదాపు 70వేల మందిని ఊచకోత కోసిన సంగతి తెలిసిందే, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అతగాడిని గద్దెదించాలని ఎన్నికల్లో పోటీ చేసిన శక్తులు కూడా ఆ దురంతాలను సమర్ధించినవే.


అటువంటపుడు ఏ ప్రాతిపదికన అరబ్బు పార్టీలు ఏ కూటమికి మద్దతిస్తాయన్నది ప్రశ్న. వాటి షరతులకు అంగీకరించేది లేదని యూదు దురహంకారులు స్పష్టంగా చెబుతున్నారు. ఈ పూర్వరంగంలో జాతీయ ప్రభుత్వ ఏర్పాటు గురించి కొందరు మల్లగుల్లాలు పడుతున్నారు. అరబ్బులపై ఆధారపడటం, వారి షరతులకు అంగీకరించటం, ఏ క్షణంలో ప్రభుత్వం కూలిపోతుందో అన్నట్లుగా ఉండటం ఎందుకు, అందరం ఒకేతానులో ముక్కలం గనుక నెతన్యాహను పక్కన పెట్టి కొత్త కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పోలా అనే ఆలోచన కూడా వచ్చింది. ‘నెతన్యాహుతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేందుకు జోక్యం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు ఇంతవరకు ఆలోచించలేదు. మీరు చెప్పారు గనుక చూద్దాం’ అని ట్రంప్ మాట్లాడటం కూడా గమనించాల్సిన అంశం. ఇజ్రాయిల్‌లో అధికార కుమ్ములాటలు, మధ్యంతర ఎన్నికలు కొత్త కాదు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు 28 రోజుల గడువు ఉంది, అవసరమైతే మరో 14 రోజులు పొడిగిస్తారు. అప్పటికీ పార్టీలు ఒప్పందానికి రాకపోతే తిరిగి ఎన్నికలు జరపటం తప్ప మరొక మార్గం లేదు. అదే జరుగుతుందా, పార్టీల ఫిరాయింపులు, అవకాశవాద పొత్తులకు తెరలేపుతారా?

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్