రైతును సంక్షోభంలోకి నెట్టేలా మోడీ సర్కారు వాణిజ్య ఒప్పందాలు
దక్షిణాది రాష్ర్టాల్లో తీవ్రంగా ఎల్‌నినో ప్రభావం
కేంద్ర ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి : ఏఐకేఎస్ జాతీయ మహాసభల పాటల ఆవిష్కరణలో విజ్జూకృష్ణన్
15న నల్లగొండలో రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు
నాలుగు రోజుల పాటు ఏఐకేఎస్ జాతీయ మహాసభలు : పోతినేని, టి.సాగర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మద్దతు గ్యారెంటీ చట్టం, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ రైతాంగ ఐక్య ఉద్యమం చేపడతామని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్ ప్రకటించారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే ఏఐకేఎస్ 36వ మహాసభలను జయపద్రం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐకేఎస్ ఆలిండియా 36వ మహాసభలను పురస్కరించుని ప్రజానాట్యమండలి రూపొందించిన ‘మట్టిపూల పరిమళాలు - రైతాంగ పోరాట గీతాలు’ పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. పీఎన్‌ఎమ్ రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజ్ఞకృష్ణన్ మాట్లాడుతూ.. మన దేశంలోని రైతులను సంక్షోభంలోకి నెట్టేలా మోడీ సర్కారు వాణిజ్య ఒప్పందాలు న్నాయనీ, అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్ దేశాలతో చేసుకున్న వ్యవసాయ వాణిజ్య ఒప్పందాలు అన్నదాతలకు అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని రూపొందించడంలోనూ, ఢిల్లీ రైతాంగ పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ మోడీ సర్కారు విఫలమైందని విమర్శించారు.
రైతాంగ హక్కుల కోసం పోరాటాలను తీవ్రతరం చేయబోతున్నామని తెలిపారు. పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ రైతులను చైతన్యపరిచి త్వరలోనే ఐక్య ఉద్యమాలను చేయబోతున్నట్టు ప్రకటించారు. దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకతో పాటు మహారాష్ట్రలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందనీ, కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి రైతులకు తక్షణమే మేలు చేసేలా సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ... ఏఐకేఎస్ మహాసభల ప్రారంభ సూచికగా నవంబర్ 15న నల్లగొండలో రెడ్‌షర్ట్ వాలంటర్లీ కవాతు, భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. కవాతును, మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 22 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ, అన్ని పంటల రైతులకూ ఆ ధరకు కొనుగోలు హామీ లేదని తెలిపారు.
2024–25లో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉత్పత్తి అయిన గోధుమల్లో సుమారు 23శాతం, వరి ఉత్పత్తిలో 49 శాతాన్ని మాత్రమే సేకరించిందని వివరించారు. మద్దతు ధర నిజంగా అందేలా చట్టబద్ధ హామీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అవసరమని నొక్కి చెప్పారు. సీటూపై 50 శాతం కలిపి అన్ని పంటలకూ గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభం, రైతుల హక్కులు, రైతాంగ ఐక్యత వంటి అంశాలను ప్రతిబింబించేలా పాటలున్నాయనీ, అవి రైతాంగ ఉద్యమానికి సాంస్కృతికంగా దోహదపడతాయని ఆకాంక్షించారు. రైతుల జీవితాలు, వారి పోరాటాలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజలకు అర్థమయ్యేలా రచయితలు పాటలను రాశారని కొనియాడారు.
పాటల రచయితలు మందుల విప్లవ్, రాచకొండ రమేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డమీద ఏఐకేఎస్ మహాసభలు జరగబోతుండటం ఆనందంగా ఉందన్నారు.
రైతుల మీద వస్తున్న పాటలను నిక్షిప్తం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సమస్య వచ్చినప్పుడు స్పందించే గుణం, చైతన్యం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డకుందన్నారు. కట్ట నర్సింహ మాట్లాడుతూ... ఏఐకేఎస్ మహాసభల సందర్భంగా పాటలు రాయాలని కోరితే రచయితలు 70 పాటలు రాసి పంపారనీ, ప్రతి ఒక్కపాటలోనూ అద్భుతమైన సాహిత్యం ఉందని చెప్పారు. ఇప్పటికే 27 పాటలను రికార్డు చేశామనీ, మిగతావాటిని చేసే పనిలో ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉడత రవీందర్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు జె.వినోద్, సోషల్ మీడియా బాధ్యులు పిట్టల రవి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, ప్రయివేటు కాలేజీల లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ. విజయ్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)