Magazines

పశువులకు మేతగా వరి పొలాలు

55 నిమిషాల క్రితం

Rice fields
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 2 నిమిషాల చదవడం

నీరందక ఎండిన పైర్లు.. పెట్టుబడి రాని వైనం

​ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 68 మండలాల్లో కరువు విలయం

​ఎకరాకు రూ.40 వేల పరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్


​నీరందక పైర్లు కండ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. పంట చేతికొస్తే నాలుగు గింజలు ఇంటికి చేరుతాయని ఆశపడిన రైతులకు నిరాశే మిగిలింది. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత వెరసి వరి పైర్లను నిలువునా ఎండబెట్టాయి. పొట్టకొచ్చిన పైరుకు నీరందక ఎండుముఖం పట్టాయి. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వరి పైరును పశువుల మేతకు వదిలేస్తున్నారు. కోత ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో పంటను కోయడం కంటే పశువులకు మేతగా అందించడమే మేలని భావిస్తున్నారు.


​నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి ​

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు పరిస్థితులు రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మూడు జిల్లాల్లోని 68 మండలాలను ప్రభుత్వం కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించగా, వీటిలో 25 మండలాలు తీవ్ర కరువు, 43 మండలాలు మోస్తరు కరువు కేటగిరీలో ఉన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ​నీళ్లు లేక.. ఎండిన పంట ​వరి సాగులో పెట్టుబడులు పెట్టిన రైతులకు చివరకు పశువుల మేత కూడా సరిగా దక్కని పరిస్థితి ఏర్పడింది. చెర్లపల్లికి చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి నాలుగెకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు సుమారు రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు.


మొత్తం నాలుగు ఎకరాల్లో సాగు చేసిన పంట నీరు అందక ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ పశువుల కోసం కోసుకెళ్తున్నామని చెప్పారు. నీటి కొరతతో పాటు విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడమే ప్రధాన కారణమని ఆవేదన చెందారు. రాత్రంతా విద్యుత్ సరఫరా ఉండటం లేదని, తెల్లవారు జామున నాలుగు, ఐదు గంటలు మాత్రమే కరెంట్ ఇస్తే పంటలు ఎలా పండుతాయని ప్రశ్నించారు. పడిన కష్టమంతా వృథా అయిందని, పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రాజశేఖర్‌‌రెడ్డితోపాటు పలువురు రైతులు వాపోతున్నారు. ​పశువుల మేతగా మారిన వరి చేలు ​వరి పంటలు పొట్టకొచ్చిన దశలో నీరు అందక ఎండిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటను కోస్తే కూలీల ఖర్చులు కూడా రావని భావిస్తున్న రైతులు, ఎండిన వరి పైరును పశువుల మేతకు వదిలేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలకు ఈ నష్టం కోలుకోలేని దెబ్బగా మారింది. ​​పెట్టుబడి పోయింది..

అప్పులు మిగిలాయి ​వరి సాగు కోసం రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, దుక్కి దున్నడం, నాట్లు వేయడం, ఇతర వ్యవసాయ పనులపై పెట్టుబడులు పెట్టారు. పంటకు నీరు అందించేందుకు కూడా ఖర్చు చేశారు. తీరా పైర్లు ఎండిపోవడంతో పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దిగుబడి రాకపోవడంతో పాటు, కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి? కుటుంబాలను ఎలా పోషించాలి? వచ్చే యాసంగి సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలి? అనే ప్రశ్నలు రైతులను వేధిస్తున్నాయి. రైతుల కష్టాన్ని గుర్తించి, పెట్టుబడి నష్టాలను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


​​ఎకరాకు రూ.40 వేల పరిహారం చెల్లించాలి

విద్యుత్ సరఫరా సరిగా లేక వరి పంటంతా పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పంటను సాగు చేసేందుకు ఎంతో కష్టపడ్డాం. చివరకు పంట చేతికి రాకుండా పోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఎకరాకు రూ.40 వేల చొప్పున పరిహారం చెల్లించాలి.
- బత్తుల వెంకన్న రైతు, జీకే అన్నారం

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్