Magazines

మంగళ సీడ్స్ సిద్ది వ్యవసాయ క్షేత్రాల పరిశీలన

50 నిమిషాల క్రితం

agricultural
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 2 నిమిషాల చదవడం

​ముమ్మాటికీ నకిలీవే అంటున్న రైతులు

ల్యాబొరేటరీ నివేదికలతోనే ఫలితాలంటున్న శాస్త్రవేత్తలు


నవతెలంగాణ-గోవిందరావుపేట
గోవిందరావుపేట మండలంలో మంగళ సీడ్స్ సిద్ధి డబ్ల్యూజీఎల్‌ 44 వరి విత్తనాల సాగుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యపై కదలిక మొదలైంది. పంట ఎదుగుదలలో పొట్టదశ, పాలు పోసుకునే దశ.. తదితర తేడాలపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గురువారం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి దిగి పంట పరిస్థితిని పరిశీలించారు. వరి మొక్కల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపేందుకు చర్యలు చేపట్టారు. దీంతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో రైతులు నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని రాంనగర్‌, దుంపెల్లిగూడెం గ్రామాల్లో రైతుల వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి కే.జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు డాక్టర్ విశ్వతేజ, డాక్టర్ సౌందర్య పరిశీలించారు. సిద్ధి డబ్ల్యూజీఎల్‌ 44 రకం వరి మొక్కల నమూనాలను సేకరించారు.

పంట ఎదుగుదలలో తేడాలపై కారణాలను తెలుసుకునేందుకు ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించి, అనంతరం నివేదిక అందిస్తామని తెలిపినట్టు సమాచారం. మంగళ సీడ్స్‌ సూపర్‌వైజర్‌ సైతం శాస్త్రవేత్తలతో కలిసి రైతుల పొలాలను పరిశీలించి పరిస్థితిని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని ఐదు ఫర్టిలైజర్‌, పెస్టిసైడ్స్‌ దుకాణాల ద్వారా సుమారు 1500 ఎకరాలకు మంగళ సీడ్స్ సిద్ధి విత్తనాలు సరఫరా అయినట్టు వ్యాపారులు, రైతులు తెలుపుతున్నారు. విత్తనాలు విక్రయించిన దుకాణాల యజమానులు కూడా మంగళ సీడ్స్‌ యాజమాన్యంతో మాట్లాడారు. దీనిపై యాజమాన్యం తరపున అశోక్‌ స్పందిస్తూ, శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని, రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.


పంటపై ఆశలు పెట్టుకుని పెట్టుబడులు పెట్టిన రైతులకు దిగుబడి విషయంలో అనిశ్చితి నెలకొంది. శాస్త్రవేత్తల నివేదిక ఆలస్యం కాకుండా అందించాలని, పంట నష్టాన్ని అంచనా వేసి బాధితులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. కంపెనీ యాజమాన్యం ఇచ్చిన హామీ మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో నిలబెట్టుకోవాలని, సంబంధిత అధికారులు కూడా రైతుల సమస్యను పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు మండలంలో మరెప్పుడూ పునరావృతం కాకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీఐ దయాకర్‌, ఎస్‌ఐ తాజోద్దీన్‌‌ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ​ఆందోళన చేపట్టిన బాధిత రైతులు.. మంగళ సీడ్స్ నకిలీ సిద్ధి విత్తనాల పరిశీలనకై శాస్త్రవేత్తలతో పాటు మంగళ సీడ్స్ కంపెనీ సిబ్బంది కూడా రావడంతో ఒక దశలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ఇక్కడే ఉండాలని, రైతాంగానికి అన్యాయం జరిగిందని, రిపోర్టులు వచ్చేంతవరకు వేచి చూస్తామని ఆందోళన చేశారు. కంపెనీకి విత్తనాలను సప్లయ్‌ చేసే పలువురు వ్యాపారులు రైతులను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్