Magazines

కాలుష్య కోరలు

33 నిమిషాల క్రితం

Pollution
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 3 నిమిషాల చదవడం

మనిషికి ఆహారం, నీరు ఎంత అవసరమో స్వచ్ఛమైన గాలి కూడా అంతే అవసరం. అలాంటి ప్రాణాధారమైన గాలే ఇప్పుడు విషతుల్యంగా మారుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని మహానగరాలు క్రమంగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. వాయుకాలుష్యం అంటే దేశ రాజధాని ఢిల్లీ గురించే చెప్పుకునేవారు. పరిశ్రమలు, వాహనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే పరిమితమైన వాయు కాలుష్యం ఇప్పుడు నివాస ప్రాంతాలు, చివరకు పల్లెలకూ విస్తరిస్తోంది. ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన పండుగలు కాలుష్య బీభత్సానికి కారణమవుతున్నాయి. దీపావళి పండుగ తరువాత ఢిల్లీతోపాటు హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడం పర్యావరణ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. ఢిల్లీలో నవంబరు 10న ఉదయం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 366కు చేరింది. ఢిల్లీలోని కొన్నిచోట్ల ఎక్యూఐ 460 వరకు ఉంది. 301 నుంచి 400 మధ్య ఏక్యూఐ ఉంటే వెరీ పూర్‌గా, 401 నుంచి 500 మధ్య ఉంటే సీవియర్‌గా పరిగణిస్తారు.

ఈ లెక్కన ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు పీల్చే గాలి ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించింది. హైదరాబాద్‌లోనూ కాలుష్య తీవ్రత పెరిగినట్టు నివేదికలు వెల్లడించాయి. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల సమయంలో పలు ప్రాంతాల్లో 500 పాయింట్లు దాటిపోయింది. హైదరాబాద్‌ నగర ‌యావరేజ్‌ ‌సగటు 80 పాయింట్లు. సాధారణ రోజులతో పోలిస్తే గాలిలో కాలుష్య కారకాల తీవ్రత రెట్టింపు అయిందని స్పష్టమవుతుంది. దీంతో ఆస్తమా, శ్వాసకోశ సమస్యలున్నవారు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. పండగ ఆనందం కోసం కాల్చిన టపాసులు చివరకు ప్రజల ఆరోగ్యానికి సవాలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో దీపావళి బాణసంచా(టపాసుల) వార్షిక మార్కెట్‌ ‌వ్యాపార విలువ సుమారు రూ.ఏడు వేల కోట్లు ఉంటుందని అంచనా. అత్యధికంగా దీపావళి పండుగ సమయంలోనే టపాసుల కొనుగోళ్లు జరుగుతాయి.

తమిళనాడులోని శివకాశి నుంచే 80 శాతం పైగా అమ్మకాలు జరుగుతుంటాయి. ఫ్యాక్టరీ తయారీ విలువ రూ. రెండు వేల కోట్లు ఉంటే, మిగిలిన రూ. ఐదు వేల కోట్లు రవాణా, హోల్‌‌సేల్‌, రిటైల్‌ ‌వ్యాపారాల ద్వారా జరుగుతుంది. ఢిల్లీ, బెంగళూరుల్లో రూ.300 కోట్ల వ్యాపారం నడుస్తోంది. హైదరాబాద్‌‌లో రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఉంటుంది. కరీంనగర్‌ జిల్లాలోనూ సుమారు రూ.8 కోట్ల మేర బాణసంచా వ్యాపారం జరగడం గమ నార్హం. దీనిద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ది పొందుతున్నా.. టపాసుల తయారీ సమయంలో చాలా కుటుంబాలు ప్రమాదాల బారీన పడుతుంటాయి. పర్యావరణ హిత(గ్రీన్‌) ‌టపాసుల తయారీ విషయంలో శ్రద్ధ చూపితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాయు, శబ్ద కాలుష్యంతో పాటు అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. దేశంలో అగ్ని ప్రమాదాలకు గురై 23మంది చనిపోయారు. కండ్లు పొగొట్టుకున్నవారూ ఉన్నారు.

ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న ప్రజలపై పండగుల సమయంలో కాల్చేవాటితో అదనపు భారాన్ని మోపుతున్నాయి. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమల ఉద్గారాలు, నిర్మాణ రంగం నుంచి వచ్చే ధూళి, రహదారులపై పేరుకుపోయే దుమ్ము, చెత్తను బహిరంగంగా కాల్చడం, పంట వ్యర్థాల దహనం వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వీటికి తోడు శీతాకాలంలో గాలి వేగం తగ్గడం, వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య కారకాలు భూమికి దగ్గరగా నిలిచిపోతున్నాయి. గాలి నాణ్యత ప్రమాదకరంగా మారినప్పుడు పాఠశాలలను మూసివేయడం, ప్రజలు మాస్కులు ధరించాలని సూచించడం, బయట వ్యాయామాలు చేయవద్దని హెచ్చరించడం తాత్కాలిక ఉపశమన చర్యలే తప్ప శాశ్వత పరిష్కారాలు కావు. 2019లో కాలుష్యం తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు మాస్కులు ధరించి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రతిరోజూ ధరించక తప్పని పరిస్థితి. కాలుష్యానికి మూలమైన కారణాలను తొలగించకుండా తాత్కాలిక చర్యలతో ప్రయోజనం ఏముంటుంది?

కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల ఆరోగ్యం విషయంలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ​కాలుష్య నియంత్రణకు దేశంలో చట్టాలు, విధానాలు, సంస్థలు లేవని చెప్పలేం. 2018లో సుప్రీంకోర్టు దీపావళి టపాసుల వినియోగంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే గ్రీన్‌ క్రాకర్స్‌ను ప్రోత్స హించాలని, నిషేధిత రసాయనాలతో తయారైన బాణసంచాను విక్రయించ కూడదని స్పష్టం చేసింది. 2021లో ప్రత్యేక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని వ్యవస్థలు, నిబంధనలు ఉన్నా కాలుష్యం ఎందుకు అదుపులోకి రావడం లేదన్నదే అసలు ప్రశ్న. కాలుష్య నియంత్రణ మండలి కేవలం గణాంకాలు సేకరించే సంస్థగానే మిగిలిపోకూడదు. దీపావళి అంటే టపాసుల మోతే అన్న భావన మారాలి. పర్యావరణ పరిరక్షణను ప్రకటనలకే పరిమితం చేయకుండా కార్యాచరణలో చూపాలి. లేదంటే భవిష్యత్తులో మన నగరాల్లో వెలుగులు, వైభవాలు మిగిలినా.. స్వచ్ఛంగా పీల్చుకునే గాలి మాత్రం కరువయ్యే ప్రమాదం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్