Magazines

అవినీతి ఊబిలో ట్రంప్ ప్రభుత్వం

1 గంట క్రితం

a quagmire of corruption
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 3 నిమిషాల చదవడం

కాసులు కురిపిస్తే క్షమాభిక్షలు...నజరానాలు
మధ్యంతరంలో ఓటర్లపై ప్రభావం చూపబోతున్న ఆరోపణలు

స్వతంత్ర దర్యాప్తునకు డెమొక్రాట్ల డిమాండ్

వాషింగ్టన్ : మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా ఓటర్లు ప్రభుత్వ అవినీతిపై ఆందోళన చెందుతున్నా రని పలు సర్వేలు చెబుతున్నాయి. సీఎనఎన్ వార్తా సంస్థ బుధవారం నిర్వహించిన ఒక పోల్‌లో 19 శాతం మంది ఓటర్లు ట్రంప్ ప్రభుత్వంలోని అవినీతిని ఎత్తిచూపారు. ఆర్థిక పరిస్థితులు, జీవనవ్యయం తర్వాత ఇదే తమకు ప్రధాన సమస్యగా ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ట్రంప్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఇప్పటికి ప్పుడు పుట్టుకొచ్చినవి కావు. అవి చాలా కాలంగా అధ్యక్షుడిని, రిపబ్లికన్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ఆరోపణలు మరింతగా పెరిగిపోయాయి.

పెట్టుబడి పెడితే కేసులు మాఫీ

ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రభుత్వం, సన్నిహితులపై అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు, వాచ్‌డాగ్స్, ప్రభుత్వ నివేదికలు కథనాలను అందించాయి. ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం క్షమాభిక్షలు. తనకు అనుకూలంగా విరాళాలు ఇచ్చిన లేదా వ్యాపార ప్రయోజనాలు చేకూ ర్చిన వారికి ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నా రని అనేక కథనాలు వచ్చాయి. వీటిలో 96 శాతం వరకూ న్యాయశాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల ఆధారంగా ఇచ్చినవేనని రాయిటర్స్ వార్తా సంస్థ ఓ పరిశోధనాత్మక నివేదికలో తెలియజేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో గత సంవత్సరం అక్టోబర్‌లో క్షమాభిక్ష పొందారు. అంతకుముందే ట్రంప్ కుటుంబం యొక్క ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల’ క్రిప్టో సంస్థలో యూఏఈకి చెందిన బైనాన్స్ సుమారు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అలాగే అనేక మిలియన్ డాలర్ల జరిమానాలు కట్టాల్సిన బిట్‌మెక్స్‌ క్రిప్టో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను కూడా గత సంవత్సరం మార్చిలో ట్రంప్ క్షమించేశారు. అమెరికాలో పది బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రకటించిన తర్వాత యూఎస్ న్యాయ శాఖ ఆగస్టులో ఆయనపై ఉన్న క్రిమినల్ అభియోగాలను ఉపసంహరించుకుంది.

ఫిర్యాదులను నీరుకార్చారు

తనపై వచ్చే అవినీతి ఫిర్యాదులను నీరుకార్చడానికి ట్రంప్ ప్రభుత్వం నిబంధనలను సడలించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారుల ఆర్థిక ప్రయోజనాలను పర్యవేక్షించే ఓజీఈ చీఫ్‌ను ట్రంప్ గత సంవత్సరం ఫిబ్రవరిలోనే తొలగించారు. ఆ స్థానాన్ని ఏడాదికి పైగా ఖాళీగా ఉంచారు. న్యాయ శాఖ పరిధిలోని ‘ఆఫీస్ ఆఫ్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబులిటీ’ (ఓపీఆర్) డైరెక్టరును కూడా తొలగించారు. దీంతో 1,600 ఫిర్యాదులు వచ్చినప్పటికీ కేవలం ఏడు దర్యాప్తులు మాత్రమే ప్రారంభమయ్యాయి.

అవినీతి గుట్టు రట్టు చేసిన సీఎన్‌ఎన్

సీఎన్ఎన్ ప్రచురించిన తాజా కథనం ప్రకారం... డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహ వేడుకల ఖర్చులను రష్యాకు చెందిన ఓ కోటీశ్వరుడు చెల్లించారు. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో ఆ సొమ్మును వాపసు చేశారు. అలాగే న్యాయ శాఖలో సీనియర్ సలహాదారుగా ఉంటూనే వెనిజులా బ్యాంక్ నుంచి యాభై మిలియన్ డాలర్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని ట్రంప్ మద్దతుదారు అంగీకరించాడు. అనంతరం ఆ బ్యాంకుపై ఆరోపణలను ట్రంప్ బుట్టదాఖలు చేశారు. ప్రభుత్వంలో లాబీయింగ్ చేసి సాయపడినందుకు ప్రతిఫలంగా తన లక్ష డాలర్ల అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు అప్పు తీర్చమని మాజీ రాయబారి ఒకరు ఓ వ్యక్తిని కోరారు. దీనికి సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు ఉంచవద్దని అతనికి సూచించారు. విరాళం అందజేసిన వ్యక్తి నుంచి ట్రంప్ ప్రభుత్వం అధిక ధరలకు పలు విమానాలను కొనుగోలు చేసింది. ఆ వ్యక్తి మ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పదవి నుంచి తప్పుకుంటున్న కార్యదర్శికి అత్యంత సన్నిహితుడు. టర్కీకి చెందిన సంపన్న పెట్టుబడిదారులు బదిలీ చేసిన అనేక మిలియన్ డాలర్ల రహస్య నిధులను ట్రంప్ మద్దతుదారుడొకరు తప్పుగా మళ్లించాడు.

అవినీతి తీవ్ర సమస్యే

ట్రంప్ ప్రభుత్వంలో అవినీతి తీవ్రమైన సమస్యగా ఉన్నదా అని సీఎనఎన్ నిర్వహించిన తాజా పోల్‌లో ఓటర్లను ప్రశ్నించగా అవునని 64 శాతం మంది చెప్పారు. ట్రంప్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు తమ ఓటింగ్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని ఎన్నికల ఫలితాలను శాసించే కీలక రాష్ట్రాలకు చెందన సుమారు 61 శాతం మంది స్వతంత్ర ఓటర్లు తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా బిలియనీర్లు, విదేశీ శక్తుల కోసమే పనిచేస్తోందని డెమొక్రాట్లు తమ ఎన్నికల ప్రచారంలో ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు.
విరాళాలు బహుమతులకు ప్రతిగా నజరానాలు

అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశాధినేతలు విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు లేదా బహుమతులు తీసుకోకూడదు. కానీ ఖతార్ ప్రభుత్వం నుంచి ట్రంప్ వందల మిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ 747 లగ్జరీ జెట్ విమానాన్ని బహుమతిగా పొందారు. ఆ తర్వాత ఖతార్‌తో రక్షణ, వ్యాపార ఒప్పందాలను వేగవంతం చేశారు. అధ్యక్షభవనం ఓ భారీ బాల్‌రూమ్ నిర్మాణానికి నిధులు సేకరించడం కోసం కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, బిలియనీర్ల నుంచి విరాళాలు కోరిందని కథనాలు వచ్చాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ వాలెట్లు, విదేశీ చెల్లింపుల ద్వారా ఆయన కుటుంబం సుమారు 2.25 బిలియన్ డాలర్ల లాభాలు మూటకట్టుకున్నదని అంచనా. ఇందులో ఎక్కువ భాగం క్రిప్టో వ్యాపారాలు, బ్రాండెడ్ వస్తువుల లైసెన్సింగ్ ఒప్పందాల ద్వారానే వచ్చింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్