ఇప్పటికే ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్న 5కోట్ల మంది .. ట్రంప్ పాలనకు పరీక్ష
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రచారం చివరి దశలో రాజకీయ వేడి పెరిగింది. మంగళవారం జరిగే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, వలసదారులపై కఠిన చర్యలు, ఇరాన్‌తో ఘర్షణ వంటి అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ఆర్థిక వ్యవస్థ పట్ల ట్రంప్ నిర్వహిస్తున్న తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఓటింగ్‌లో డెమోక్రాట్లు ముందంజలో ఉండగా, సెనేట్‌కు ఇరు పక్షాలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. కాంగ్రెస్‌లో స్వల్ప మెజారిటీతో ఉన్న రిపబ్లికన్లు తమ స్థానాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 435 ప్రతినిధుల సభ స్థానాలు, 35 సెనేట్ స్థానాలు, 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఐదు కోట్ల మంది ముందస్తుగా ఓటు వేశారని అధికారులు తెలిపారు. పోలింగ్ ముగింపు రాష్ట్రాలను బట్టి సమయాలు మారుతాయి. కొన్ని ఫలితాలు మంగళవారం రాత్రే వెలువడినా, గట్టి పోటీ ఉన్న చోట్ల రోజులు, వారాలు పట్టవచ్చని అంతర్జాతీయ మీడియా నివేదించింది.
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిచిగాన్ నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున సెనెట్‌కు పోటీ చేస్తున్న అబ్దుల్ అల్ సయ్యద్‌ను తీవ్రవాదిగా అభివర్ణించారు. గతంలో కూడా ఆయనపై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మధ్యంతర ఎన్నికల్లో అబ్దుల్ అల్ సయ్యద్ విజయం సాధిస్తే, అమెరికా సెనేట్‌లో ప్రవేశించే ముందు మెటల్ డిటెక్టర్ల ద్వారా భద్రతా తనిఖీలు చేయాలంటూ హేళన చేశారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఫ్లోరిడాలోని డేటోనా బీచ్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు నిరసన సెగ తగిలింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ట్రంప్ సహనం కోల్పోయి, నినాదాలు చేస్తున్న వ్యక్తి వైపు తిరిగి ‘‘నోరు మూయ్, వెధవ. ఓడిపోయినవాడా. ఇతడిని ఇక్కడి నుంచి బయటకు గెంటేయండి’’ అని ఎదురుదాడి చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరలైంది. అయితే, డెమోక్రాట్ల తరఫున మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మిసిసిపీలోని టుపెలోలో సెనేట్ అభ్యర్థి స్కాట్ కోలమ్ కోసం ప్రచారం చేయగా, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ జార్జియాలోని ఫుల్టన్ కౌంటీలో నిధుల సేకరణ విందులో పాల్గొన్నారు.
ఎన్నికల వివాదాలు ట్రంప్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. కాలిఫోర్నియాలో 20 వేలకు పైగా మెయిల్ ఇన్ బ్యాలెట్లను పక్కన పెట్టాలన్న ఆదేశానికి ఫెడరల్ అప్పీళ్ల కోర్టు మరోసారి నిరాకరించింది. కాలిఫోర్నియా, అలాస్కాల్లో న్యాయ శాఖ సబ్‌పీనాలను విస్తరించింది. మరోవైపు, పౌరులు కాని వారి బ్యాలెట్లుగా భావిస్తున్న వాటి విషయంలో రాష్ట్ర, స్థానిక ఎన్నికల అధికారులను బెదిరించకుండా న్యాయ శాఖను ఫెడరల్ జడ్జి ట్రీనా థాంప్సన్ నిలువరించారు. పౌర హక్కుల సంఘాలు, కార్మిక సంఘాల పిటిషన్‌పై ఈ తీర్పు వచ్చింది. గత ఏడాది న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దాని గెలిచినప్పటి నుంచి డెమొక్రాట్లపై ట్రంప్ దాడి పెంచారు. డెమొక్రాట్లను ‘‘కమ్యూనిస్టులు’’ అని విమర్శిస్తూ, వారి విజయం అమెరికా స్వేచ్ఛకు ముప్పని హెచ్చరిస్తూ అక్కసు వెళ్లగక్కారు. ట్రంప్ హయాంలోనే అమెరికా ప్రభుత్వ నియంత్రణ వైపు మళ్లిందని పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఫెలో కలెన్ హెండ్రిక్స్ అభిప్రాయపడ్డారు.






కామెంట్‌లు (0)