Magazines

ప్రకటనలకే పరిమితమా?

1 గంట క్రితం

announcements
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 3 నిమిషాల చదవడం

గిగ్‌ కార్మికుల సంక్షేమంపై కేంద్రం తీరు

సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు...
యూనియన్లు, కార్మికుల ఆందోళన

కొత్త సంక్షేమ పథకాలేవీ ప్రకటించని వైనం.. నిధుల కేటాయింపుపైనా స్పష్టత కరువు
సిఫారసులు, సలహాలకే బోర్డు పరిమితం.. కోట్లాది మంది అసంఘటిత కార్మికులకు భరోసా దక్కేదెన్నడు?


యాప్‌ల ద్వారా సేవలందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల సంక్షేమంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో ప్రకటనకే పరిమితమైంది. సామాజిక భద్రత కల్పించేందుకు జాతీయ బోర్డును ఏర్పాటు చేసినా.. కొత్త పథకాల ఊసులేదు. నిధుల కేటాయింపుపై స్పష్టత లేదు. సిఫారసులు, సలహాలకే పరిమితమైన ఈ బోర్డు కార్మికులకు నిజమైన భరోసా కల్పిస్తుందా? లేక హామీలతోనే కాలం వెళ్లదీస్తుందా? అనే సందేహాలు అనేకం అందరిలో కలుగుతున్నాయి.


న్యూఢిల్లీ : యాప్‌ల ఆధారంగా పనిచేస్తూ నిత్యం శ్రమిస్తున్న గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామంటూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. అసంఘటిత కార్మికులు, గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే కార్మికుల సంక్షేమం గురించి గొప్పగా చెప్తున్న కేంద్రం.. వారికి తక్షణమే అందించే ప్రయోజనాలేమిటో మాత్రం వెల్లడించలేదు. కొత్త సంక్షేమ పథకాల ప్రకటనా లేదు. వాటి అమలుకు అవసరమైన నిధుల కేటాయింపుపైనా స్పష్టత లేదు. దీంతో కార్మికుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే చర్యలకంటే ప్రకటనలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బోర్డులో ఎవరెవరు?

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అధ్యక్షతన ఈ బోర్డు పనిచేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు అగ్రిగేటర్‌ సంస్థలు, యజమానులు, పౌరసమాజ సంస్థలు, కార్మిక సంఘాలు, గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల సంఘాల ప్రతినిధులకు ఇందులో చోటు కల్పించనున్నారు. ఏడాదికి కనీసం మూడు సమావేశాలు నిర్వహించనున్నారు. సామాజిక భద్రతా కోడ్‌ చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ బోర్డును ఏర్పాటు చేసినట్టు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. అసంఘటిత రంగంలోని వివిధ విభాగాల కార్మికులతో పాటు గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల కోసం సంక్షేమ పథకాలను సిఫారసు చేయడం, వాటి అమలుపై కేంద్రానికి సలహాలు ఇవ్వడం బోర్డు ప్రధాన బాధ్యతలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాల పనితీరును పర్యవేక్షించడం, రాష్ట్ర స్థాయిలో కార్మికుల వివరాల నమోదు, రికార్డుల నిర్వహణ ను సమీక్షించడం, సంబంధిత నిధులు, ఖాతాల్లో ఖర్చుల వివరాలను పరిశీలించడం కూడా బోర్డు విధుల్లో భాగం.

యాప్‌ల వెనుక కనిపించని కార్మికుల కష్టాలు

గిగ్‌ కార్మికులంటే సంప్రదాయ ఉద్యోగి-యజమాని సంబంధం లేకుండా వివిధ పనులుచేస్తూ ఆదాయం పొందే వారు. ఆన్‌లైన్‌ వేదికల ద్వారా పని చేసేవారిని ప్లాట్‌ఫామ్‌ కార్మికులుగా పరిగణిస్తారు. స్విగ్గీ, జొమాటో వంటి ఆహార సరఫరా సంస్థలు, ర్యాపిడో, ఉబర్‌ వంటి రవాణా సేవల్లో పనిచేసే వారు ఈ కోవలోకి వస్తారు. క్విక్‌ కామర్స్‌ సంస్థ ల్లో సరుకులను ఇండ్లకు చేరవేసే డెలివరీ సిబ్బంది కూడా ఇందులో భాగమే. వీరంతా రోజూ ఎండ, వానలను లెక్కచేయకుండా పనిచేస్తున్నా సంప్రదాయ ఉద్యోగులకు లభించే స్థిరమైన వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, పెన్షన్‌ వంటి ప్రయోజనాలు చాలామందికి అందడం లేదు. పని గంటలపై నియంత్రణ లేకపోవడం, టార్గెట్స్‌ ఒత్తిడి, తక్కువ ఆదాయం, ప్రమాదాల ముప్పు వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక భద్రత కల్పించాలనే డిమాండ్‌ చాలాకాలంగా వినిపిస్తోంది.

హామీలున్నాయి.. ప్రయోజనాలేవీ?

తాజా బోర్డు ఏర్పాటు కార్మికులను సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడానికి ఒక ముందడుగుగా కేంద్రం అభివర్ణిస్తోంది. అయితే బోర్డు ఏర్పాటుతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం కావు. వారికి ఎలాంటి బీమా కల్పిస్తారు? ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి ఎంత పరిహారం ఇస్తారు? ఆరోగ్య బీమా, పింఛను, ప్రసూతి ప్రయోజనాలు ఉంటాయా? కనీస ఆదాయ భరోసా కల్పిస్తారా? వంటి కీలక ప్రశ్నలకు నోటిఫికేషన్‌లో సమాధానాలు లేవని యూనియన్లు చెప్తున్నాయి. అంతేకాకుండా కొత్త సంక్షేమ పథకాలేవీ ప్రకటించలేదు. వాటి కోసం ఎంత మొత్తాన్ని కేటాయిస్తారో కూడా వెల్లడించలేదు. అంటే ప్రస్తుతానికి ఈ బోర్డు సిఫారసులు, సలహాలు, పర్యవేక్షణకే పరిమితమైంది. కార్మికులకు నేరుగా అందే ప్రయోజనాలపై ఎలాంటి హామీ లేకపోవడం గమనార్హం.


'స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి'

అఖిల భారత ఎన్‌పీఎస్‌ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎన్‌పీఎస్‌ఈఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు మంజీత్‌ సింగ్‌ పటేల్‌ బోర్డు ఏర్పాటును స్వాగతించారు. అసంఘటిత, డిజిటల్‌ వేదికలపై పనిచేస్తున్న కార్మికులను దేశ సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అయితే కార్మికులకు భరోసా కల్పించేది బోర్డుల ఏర్పాటు, ప్రభుత్వ ప్రకటనలు కాదనీ, అమలులోకి వచ్చే హక్కులు, తగిన నిధులు, చట్టబద్ధమైన రక్షణ మాత్రమేనని గిగ్‌ వర్కర్స్‌, యూనియన్లు చెప్తున్నాయి. ఇలాంటి తరుణంలో మోడీ ప్రభుత్వం ఈ దిశగా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్తున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్