మద్దతుదారులకు లూలా సూచన
సావో పాలో : ఈ నెల 25వ తేదీన జరిగే తుది రౌండ్ ఓటింగ్ కోసం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ప్రచారాన్ని ఉధృతం చేశారు. నాలుగో తేదీన జరిగిన మొదటి రౌండ్ పోలింగ్‌లో ఓటు వేయని వారిని సంప్రదించి, వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొని వచ్చి తుది విడత ఎన్నికలో ఓటు వేసేలా చూడాలని ఆయన తన మద్దతుదారులకు సూచించారు. ‘తమకు ఓటు హక్కు లేదని అనుకుంటున్న ప్రజలతో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది’ అని సావో పాలోలో జరిగిన ర్యాలీలో లూలా అన్నారు. తొలి విడత పోలింగ్‌లో లిబరల్ పార్టీకి చెందిన ఫ్లావియో బోల్సొనారోకు 47.03 శాతం ఓట్లు లభించగా లూలాకు 45.16 శాతం ఓట్లు వచ్చాయి. అయితే తొలి రౌండ్ పోలింగ్‌లో 21.08 శాతం మంది ప్రజలు ఓటు వేయలేదు.1998 తర్వాత ఓటు వేయని వారి సంఖ్య ఈ స్థాయిలో ఉండడం ఇదే ప్రథమం. బ్రెజిల్‌లో 158.7 మిలియన్ల ఓటర్లు ఉండగా తొలి విడత పోలింగ్ కు 33.4 మిలియన్ ఓటర్లు దూరంగా ఉండిపోయారు. అంటే కేవలం 78.92 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది. ఈ నేపథ్యంలో తొలి రౌండ్‌లో ఓటు వేయని ఓటర్లపై లూలా దృష్టి సారించారు. విజయం సాధించడానికి అవసరమైన యాభై శాతం ఓట్లను ఇరువురు ప్రధాన అభ్యర్థులు పొందలేకపోవడంతో రెండో రౌండ్ ఓటింగ్ అనివార్యమైంది.
విజయం సాధిస్తే తన ప్రాధాన్యతలు ఏమిటో లూలా ఈ ర్యాలీలో వివరించారు. ఏఐలో వృత్తిపరమైన శిక్షణ ఇప్పిస్తామని, డిజిటల్ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని, వ్యవస్థీకృత నేరాలను అడ్డుకోవడానికి ప్రజా భద్రతా సంస్కరణలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.







కామెంట్‌లు (0)