Magazines

భౌతికశాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జెన్ కు నోబెల్

39 నిమిషాల క్రితం

Francis
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటుకు విశేష కృషి

ఖగోళ మూలాలు కలిగిన అత్యుత్తమ శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు పురస్కారం


స్టాక్ హోమ్ : ప్రఖ్యాత శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్ కు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటుకు అందించిన విశేష సేవలతో పాటు ఖగోళ మూలాలు కలిగిన శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఆయన ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. స్టాక్‌హోమ్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఫ్రాన్సిస్ హాల్జెన్ పేరును అకాడమీ అధికారికంగా వెల్లడించింది. 2026 నోబెల్ ప్రకటనల్లో భాగంగా బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య పురస్కారాలను ప్రకటించనున్నారు. శుక్రవారం శాంతి నోబెల్‌, ఈనెల 12న ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ విజేతలను వెల్లడించనున్నారు.ఈ ఏడాది నోబెల్ బహుమతి నగదు బహుమానం 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. న్యూట్రినోలను భూత కణాలు (ఘోస్ట్‌ పార్టికల్స్‌)గా భావిస్తుంటారు. ఇవి మన చుట్టే తిరుగుతుంటాయి. న్యూట్రినోలు అనేవి ఊహించలేనంత చిన్న ద్రవ్యరాశి కలిగిన సూక్ష్మమైన విశ్వ కణాలు. అయినప్పటికీ అవి ప్రతిచోటా ఉన్నాయి. అవి సూర్యుని వంటి నక్షత్రాల నుంచి వెలువడతాయి. ప్రతి సెకనుకు లక్షల కోట్ల కణాలు మన శరీరాల గుండా దూసుకుపోతాయి.

వీటిని గుర్తించడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఈ రేణువులకు ద్రవ్యరాశి గానీ విద్యుదావేశం గానీ ఉండవు. ఇతర రేణువులతో ఢీకొట్టటమూ అంతంతే. ఈ కణాలను గుర్తించేందుకు దక్షిణ ధ్రువం వద్ద ఉన్న మంచును ఉపయోగించవచ్చని ఫ్రాన్సిస్ హాల్జెన్ కనుగొన్నారు. మంచు, కాంతి సెన్సార్లతో కూడిన ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. గతేడాది సబ్ అటామిక్ కణాల వింత ప్రవర్తనపై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో నోబెల్ లభించింది. వారి క్వాంటం టన్నెలింగ్ పరిశోధనల వల్లే ఎంఆర్‌ఐ మెషీన్లలో అత్యంత సున్నితమైన కొలతలు సాధ్యమయ్యాయి. మెరుగైన సెల్‌ఫోన్లు, వేగవంతమైన కంప్యూటర్ల తయారీకి అది పునాది వేసింది. ఈ సందర్భంగా నోబెల్ ఫిజిక్స్ కమిటీ ఛైర్మెన్ మార్క్ పియర్స్ మాట్లాడుతూ ఫ్రాన్సిస్ హాల్జెన్ అంతర్జాతీయ పరిశోధకులు, ఇంజినీర్ల బృందానికి నాయకత్వం వహించి ప్రపంచానికి అద్భుతమైన పరికరాన్ని అందించారని, ఆయన పట్టుదల, శాస్త్రీయ దృక్పథం సరికొత్త ఖగోళ శాస్త్రానికి బాటలు వేశాయని కొనియాడారు. బెల్జియంలో జన్మించిన 82 ఏండ్ల శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్ అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో సేవలందిస్తు న్నారు.. నోబెల్‌ ‌బహుమతికి ఎంపికైన హాల్జెన్‌ ‌మాట్లా డుతూ ‘‘నేను నోబెల్ బహుమతి గెలుస్తానని ముందే అంచనా వేశా. అయిన ప్పటికీ ఈ ప్రకటన వింతగా అనిపించింది’’ అని అన్నారు.


​ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం
స్వీడెన్‌ ‌కు చెందిన దిగ్గజ రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్‌‌కు గుర్తుగా ఏటా డిసెంబర్ 10న ఈ పురస్కారాలు అందిస్తారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని నోబెల్ కమిటీ ఇందుకు ఎంపిక చేస్తుంది. వాస్తవానికి ఆల్ఫ్రెడ్ నోబెల్ జీవిత చరమాంకంలో ఒక వీలునామా రాశారు. అందులో తన జ్ఞాపకార్థం, మానవాళికి గొప్ప ప్రయోజనం చేకూర్చిన వారికి నోబెల్ బహుమతి ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం తన సంపద మొత్తాన్ని కేటాయించారు. దీనితో 1900 సంవత్సరం జూన్ 29న నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటైంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయే సమయానికి, నోబెల్ ఫౌండేషన్ పరిధిలోని ఆయన ఆస్తుల విలువ రూ.29.34 కోట్లు. 2024 సంవత్సరం వచ్చేసరికి ఆయన సంపదల విలువ బాగా పెరిగిపోయి ఏకంగా రూ.2,300 కోట్లకు చేరడం విశేషం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్