Magazines

ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌

1 గంట క్రితం

Nobel Prize
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 3 నిమిషాల చదవడం

స్థూల ఆర్థిక స్థిరత్వంపై పరిశోధనకు గుర్తింపు

రాబర్ట్ ఇ.హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్‌కు పురస్కారం

ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాల ప్రకటనల్లో ఇదే చివరిది


స్టాక్ హోమ్ : ఆర్థిక శాస్త్రంలో 2026 సంవత్సరానికి గాను ఇద్దరికి నోబెల్‌ బహుమతి వరించింది. అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్‌ ఇ. హాల్‌, మైఖేల్‌ వుడ్ఫోర్డ్‌కు నోబెల్‌ కమిటీ పురస్కారం ప్రకటించింది. స్థూల ఆర్థిక స్థిరీకరణకు సూక్ష్మ ఆర్థిక పునాదులు అనే అంశంపై వీరు చేసిన పరిశోధనలకు గుర్తింపు దక్కింది. సోమవారం స్టాక్‌హోమ్‌లో రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆ పురస్కారాన్ని ప్రకటించింది.ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాల ప్రకటనల్లో చివరిది.

ఆర్థిక స్థిరత్వానికి కొత్త నమూనాలు

ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా వృద్ధి, మందగమనం సహజం. కొన్ని సంద ర్భాల్లో ఉత్పత్తి, వినియోగం పెరిగి ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. మరికొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణం పెరగడం, పెట్టుబడులు తగ్గడం, నిరుద్యోగం అధికమవడం వంటి పరిణామాలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు వివిధ ఆర్థిక విధానాలను అమలు చేస్తుంటాయి. అయితే, ఏ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నది కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రాబర్ట్‌ ఇ. హాల్‌, మైఖేల్‌ వుడ్‌ఫోర్డ్‌ ఆర్థిక నమూనాలను అభివృద్ధి చేశారు. వారి పరిశోధనలు ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకునే మార్పులను అర్థం చేసుకోవడానికి, విధాన నిర్ణయాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, వినియోగం వంటి అంశాల మధ్య సంబంధాలను మాత్రమే పరిశీలించకుండా, వ్యక్తులు, కుటుంబాలు, వ్యాపార సంస్థలు తీసుకునే నిర్ణయాలు మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతాయో వివరించేందుకు వీరి పరిశోధనలు దోహదపడ్డాయి. గతంలో ఆర్థిక వ్యవస్థలోని వివిధ అంశాల మధ్య కనిపించే గణాంక సంబంధాల ఆధారంగా అనేక నమూనాలను రూపొందించేవారు. అయితే హాల్‌, వుడ్‌ఫోర్డ్‌ వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలకు ప్రాధాన్యం ఇచ్చే సూక్ష్మ ఆర్థిక సూత్రాల ఆధారంగా స్థూల ఆర్థిక నమూనాలను అభివృద్ధి చేశారు. దీంతో ఆర్థిక వ్యవస్థలోని హెచ్చుతగ్గులను వివరించడంతోపాటు, వాటిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను మరింత మెరుగ్గా అంచనా వేసే అవకాశం ఏర్పడింది.ఆ పరిశోధనల ఫలితంగా అభివృద్ధి చెందిన న్యూ కీనేసియన్‌ ఆర్థిక నమూనాలు ప్రస్తుతం కీలకంగా మారాయి. ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడినప్పుడు దాన్ని అధిగమించేందుకు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు దాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి విధానాలు అవసరమో విశ్లేషించడంలో ఇవి సహాయపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇటువంటి నమూనాలను ఉపయోగిస్తున్నాయి.ప్రభుత్వాలు పన్నులు, ప్రభుత్వ వ్యయం వంటి అంశాల్లో మార్పులు చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేయగలవు. అలాగే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు, ద్రవ్య సరఫరా వంటి అంశాల ద్వారా ఆర్థిక వ్యవస్థలో మార్పులకు ప్రయత్నిస్తాయి. ఈ చర్యలను సరైన సమయంలో తీసుకోవడం ద్వారా ఆర్థిక ఒడుదొడుకుల తీవ్రతను తగ్గించవచ్చని వీరి పరిశోధనలు వివరించాయి.

ఎవరీ రాబర్ట్‌ హాల్‌, మైఖేల్‌ వుడ్‌ఫోర్డ్‌?

రాబర్ట్‌ ఈ. హాల్‌ 1943లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం పాలో ఆల్టోలో జన్మించారు. 1967లో మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. స్థూల ఆర్థిక వ్యవస్థ, వినియోగం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై ఆయన పరిశోధనలు చేశారు. మైఖేల్‌ వుడ్‌ఫోర్డ్‌ 1955లో అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రం చికోపీలో జన్మించారు. 1983లో ఎంఐటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ద్రవ్య విధానం, ఆర్థిక వ్యవస్థలో ధరల మార్పులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాల ప్రభావం వంటి అంశాలపై ఆయన పరిశోధనలు చేశారు.

1969లో ప్రారంభమైన ఆర్థిక శాస్త్ర నోబెల్‌

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని అధికారికంగా ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ స్మారకార్థం స్వెరిజెస్‌ రిక్స్‌బ్యాంక్‌ ఆర్థిక శాస్త్ర పురస్కారం అని పిలుస్తారు. స్వీడన్‌ కేంద్ర బ్యాంకు అయిన స్వెరిజెస్‌ రిక్స్‌బ్యాంక్‌ 1968లో తన 300వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. తొలి బహుమతిని 1969లో రాగ్నర్‌ ఫ్రిష్‌, జాన్‌ టిన్‌బెర్గెన్‌లకు అందించారు. ఇది ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తన వీలునామాలో పేర్కొన్న అసలు ఐదు పురస్కారాల్లో ఒకటి కాదు. అయితే, ఇతర నోబెల్‌ పురస్కారాల మాదిరిగానే దీనిని కూడా రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రదానం చేస్తుంది. ఈ పురస్కారం కింద విజేతలకు 12 మిలియన్‌ స్వీడిష్‌ క్రోనర్లు అందజేస్తారు. ఇది సుమారు 1.2 మిలియన్‌ అమెరికా డాలర్లకు సమానం.

గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో జోయెల్‌ మోకిర్‌, ఫిలిప్‌ అఘియాన్‌, పీటర్‌ హోవిట్‌లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కొత్త సాంకేతికతలు, ఉత్పత్తి విధానాల్లో మార్పులు ఆర్థిక వృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు ఎలా దోహదపడతాయన్న అంశంపై వారు చేసిన పరిశోధనలకు గుర్తింపు లభించింది. వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో పురస్కారాల ప్రకటనలు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా ఆర్థిక శాస్త్రంలో విజేతలను ప్రకటించడంతో 2026 సంవత్సరానికి సంబంధించిన నోబెల్‌ పురస్కారాల ప్రక్రియ ముగిసింది.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్