Magazines

ఎన్నికల అధికారులపై ఒత్తిడి తేవద్దు

1 గంట క్రితం

election officials.
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 2 నిమిషాల చదవడం

మీ చర్యలు ఎన్నికల నిర్వహణకు ఆటంకం

చట్టబద్ధ ఓటర్లు తమ హక్కును కోల్పోతారు
ట్రంప్‌ ప్రభుత్వానికి యూఎస్‌ ఫెడరల్‌ జడ్జి అత్యవసర ఆదేశం

వాషింగ్టన్‌ : మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న దుందుడుకు చర్యలకు యూఎస్‌ జిల్లా జడ్జి ట్రినా థాంప్సన్‌ బ్రేక్‌ వేశారు. ప్రభుత్వ చర్యలను నిలిపివేస్తూ ఆమె కీలక అత్యవసర ఉత్తర్వును జారీ చేశారు. పౌరసత్వం లేని వ్యక్తులు ఓటు వేయకుండా నిరోధించేందుకే తాను కొన్ని చర్యలు చేపట్టానని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ వాటి కారణంగా ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలగడమే కాకుండా చట్టబద్ధమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నదని శుక్రవారం ఇచ్చిన తీర్పులో ఆమె పేర్కొన్నారు. తన అత్యవసర ఉత్తర్వు అమలులో ఉన్నంత కాలం ఏ రాష్ట్రంలో అయినా ఓట్లను వేరు చేయాలని, ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించాలని లేదా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేయాలని ఎన్నికల అధికారులను న్యాయ శాఖ, హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ విభాగం కోరకూడదని స్పష్టం చేశారు. తమ ఆదేశాలు పాటించకపోతే ఎన్నికల అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామంటూ ఆయా ప్రభుత్వ శాఖలు చేసిన హెచ్చరికలను ఆమె రద్దు చేశారు. ఓటర్లు అనర్హులన్న కారణంతో ఎన్నికల నిర్వహణ పద్ధతులను మార్చాలంటూ అధికారులను భయపెట్టడం, బెదిరించడం, బలవంతం చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని ఆదేశించారు.

న్యాయమూర్తి ఏమన్నారు?

అక్రమ ఓటింగును అడ్డుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టని ఎన్నికల అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామంటూ ట్రంప్‌ ప్రభుత్వం కొంతకాలంగా బెదిరిస్తూ వస్తోంది. న్యాయమూర్తి థాంప్సన్‌ తన తాజా ఉత్తర్వులో ప్రభుత్వ వాదనను తప్పుపట్టారు. 'రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఉద్యోగులు చట్టానికి లోబడి ఓట్లను పంపిణీ చేయడం, ప్రాసెస్‌ చేయడం లేదా లెక్కించడం వంటి ఎన్నికల సంబంధమైన పనులు చేయడం ఫెడరల్‌ నేర చట్టాలను ఉల్లంఘించినట్లు కాదు. ఒకవేళ అనర్హుడు ఓటు వేశాడని అనుకున్నప్పటికీ అది ఉద్యోగి నేరం కాదు' అని తీర్పులో స్పష్టం చేశారు. తన ఉత్తర్వు నవంబర్‌ 16వ తేదీ వరకూ అమలులో ఉంటుందని ఆమె తెలిపారు.

ఓటింగ్‌ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది

ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియా నార్త్‌ జిల్లా కోర్టులో ఎన్‌ఏఏసీపీ, లీగ్‌ ఆఫ్‌ యునైటెడ్‌ లాటిన్‌ అమెరికన్‌ సిటిజన్స్‌ వంటి సంస్థలతో పాటు పౌర హక్కుల సంఘాల కూటమి ఈ కేసును దాఖలు చేశాయి. ట్రంప్‌ ప్రభుత్వ చర్యలు ఓటింగ్‌ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించాయి. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్రాల అధికారాలలోకి రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం చొరబడుతోందని ఫిర్యాదు చేశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్