నాలుగోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన లూలా
44 లక్షల ఓట్ల ఆధిక్యతతో జయకేతనం..
ఫలితాన్ని అంగీకరించబోనన్న బోల్సనారో
బ్రెసిలియా : బ్రెజిల్లో మరోసారి అరుణ పతాకం రెపరెపలాడింది. వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా వరుసగా నాలుగోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఫలితాన్ని తాను అంగీ కరించబోనని, న్యాయస్థానంలో సవాలు చేస్తానని లూలా ప్రత్యర్థి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రుడు సెనెటర్ ఫ్లావియో బోల్సనారో చెప్పారు. వామపక్ష నేత లూలా రన్-ఆఫ్ ఓటింగులో 51 శాతానికి పైగా ఓట్లు సాధించి విజయకేతనం ఎగరేశారు. లూలాకు బోల్సనారో కంటే 44 లక్షలకు పైగా ఓట్లు అధికంగా వచ్చాయి. పోలింగును రెండు గంటల పాటు పొడిగించా లంటూ చివరి నిమిషంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తామని బోల్సనారో తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాలలో ప్రజల భాగస్వామ్యం : లూలా
ఫలితాన్ని ప్రకటించిన తర్వాత రాజధాని బ్రెసిలి యాలో మద్దతుదారులను ఉద్దేశించి బోల్సనారో ప్రసంగి స్తూ జరిగిన పరిణామాలను బట్టి ఎన్నికల ఫలితాన్ని గుర్తించలేమని చెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లూలా ఎన్నికను రద్దు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరతామని అన్నారు. బ్రెజిల్లో 1989 నుంచి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటున్నారు. దేశంలో తొలి రౌండ్ పోలింగులో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థి రన్-ఆఫ్‌లో విజయం సాధించి అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం ఇదే మొదటిసారి. 'బ్రెజిల్ పాలనా విధానాన్ని మార్చబోతున్నామని నేను మీకు హామీ ఇవ్వగలను. ప్రభుత్వ నిర్ణయాలలో ప్రజలను మరింతగా భాగస్వాములను చేయబోతున్నాం' అని లూలా చెప్పారు. ప్రజల ఔదార్యానికి...ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వీధుల్లోకి వచ్చిన యువతకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
బోల్సనారోకు ఎదురు దెబ్బ
రియో డీ జనైరోలో లూలా మద్దతుదారులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. వాహనాల హారన్లను మోగించడం, 'ఎల్' గుర్తును చూపించడం కన్పించింది. కీలకమైన మినాస్ గెరైస్ రాష్ట్ర రాజధాని బెలో హోరిజాంట్లో లూలా విజయం తర్వాత మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాటలు పాడారు. లూలా విజయం బోల్సనారో రాజకీయ ఉద్యమానికి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.
2022 ఎన్నికల్లో లూలాతో ఫ్లావియో బోల్సనారో తండ్రి, ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో తలపడి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడైన ఫ్లావియోకూ ఓటమి తప్పలేదు.
పోలింగ్ సమయం పొడిగింపు
ప్రధాన అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఆదివారం పోలింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించారు. అనేక రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించే బస్సులను అడ్డుకున్నారని లూలా బృందం ఆరోపించింది. దీంతో పోలింగ్ సమయాన్ని పెంచుతూ బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్రిస్టియానో జానిన్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని బోల్సనారో ప్రచార బృందం కూడా ఫిర్యాదు చేసింది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పొడిగింపు ఉత్తర్వులు వెలువడగా అప్పటికే చాలా కేంద్రాలను మూసివేశారు.
పోలింగ్ ముగియడానికి ముందు ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ రన్-ఆఫ్ సరళిని పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. ఆయన ఏ అభ్యర్థికీ మద్దతు తెలుపనప్పటికీ తొలి రౌండ్లో ఫ్లావియో ఆధిక్యత సాధించడాన్ని ప్రశంసించారు. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు.
ఫలితం అపూర్వమే
బ్రెజిల్ ఫలితం ఏ విధంగా చూసినా అపూర్వమైనదేనని చెప్పాలి. ఎందుకంటే ఏ అధ్యక్ష అభ్యర్థి కూడా గతంలో మొదటి రౌండులో గెలిచి రెండో రౌండులో ఓడిపోలేదు. లూలా మొదటి రౌండులో 22 లక్షల ఓట్ల తేడాతో వెనుకబడినప్పటికీ కేవలం మూడు వారాల వ్యవధిలోనే రెండో రౌండులో అనూహ్యంగా పుంజుకొని ఘన విజయాన్ని నమోదు చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరూ గతంలో వరుసగా నాలుగు పర్యాయాలు ఎన్నిక కాలేదు. ఇప్పుడు ఆ ఘనత లూలాకు దక్కింది. ఈ పదవీకాలం ముగిసే నాటికి ఆయన బ్రెజిల్‌ను ఏకధాటిగా 16 సంవత్సరాలు పాలించిన నేత అవుతారు. ఇది ఆ దేశ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అత్యంత సుదీర్ఘ పదవీకాలం. దేశంలో రన్-ఆఫ్ ఎన్నిక ప్రచారం గతంలో ఈ స్థాయిలో ఏ నాడూ జరగకపోవడం విశేషం. ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. సామాజిక మాధ్యమాల వినియోగం కూడా ఎక్కువగా జరిగింది. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు.
కంగ్రాట్స్ లూలా !
ఇది బ్రెజిల్ ప్రజల విజయం
ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలో వరుసగా నాలుగోసారి విజయం సాధించి రికార్డు సృష్టించిన లూలాను అభినందిస్తూ ప్రపంచ నేతలు సందేశాలు పంపారు. 'లాంగ్ లివ్ డెమొక్రసీ...ఇది బ్రెజిల్ ప్రజల విజయం' అని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ వ్యాఖ్యానించారు. లూలా నాయకత్వం లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని కెనడా ప్రధాని మార్క్ కార్నే ఆకాంక్షించారు. లూలా చారిత్రక విజయంతో బ్రెజిల్లో శాంతి, సార్వభౌమత్వం, సామాజిక న్యాయం వర్థిల్లుతాయని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్-కానెల్ తెలిపారు. చిలీ అధ్యక్షుడు జోస్ ఆంటోనియో కాస్ట్ ఫోన్లో లూలాకు అభినందనలు తెలిపారు. వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా కలసి పోరాడదామని చెప్పారు. 'మన వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకారం, అభివృద్ధిని బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం' అని పెరూ అధ్యక్షుడు ఫుజిమోరీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవడానికి రెండు దేశాలు కలసి పనిచేస్తాయని బలీవియా అధ్యక్షుడు రోడ్రియో పాజ్ చెప్పారు. ఉమ్మడి సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామని అన్నారు. రెండు దేశాలు కలసి పని చేయాలని పనామా అధ్యక్షుడు జోస్ రాల్ ములినో ఆకాంక్షిం చారు. బ్రెజిల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి శత్రువులు, సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో కలసికట్టుగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని ఈక్వెడార్ అధ్యక్షుడు డేలియల్ నొబోవా అభిప్రాయ పడ్డారు. పరాగ్వే, ఉరుగ్వే, అర్జెంటీనా నేతలు కూడా లూలాను అభినందిస్తూ సందేశాలు పంపారు. లూలా విజయంపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ ఈ ఫలితాన్ని విమర్శిస్తూ పోలింగ్ సమయాన్ని పొడిగించడాన్ని తప్పుపట్టారు. అయితే లూలా విజయాన్ని ప్రగతిశీల సెనెటర్ శాండర్స్, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ స్వాగతించారు.






కామెంట్లు (0)