లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సంఘటితమైన శ్రమజీవులు
కేంద్ర పాలకుల ఆటలు సాగనివ్వం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
‘మల్టీపుల్ డేస్ ధర్నా’ రెండో రోజూ పోటెత్తిన కార్మిక వర్గం
నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక శక్తిని తక్కువగా అంచనా వేసి వారి జోలికొస్తే పాలకుల పీఠాలు కదిలిస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వా న్ని హెచ్చరించారు. ‘మల్టీపుల్ డేస్ ధర్నా’లో భాగంగా రెండో రోజైన సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపా ర్కు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన ఆందోళన నిర్వహించారు. భారీగా కదిలి వచ్చిన కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ధర్నా చౌక్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఎర్రచీ రెలు, రెడ్ షర్ట్లు ధరించిన కార్మికులు ఎర్ర జెండాలు చేబూని అక్కడ కవాతు నిర్వహించారు. సంకలో సంచి, చేతిలో జెండా పట్టుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అసంఘటిత కార్మికులు తమ నాయకుల ఉపన్యాసాలను శ్రద్ధగా ఆలకించారు. మధ్యమధ్యలో కళాకారులు ఆలపించిన పాటలకు లయబద్దంగా చప్పట్లతో శృతి కలిపారు. మోడీ సర్కార్ ముర్దాబాద్ అంటూ బిగ్గరగా స్లోగన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్కీం వర్కర్లు తమను ఉద్యోగులుగా గుర్తించని పాలకులు ఈ సారి ఓట్లు ఎలా అడుగుతారో చూస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ, హమాలీ, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఐకేపీవీఓఏ తదితర రంగాలకు చెందిన కార్మికులు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం చుక్క రాములు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న విధానాలను వివరించారు. అలవిగాని కష్టాలు అనుభవిస్తున్న కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటమేంటని ప్రశ్నించారు. కార్మికులతో పరాచికాలాడితే.. పాలకులా రా ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడే చట్టాలకు శఠగోపం పెట్టి, కార్మికచలను మాట్లాడొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. చలి చీమల్లా ఏకమై పాలకుల అంతు చూస్తామని హెచ్చరించారు. సీఎం సీటు కోసం అడ్డగోలు వాగ్దానాలు చేసి, ఆ తర్వాత బోడి మల్లన్న చందంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పద్ధతిని మార్చుకోకపోతే శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని హెచ్చరించారు. ప్రారంభోపన్యాసం చేసిన పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ‘పాలకులారా.. కాలం మారింది. కార్మికులు, కర్షకులు, కష్టజీవులంతా ఏకమవుతున్నారు. ఇక మీ ఆటలు సాగవ్’ అని హెచ్చరించారు. ‘ మీకు అధికారం పర్మినెంట్‌గా ఉండాలి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఇలా రకరకాల పేర్లతో గొర్రెతోక బెత్తెడు జీతాలతో పని చేస్తున్న కార్మికులను మాత్రం పర్మినెంట్ చేయరా?’ ఇది న్యాయమా? మోడీ జీ..అంటూ దేశ ప్రధానిని ఉద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలన ఉందనీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామనీ, ఏడో గ్యారంటీగా ‘స్వేచ్ఛ’ నిస్తున్నామన్నారనీ, స్వేచ్ఛ అంటే కార్మికులను గృహ నిర్బంధంలో బంధించటమా? అని నిలదీశారు. కార్మిక శక్తిని తక్కువ అంచనా వేసి వారిని మోసం చేస్తే కార్మిక రథ చక్రాల కింద నలిగి పోవాల్సిందేనని మండిపడ్డారు. ధర్నా చౌక్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం..మా గోడు వినండి..ఆయా రంగాల సమస్యలను ఆలకించండి వాటిని పరిష్కరించండి.. లేదంటే.. సమరమేనని హెచ్చరించారు. ఒంటరిగా ఏ రంగానికి ఆ రంగం ఆందోళనలు చేస్తే..దున్నపోతు మీద వానపడ్డట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయనీ, అందుకే సంఘటితంగా ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామనీ, మొండిగా వ్యవహరిస్తే.. సరైన సమయంలో, తగిన బుద్ధి చెబుతామని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని కార్మికులు సంపద సృష్టిస్తే.. అదానీ,అంబానీలకు దారాదత్తం చేస్తామంటే..ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ. 42 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. దేశంలో కోటి మంది, రాష్ట్రంలో మూడు లక్షలమంది స్కీమ్ వర్కర్లు ఉన్నారని గుర్తు చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ వీవోలు, మెడికల్ డిపార్ట్మెంట్లో, ఎన్హెచ్ఎం లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ తదితర అన్ని రకాల ఉద్యోగులను ఆదుకోవాల్సింది ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవటం ఇక కుదరదని హెచ్చరించారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జయలక్ష్మి మాట్లాడుతూ పాలకవర్గాలతో పోరాడి వాళ్ళ మెడలు వంచి కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాలని సాధించుకున్నామని చెప్పారు. కానీ ప్రస్తుత పాలకులు కార్మికుల ప్రయోజనాలని దెబ్బతీసేందుకు తప్పుడు విధానాలను తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే పద్ధతుల్లో, ఏ హక్కులు లేనటువంటి వారిగా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. హక్కులను హరిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నం టుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు మాత్రం పెరగటం లేదని చెప్పారు. మరి ఎలా బతకాలని ప్రభుత్వాలను ప్రశ్నించారు. కనీస వేతనాన్ని రూ.42వేలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్‌కి రూ. 13,650, అంగన్వాడీ హెల్పర్స్‌కు రూ. 7,800, ఆశా వర్కర్లకు రూ.9,900 సరిపోవని చెప్పారు. అంగన్వాడీ, ఆశాల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. పరిష్కారానికి అడ్డంగా పెద్ద కొండ లాగా నాలుగు లేబర్ కోడ్ లు ఉన్నాయని చెప్పారు. అందుకే వాటి రద్దుకు పోరాటం చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ నాయకులు భూపాల్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్,ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు,గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుధకర్, రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి పి శ్రీకాంత్, తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల సాంబయ్య, హాస్టల్ డైలీవేజ్ వర్కర్స్ సంఘం నాయకులు కె బ్రహ్మచారి,మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె స్వప్న ప్రసంగించారు. కార్యక్రమంలో అంగన్ వాడీ యూనియన్ అధ్యక్షురాలు కె సునీత,ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్వి ఆర్ నీలా దేవి, గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్షులు గణపతి రెడ్డి, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదానాయక్, ఐకేపీవీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం నగేశ్, ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూక్యా శ్రీనివాస్, ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు రవి, వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై సోమన్న, ఉపాధి ఫీల్డ అసెంస్టెంట్ల యనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నారాయణ గౌడ్, ప్రయివేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అజయ్‌బాబు, ప్రయివేటు ఇంజనీరింగ్ నాన్ టీచింగ్ ఫెడరేషన్ నాయకులు సుబ్బారావు, ఎలక్ర్టిసీటీ స్టోర్ హమాలీ యూనియన్ అధ్యక్షులు యాదయ్య తో పాటు సీఐటీయూ ఆపీసు బేరర్లు, యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమరశీల పోరాటాలు
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ మాట్లాడుతూ స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమరశీల పోరాటాలు నిర్వహించాలని చెప్పారు. పోరాటాలతోనే హక్కులు నిలబడతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న హక్కులను హరించి, కార్పొరేట్లకు కట్టుబానిసలుగా చేసేందుకు తగిన విధంగా చట్టాలను రూపొందిస్తున్నదని చెప్పారు. అక్కడా, ఇక్కడా కార్పొరేట్ల, యాజమానుల ప్రయోజనాలు కాపాడే సర్కార్లేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకి రూ. పదివేల వేతనం ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కానీ..ఆ హామీని మర్చిపోయారన్నారు. ఐకేపీ వీవోఏలు గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేశారన్నారు. నాడు కాంగ్రెస్ నాయకులు ప్రతి టెంటు దగ్గరికొచ్చి మాయమాటలు చెప్పారన్నారు. అధికారంలోకొస్తే రూ. 18 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు గత ప్రభుత్వం రూ.2016 ఇస్తే..కాంగ్రెస్ కాస్త ముందుకెళ్లి రూ. 4016 ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ వాగ్దానాలు ఏ కాకులు ఎత్తుకు పోయాయని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అసంఘటితంగా ఉన్న బీడీ కార్మికులు ఏడు లక్షల మంది ఉన్నారన్నారు. 45 నియోజకవర్గాల్లో రాజకీయాలను తారుమారు చేసే శక్తి వారికుందన్నారు. కానీ..వారికి ఇస్తానన్న జీవన భృతి ఇవ్వటం లేదని చెప్పారు. వీరిని ప్రభుత్వాలు పట్టించుకోకపోవటానికి ఒకే ఒక్క కారణముందని గుర్తు చేశారు. అదే సంఘటితంగా లేకపోవటమే వారికి కలిసొస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు బడ్జెట్లు పెట్టిందన్నారు. కానీ..వాటిలో ఆయా రంగాలకు తగిన విధంగా కేటాయింపులు లేవని చెప్పారు. బడ్జెట్ కేటాయించకపోవటంలోనే పాలకుల కుట్ర ఉందని చెప్పారు. క్రమంగా ఆయా స్కీములను నిర్వీర్యం చేయటమేనని తెలిపారు. కార్మికులను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే హక్కులు
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే హక్కులు నిలబడతాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ఆర్థిక అసమానతలు పెరిగాయని చెప్పారు. మరో పక్క పాలకులు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. మోడీ ఎన్నికల ముందు చాలా చెప్పారని గుర్తు చేశారు. ధరలు తగ్గిస్తామని సామాన్యులకు అందకుండా చేశారని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామన్న వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. విద్య, వైద్యం అందకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి , భుక్తి , ప్రజల విముక్తి కోసం జరిగిందని గుర్తు చేశారు. ఆ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు ఉద్యమించాలని చెప్పారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ హమాలీలు మూటలు మోయకుండా, కష్టపడకుండా, చెమట చుక్క నేల రాలకుండా ఎవరి నోటికాడికి అన్నం రాదని చెప్పారు. సివిల్ సప్లై హమాలీలు రాష్ట్రంలో కోటి తెల్ల రేషన్ కార్డులకు బియ్యం సరఫరా చేస్తున్నారని గుర్తు చేశారు. వ్యవసాయ, కూరగాయల, పూల మార్కెట్లలో హమాలీలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని చెప్పారు. ఇంత కష్టపడుతున్నా ఈ ప్రభుత్వాలు వారి రక్షణ కోసం ఏ స్కీమ్ తీసుకురాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత కార్మికుల కోసమే ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ పథకం, ఈ-శ్రామ్ కార్డులు తీసుకొచ్చినట్టు చెబుతున్నారనీ, కానీ.. ఇవి ఎక్కడా అమలు కావడం లేదని చెప్పారు. అందుకే ఇవాళ హమాలీలు, భవన నిర్మాణ కార్మికుల వలె తమకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని అడుగుతున్నారని గుర్తు చేశారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులు కూడా తమకు వెల్ఫేర్ బోర్డు కావాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.







కామెంట్లు (0)