Magazines

రావాల్సింది రూ.24,166 కోట్లు వచ్చింది రూ.3,705 కోట్లు

1 గంట క్రితం

Release of grants
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 3 నిమిషాల చదవడం

ఆరు నెలల్లో 15.34 శాతం నిధులే

గ్రాంట్లను విడుదల చేయని కేంద్రం

తెలంగాణపై మోడీ సర్కారు వివక్ష

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.24,166 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసి ఆర్నెల్లు దాటినా ఇప్పటి వరకు రూ.3,705.98 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అంటే 15.34 శాతం నిధులే వచ్చాయి. ఈ గణాంకాలను బట్టి తెలంగాణ పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివక్షను ప్రదర్శిస్తున్నదని అర్థమవుతున్నది. భారత కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (కాగ్‌) ‌సెప్టెంబర్‌ ‌నివేదికలో ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసి ఆర్నెల్లు పూర్తయితే అంచనాలో సగం నిధులు రావాల్సి ఉన్నది. అంటే గ్రాంట్లలో రూ.12,083 కోట్ల నిధులను తెలంగాణకు కేంద్రం విడుదల చేయాలి. అంటే రూ.8,377.02 కోట్లు తక్కువగా విడుదల చేయడం గమనార్హం. గ్రాంట్ల విడుదలలోనే కాకుండా విభజన హామీలను అమలు చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో బీజేపీ హామీ ఇచ్చింది. 12 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా ఆ హామీని నెరవేర్చడం లేదు. ఐఐఎంను మంజూరు చేయలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రకటించలేదు. ఆదిలాబాద్‌లో సిమెంట్‌ ఫ్యాక్టరీ‌ని పునరుద్ధరించే విషయంలో జాప్యం చేస్తున్నది. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మించాలని ప్రజలు ఎన్నో ఏండ్లుగా కోరుతున్నా, ఉద్యమాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు.

ఆశించిన పన్నేతర ఆదాయమేదీ?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం రూ.35,730.20 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆర్నెల్ల కాలంలో రూ.5,754.24 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 16.10 శాతం నిధులే ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఆర్నెల్లలో సగం నిధులు అంటే రూ.17,865.1 కోట్ల నిధులు రావాల్సి ఉన్నది. అటు కేంద్రం నుంచి గ్రాంట్లు, ఇటు పన్నేతర ఆదాయం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నది. దీంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభావం చూపుతున్నది.

ఖర్చు ఎక్కువ... ఆదాయం తక్కువ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,41,263.59 కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. సెప్టెంబర్‌ ‌నాటికి రూ.92,013.18 (38.14 శాతం) కోట్ల నిధులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,81,673.12 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. సెప్టెంబర్‌ ‌నాటికి రూ.1,34,852.30 (47.88 శాతం) కోట్లు ఖర్చయ్యాయి. ఈ గణాంకాలను బట్టి ఖర్చు ఎక్కువ... ఆదాయం తక్కువ అని అర్థ మవు తున్నది. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే ఖర్చు రూ.42,839.12 కోట్లు అధికంగా ఖర్చు కావడం గమనార్హం.


ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం సున్నా

తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నారు. కానీ తెలంగాణకు నిధులు తేవడంలో విఫలమవుతున్నారు. వారి వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. తెలంగాణకు నిధులివ్వకుండా, విభజన హామీలను అమలు

6 నెలల్లోనే రూ.44,612 కోట్ల అప్పులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.61,457.16 కోట్ల అప్పులు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం నుంచి గ్రాంట్లు రాకపోవడం, ఆశించిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రాకపోవడంతో అప్పులపై ఆధారపడుతున్నది. ఆర్నెల్లలోనే రూ.44,612.16 (72.59 శాతం) కోట్ల అప్పులు తెచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఆర్నెల్ల సమయం ఉన్నది. అంటే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే అధికంగా అప్పులు చేసే అవకాశమున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు సాధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఆర్నెల్ల కాలంలో రెవెన్యూ లోటు రూ.15,096.18 (220.13 శాతం) కోట్లు ఉన్నది. ద్రవ్య లోటు రూ.44,612.16 (76.31 శాతం) కోట్లు నమోదైంది. ఈ నేపథ్యంలో అప్పులు తేకుండా సంక్షేమ పథకాలను, ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసే పరిస్థితి లేదని తెలుస్తున్నది. ప్రజలపై అప్పుల భారం పెరగడం ఆందోళనకరమని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చేయకుండా వివక్ష ప్రదర్శిస్తున్నా ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ తీరు ఇలాగే కొనసాగితే రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్