ప్రధాని మారినా మారని ఇరాన్, గాజాపై వైఖరి
పాలస్తీనా స్వతంత్ర దేశానికి కొత్త నేత కూడా వ్యతిరేకమే
కొన్ని మార్పులు సాధ్యమే అంటున్న విశ్లేషకులు
టెల్‌అవీవ్ : ఇజ్రాయిల్‌లో బెంజమిన్ నెతన్యాహు పాలనకు తెరపడితే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోతాయా? గాజా ప్రజలకు కష్టాలు తీరుతాయా? ఇరాన్, లెబనాన్‌తో ఉద్రిక్తతలు తగ్గుతాయా? నేడు (అక్టోబర్ 27న) జరగనున్న ఇజ్రాయిల్ ఎన్నికల్లో నెతన్యాహు ఓటమి పాలయ్యే అవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కోట్ కూడా కఠినమైన భద్రతా విధానాలనే సమర్థిస్తున్నారు. దీంతో నాయకుడు మారినా యుద్ధాలు, ఘర్షణలు కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పాలస్తీనాపై ఇజ్రాయిల్ అనుసరిస్తున్న విధానాలు, గాజాపై యుద్ధంతోనూ నెతన్యాహు అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా, లెబనాన్, ఇరాన్ తదితర ప్రాంతాల్లో సైనిక చర్యలను తీవ్రం చేసింది. ఈ పరిణామాలు దేశానికి భద్రతాపరమైన సవాళ్లతోపాటు దౌత్యపరమైన ఇబ్బందులనూ తెచ్చిపెట్టాయి. 27న జరిగే ఎన్నికల్లో మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని యషార్ పార్టీ ముందంజలో ఉన్నట్టు కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌లోని 120 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాలను ఏ కూటమి సాధిస్తుందన్నది కీలకంగా మారనుంది.
ఇరాన్‌పై మారని వైఖరి
ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవాలని ఐసెన్‌కోట్ భావిస్తున్నారు. ఇందుకోసం చర్చలైనా.. అవసరమైతే సైనిక చర్యలైనా చేపట్టాలన్నది ఆయన అభిప్రాయం. అయితే నెతన్యాహులా వెంటనే యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలని ఆయన కోరుకోవడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో సైనిక చర్యలకు పూర్తిగా దూరంగా ఉంటారన్న గ్యారంటీ లేదు. ఇరాన్‌తో ఘర్షణలు త్వరగా ముగిసే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గాజాలోనూ కష్టాలు తప్పవా?
మూడేండ్ల క్రితం.. అంటే 2023 అక్టోబర్‌లో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో గాజా తీవ్రంగా ధ్వంసమైంది. వేలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది అక్టోబర్‌లో కుదిరిన కాల్పుల విరమణతో పరిస్థితుల తీవ్రత తగ్గినా.. హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయిల్ సైన్యం ఉపసంహరణ, గాజా పాలన వంటి అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. హమాస్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా తొలగించాలన్న విషయంలో నెతన్యాహు, ఐసెన్‌కోట్ ఇద్దరిదీ ఒకే వైఖరి. ఐసెన్‌కోట్ 18 నెలల్లో హమాస్ పాలనకు ముగింపు పలుకుతానని చెప్తున్నారు. అవసరమైతే సైనిక చర్యలకూ వెనుకాడబోనని సంకేతాలిచ్చారు.
లెబనాన్‌పైనా అదే పంథా
హిజ్బుల్లా ముప్పును అడ్డుకునేందుకు లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయిల్ సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఐసెన్‌కోట్ భావిస్తున్నారు. చర్చలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా, హిజ్బుల్లా తన సైనిక శక్తిని తిరిగి పెంచుకునేందుకు ఆయన అంగీకరించే అవకాశాలు తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు.
కొన్ని మార్పులు సాధ్యమే
నెతన్యాహు ఓడిపోతే అక్టోబర్ 7 దాడులపై విచారణ, న్యాయవ్యవస్థ స్వతంత్రత, అల్ట్రా ఆర్థడాక్స్ యూదులకు సైనిక సేవ నుంచి మినహాయింపులు వంటి దేశీయ అంశాలపై మార్పులు రావచ్చు. మితిమీరిన రైట్ వింగ్ నేతల ప్రభావం తగ్గడంతో యూరప్, అరబ్ దేశాలతో సంబంధాలు మెరుగుపడే అవకాశముంది. అయితే అరబ్ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయబోనని ఐసెన్‌కోట్ చెప్పడం ఆయనకు ప్రభుత్వ ఏర్పాటులో ఇబ్బందిగా మారవచ్చు. స్పష్టమైన మెజారిటీ రాకపోతే రాజకీయ ప్రతిష్ఠంభన ఏర్పడి, నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగవచ్చు.
మొత్తంగా నెతన్యాహు ఓటమి ఇజ్రాయిల్ రాజకీయాల్లో మార్పునకు దారితీయవచ్చు. కానీ ఇరాన్, హమాస్, హిజ్బుల్లాపై కఠిన వైఖరి, పాలస్తీనా దేశ ఏర్పాటుకు వ్యతిరేకత కొనసాగితే పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం అంత సులభం కాదని అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకుడు మారినా విధానాలు మారకపోతే యుద్ధాల ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ప్లీజ్...
మద్దతు
ఇవ్వండి !
ఎన్నికల వేళ ట్రంప్‌పై నెతన్యాహూ ఒత్తిడి
నేడు ఇజ్రాయిల్ పార్లమెంటుకు ఎన్నికలు
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని అనేక సర్వేలు తేల్చి చెప్పడంతో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇజ్రాయిల్ పార్లమెంటుకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే నెతన్యాహూ పార్టీకి, ఆయన నేతృత్వం వహిస్తున్న కూటమికి ఏ మాత్రం విజయావకాశాలు లేవని పలు పోల్ సర్వేలు స్పష్టం చేశాయి. దీంతో ఆయన రాజకీయ మద్దతు కోసం ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నారు. గత మూడు రోజుల వ్యవధిలో ఆయన ట్రంప్‌తో రెండు సార్లు టెలిఫోన్‌లో మాట్లాడారు. మద్దతును పునరుద్ఘాటించాలని కోరారు. ఇజ్రాయిల్ పాత్రికేయులకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని, తనకు మద్దతు ఇస్తున్న విషయాన్ని తెలియజేయాలని అభ్యర్థించారు. ఎన్నికల పోరులో వెనుకబడి పోయానని తేలిపోవడంతో తీవ్ర అసహనానికి గురైన నెతన్యాహూ తాజాగా మద్దతు కోసం ట్రంప్‌ను ప్రాధేయపడుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇజ్రాయిల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 120 స్థానాలున్న పార్లమెంటులో 61 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. కాగా నెతన్యాహూ కూటమికి యాభై స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కూటమికి ఉన్న సంఖ్యాబలంతో పోలిస్తే ఇది 17 సీట్లు తక్కువ. కూటమిలో నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీకి 20 స్థానాలు మాత్రమే (ప్రస్తుత స్థానాలు 32) దక్కవచ్చు. కాగా మాజీ సైన్యాధ్యక్షుడు గడీ ఎల్‌సెంకట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 52 నుంచి 56 స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. రెండు అరబ్ ఇజ్రాయిల్ పార్టీలకూ కలిపి 14 నుంచి 16 సీట్లు రావచ్చు.
పాలస్తీనా దేశానికి నో
పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా కల్పించే రెండు దేశాల పరిష్కారాన్ని ఐసెన్‌కోట్ వ్యతిరేకిస్తున్నారు. జోర్డాన్ నది నుంచి మధ్యధరా సముద్రం వరకు భూభాగంలో ఇజ్రాయిల్‌కే ప్రధాన భద్రతా బాధ్యత ఉండాలని ఆయన అంటున్నారు. అయితే వెస్ట్‌బ్యాంక్‌లో అనుమతి లేని యూదుల నివాసాలు, పాలస్తీనీయులపై స్థిరనివాసుల దాడులను ఆయన వ్యతిరేకి స్తున్నారు. దీంతో కొన్ని అంశాల్లో మార్పులు వచ్చినా, పాలస్తీనా స్వతంత్ర దేశ ఏర్పాటు విషయంలో పెద్దగా పురోగతి ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







కామెంట్‌లు (0)