సీఎస్ సహా నలుగురు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మత్స్యకార సహకార సంఘాల ఎన్నికల నిర్వహణపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సూరేపల్లి నంద సోమవారం విచారణ చేపట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు, ముఖ్య కార్యదర్శులు సురేంద్రమోహన్, ఇలంబర్తి, నిఖిలతోపాటు ఎన్నికల అధికారి చంద్రమోహన్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణను వచ్చేనెల 20కి వాయిదా వేశారు.
ఆ ఉత్తర్వులను 4 వారాల్లో అమలు చేయాలి
గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై 2019లో ఇచ్చిన ఉత్తర్వులను నాలుగు వారాల్లో అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చేనెల 23లోగా నివేదిక సమర్పించకపోతే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సంతోష్ వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. యాకూబ్‌తోపాటు మరో 11 మంది దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ టి మాధవీదేవి విచారణ చేపట్టి, శాఖల మధ్య ఫైళ్ల బదిలీకి ఏండ్ల తరబడి సమయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉషిరెడ్డిపై చర్యలకు ఆదేశం
బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసినప్పటికీ కోర్టు విచారణలకు న్యాయవాదిగా హాజరవుతున్న ఉషిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. భూముల్లో విద్యుత్తు లైన్లు వేసిన వివాదంపై పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ నగేశ్ భీమపాక ఈ ఆదేశాలిచ్చారు. ఉత్తర్వుల ప్రతిని రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు పంపి, అన్ని బార్ అసోసియేషన్లకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ సోమవారం సమాచారం అందజేసింది.







కామెంట్‌లు (0)