పరువునష్టం కేసును కొట్టివేసిన కోర్టు
అమిత్ షాపై 2018లో చేసిన వ్యాఖ్యలకు
సంబంధించిన కేసు తీర్పు వెలువరించిన సుల్తాన్పూర్ కోర్టు
లక్నో : పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై 2018లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన పరువు నష్టం కేసులో సుల్తాన్‌పుర్ ప్రత్యేక కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. సోమవారం ఈ తీర్పు వెలువరిస్తూ ఈ కేసును కొట్టివేసింది.
2018లో బెంగళూరు వ్యాఖ్యలతో వివాదం
ఈ పరువు నష్టం కేసు 2018 ఆగస్టులో దాఖలైంది. అదే ఏడాది మేలో కర్నా టక రాజధాని బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ హత్య కేసులో అమిత్ షా నిందితుడిగా ఉన్నారని రాహుల్ వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. అప్పటి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, స్థానిక జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు విజయ్ మిశ్రా ఈ ఫిర్యాదు చేశారు. అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, పార్టీ కార్యకర్తగా మనస్తాపానికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకు పైగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు గతంలో తెలిపారు.
స్వయంగా కోర్టుకు రాహుల్
రాహుల్ గాంధీ తరఫు న్యాయవాదులు ఆయన ప్రసంగాన్ని విడివిడిగా తీసుకుని లేదా సందర్భం నుంచి వేరు చేసి పరువు నష్టం ఆరోపణలకు ఆధారంగా చూపడం సరికాదని వాదించారు. పూర్తి ప్రసంగాన్ని, దాని సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అక్టోబర్ 13న ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెలువరిస్తూ, సుల్తాన్‌పుర్ ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే కోర్టుకు రాహుల్ గాంధీ హాజరు నేపథ్యంలో సుల్తాన్పూర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, తీర్పును సవాలు చేస్తూ పైకోర్టును ఆశ్రయిస్తారా లేదా అన్నది తదుపరి పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలైతే నిందితుడు హాజరయ్యేలా బెయిల్ బాండ్లు, పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది.
న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న కాంగ్రెస్ నేతలు
రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ స్పందిస్తూ, ఆయనకు న్యాయస్థానాలు, రాజ్యాంగంపై గౌరవం ఉందని చెప్పారు. కేసులో విచారణ తేదీ ఉండటంతోనే సుల్తాన్‌పూర్‌కు వచ్చారని తెలిపారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను సరైన సందర్భంలో అర్థం చేసుకోలేదన్నది తమ అభిప్రాయమని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆరాధన మిశ్రా కూడా న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు రాహుల్ గతంలోనూ వచ్చారని, ఈసారి కూడా న్యాయపరమైన ప్రక్రియను గౌరవిస్తూ సుల్తాన్‌పూర్‌కు చేరుకున్నారని వివరించారు.
కోర్టుకు వెళ్లే సమయంలో ప్రమాదం
కోర్టు విచారణకు హాజరయ్యేందుకు సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి లక్నో విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ, అక్కడి నుంచి సుల్తాన్‌పుర్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. మైలురాయి 91 సమీపంలో కాన్వాయ్‌లోని నాలుగైదు వాహనాలతో పాటు ఓ అంబులెన్స్ పరస్పరం ఢీకొన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని, రాహుల్ గాంధీ క్షేమంగా ఉన్నారని తెలిపారు. లఖ్‌నవూ విమానాశ్రయంలో రాహుల్‌కు ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా, సీనియర్ నేత ప్రమోద్ తివారీ స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.





కామెంట్లు (0)