తీవ్రరూపు దాల్చిన నిరసనలు
వాహనాలు, భవనాలు, కార్యాలయాలకు నిప్పు...దుకాణాలు లూటీ
లాఠీచార్జీ, టియర్‌గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించిన పోలీసులు
ఆందోళనకారులకు తీవ్ర గాయాలు1,200 మందికి పైగా అరెస్ట్...అధ్యక్షభవనం మూసివేత
పారిస్ : ఫ్రాన్స్‌లో పెరిగిన జీవనవ్యయం, నిత్యావసరాలు-ఇంధన ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా శని, ఆదివారాలలో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐదున్నర లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. 143 సంవత్సరాల చరిత్ర కలిగిన లిమోజెస్ నగర టౌన్‌హాల్ భవనంలోకి నిరసనకారులు చొచ్చుకొఁకొనిపోయి నిప్పు పెట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 43 మీటర్ల ఎత్తున్న ప్రసిద్ధ గడియారం స్తంభం, పైకప్పు పూర్తిగా కూలిపోయాయి. పారిస్, లియోన్, మార్సెయిల్, లిల్లే, గ్రెనోబుల్ తదితర నగరాలలో కార్లు, దుకాణాలు, పర్యాటక కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. లిల్లేలో ఆపిల్ స్టోర్‌తో పాటు పలు షాపులను లూటీ చేశారు. హింసాత్మక ఘటనలకఁకు సంబంధించి పోలీసులు 1,200 మందిని అరెస్ట్ చేశారు. ఘర్షణల్లో 150 మందికి పైగా పోలీసులు గాయపడగా కొంతమంది ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. హింసను అణచివేసేందుకు పోలీసులు పలు చోట్ల భాష్పవాయు గోళాలను, నీటి ఫిరంగులను ఉపయోగించారు. అల్లర్లను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తీవ్రంగా ఖండించారు.
వివిధ నగరాలలో నిరసనలు
రాజధాని పారిస్‌లో లక్ష మందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
శాంతియుతంగా ప్రారంభమైన ర్యాలీలు రాత్రి సమయానికి హింసకు దారితీశాయి. ప్రసిద్ధ 'ప్లేస్ డి లా రిపబ్లిక్' ప్రాంతంలో ఆందోళనకారుల ఆగ్రహానికి అనేక కార్లు, ఓ రెస్టారెంట్, న్యూస్ కియోస్క్‌లు తగలబడిపోయాయి. వస్త్రాలు, ఆహార దుకాణాలపై దాడులు జరిగాయి. నిరసనకారులు కొన్ని దుకాణాలలో చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. భద్రతా కారణాల రీత్యా అధ్యక్షభవనాన్ని, పార్లమెంట్ సమీపంలోని మెట్రో స్టేషన్లను మూసివేశారు. దేశంలో మూడో అతి పెద్ద నగరమైన లియోన్‌లో సుమారు 20 వేల మంది ఆందోళనకారులు ర్యాలీలు తీశారు. చారిత్రక నగర పర్యాటక కార్యాలయానికి నిప్పు పెట్టడంతో అది కాలి బూడిదైంది. దక్షిణాన ఉన్న మార్సెయిల్లో నిరసనకారులు స్థానిక మున్సిపల్ పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు స్థానిక సిటీ హాలులోకి ప్రవేశించి ఫ్రాన్స్ రిపబ్లిక్ జాతీయ చిహ్నమైన 'మరియాన్' విగ్రహాన్ని పగలకొట్టారు. గ్రెనోబుల్, అవిగ్నాన్, పా, మాంట్ పెలియార్, వాలెన్స్, నిస్, నాంటెస్, బోర్డో, లిల్లే, స్ట్రాస్‌బర్గ్ నగరాలలోని సూపర్ మార్కెట్లు, లగ్జరీ బొటి క్లు, ఫార్మసీలను గుంపులుగా వచ్చిన యువకులు లూటీ చేశారు. అనేక భవనాలకు నిప్పు పెట్టారు.
నిరసనలకు వామపక్ష నేత మద్దతు
దేశాధ్యక్షుడు మాక్రాన్ వచ్చే సంవత్సరం పదవీవిరమణ చేయబోతున్నారు. వచ్చే ఏప్రిల్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్ని కలలో నేషనల్ ర్యాలీ నాయకురాలు మెరైన్ లే పెన్, వామపక్ష లా ఫ్రాన్స్ ఇన్సౌమిస్ పార్టీ (ఎల్‌ఎఫ్‌ఐ) నేత జీన్-లూక్ మెలాన్చోన్ మధ్య పోరు సాగవచ్చునని పరిశీలకులు తెలిపారు. దేశంలో జరుగుతున్న నిరసనల్లో జీన్-లూక్ మెలాన్చో కూడా పాల్గొంటున్నారు. దోపిడీలు, దహనకాండను ఆయన ఖండిస్తూనే ఆందోళనకారులపై పోలీసులు ప్రదర్శిస్తున్న జులుంను దుయ్యబట్టారు.
విద్యార్థులతో మొదలై...
దేశంలో 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులు చదువుకునే సెకండరీ పాఠశాలల్లో సిబ్బంది కొరత అధికంగా ఉండడం, పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇటీవల నిరసనలకు దిగారు. విద్యార్థి సంఘాలు ప్రారంభించిన ఆందోళనకు కార్మిక సంఘాలతో పాటు ఒకప్పటి నిరసనోద్యమం 'ఎల్లో వెస్ట్స్' కూడా తోడయ్యాయి. నిరసన బృందాలలో 'గిలెట్స్ జాన్స్' (పసుపు చొక్కా) కూడా చేరింది. పెరిగిన జీవనవ్యయానికి వ్యతిరేకంగా ఈ సంస్థ 2018 నుంచి ఓ సంవత్సరం పాటు ఆందోళనలు చేపట్టింది. ఇది ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన నిరసనోద్యమాలలో ఒకటిగా నిలిచింది. కాగా నిరసనకారులు ఫ్లోరోసెంట్ ఎల్లో జాకెట్లు ధరించి వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వ విధానాలకు కేవలం సంపన్నులకే మేలు చేస్తున్నాయని, పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. భాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులు ఉపయోగిస్తున్నారు. సెంట్రల్ పారిస్‌లో ఓ గుంపు పైకి పోలీసులు దూసుకొని పోయి పలువురిని లాఠీలతో చితకబాదడం కనిపించింది. కొద్ది రోజుల క్రితం పోలీసులు ప్రయోగించిన గ్రెనేడ్ కారణంగా ఓ నిరసనకారుడి చేయి తెగి పడిపోయింది. అల్లర్లకఁ పాల్పడిన 'అల్ట్రా లెఫ్ట్' గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన లెకోర్ను హెచ్చరించారు.






కామెంట్లు (0)