Magazines

దంచికొట్టలేక..!

1 గంట క్రితం

Unable to crush..!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 4 నిమిషాల చదవడం

248 ఛేదనలో భారత్‌ చతికిల

అభిషేక్‌, ఇషాన్‌, అయ్యర్‌ విఫలం

ఉప్పల్‌ టీ20లో విండీస్‌ గెలుపు

వెస్టిండీస్‌ 247/3, భారత్‌ 223/10

ఉప్పల్‌ ధమాకాలో టీమ్‌ ఇండియా చతికిల. పరుగుల ప్యారడైజ్‌లో ఆతిథ్య జట్టు అంచనాలను అందుకోలేదు. 248 పరుగుల ఛేదనలో భారత్‌ 223 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్‌ కిషన్‌ (6), శ్రేయస్‌ అయ్యర్‌ (16), అభిషేక్‌ శర్మ (29) నిరాశపరచటంతో ఛేదనలో టీమ్‌ ఇండియా చతికిల పడింది. 24 పరుగులతో గెలుపొందిన వెస్టిండీస్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది. కెప్టెన్‌ షయ్‌ హోప్‌ (102 నాటౌట్‌) అజేయ సెంచరీతో వెస్టిండీస్‌ తొలుత 247/3 పరుగుల భారీ స్కోరు చేసింది. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌ శనివారం బెంగళూరులో జరుగనుంది.

నవతెలంగాణ-హైదరాబాద్‌: బ్యాటింగ్‌కు అనుకూలించిన ఉప్పల్‌ టీ20లో టీమ్‌ ఇండియా ఛేదనలో నిరాశపరిచింది. టాప్‌ ఆర్డర్‌లో ఓపెనర్‌ సంజు శాంసన్‌ (56, 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించినా,ఇతర బ్యాటర్లు నిరాశపరిచారు. అభిషేక్‌ శర్మ (29, 24 బంతులత్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (16, 11 బంతుల్లో 2 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (6, 3 బంతుల్లో 1 సిక్స్‌), నమన్‌ ధిర్‌ (0) తేలిపోయారు. తెలుగు తేజాలు తిలక్‌ వర్మ (43, 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (41, 20 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) ఆశలు రేపినా.. విండీస్‌ పేసర్‌ కీమో పాల్‌ (5/41) ఐదు వికెట్ల ప్రదర్శనతో విండీస్‌ను గెలుపు బాటలో నడిపించాడు. 19.3 ఓవర్లలో 223 పరుగులకే భారత్‌ ఆలౌట్‌ కాగా, వెస్టిండీస్‌ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 247 పరుగులు చేసింది. కెప్టెన్‌ షయ్‌ హోప్‌ (102 నాటౌట్‌, 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ (49 నాటౌట్‌, 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (33, 12 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఐదు వికెట్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పిన విండీస్‌ పేసర్‌ కీమో పాల్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు.

ఛేదనలో చతికిల : 248 పరుగుల ఛేదనలో భారత్‌కు అదిరే ఆరంభం దక్కింది. పవర్‌ప్లేలో అభిషేక్‌ శర్మ (29) గర్జించలేదు. కానీ మరో ఓపెనర్‌ సంజు శాంసన్‌ (56) ధనాధన్‌ అర్థ సెంచరీతో చెలరేగాడు. శాంసన్‌ మెరుపులతో 4.1 ఓవర్లలోనే తొలి వికెట్‌కు భారత్‌ 60 పరుగులు జోడించింది. కానీ శాంసన్‌ నిష్ర్కమణ తర్వాత ఛేదనలో భారత్‌ లయ కోల్పోయింది. అభిషేక్‌ శర్మ ఎదురుదాడి చేసేందుకు ఇబ్బంది పడగా, ఇషాన్‌ కిషన్‌ (6), శ్రేయస్‌ అయ్యర్‌ (16) నిరాశపరిచారు. స్కోరు బోర్డుతో పాటు భారత్‌ వికెట్లు సైతం కోల్పోవటంతో వెస్టిండీస్‌ది పైచేయిగా కొనసాగింది. 130/5తో మ్యాచ్‌పై భారత్‌ ఆశలు ఆవిరవుతున్న తరుణంలో తెలుగు తేజాలు తిలక్‌ వర్మ (43), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (41) ఆరో వికెట్‌కు 70 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించారు. విండీస్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసిన ఈ జోడీ.. భారత్‌ను గెలుపు దిశగా నడిపించారు. జోరుమీదున్న తిలక్‌ వర్మను షెఫర్డ్‌ అవుట్‌ చేయటంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. నితీశ్‌, అక్షర్‌ పటేల్‌ (3) సైతం వెనుదిరగటంతో విండీస్‌ పట్టు బిగించింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ (5) రిటైర్డ్‌ హర్ట్‌ కావటంత 19.3 ఓవర్లలో భారత్ 223 పరుగులకే సరిపెట్టుకుంది. విండీస్‌ బౌలర్లలో షమర్‌ జొసెఫ్‌, షమర్‌ స్పింగర్‌, మోతీ వికెట్లు పడగొట్టారు.

హోప్‌ అజేయ సెంచరీ :

ఉప్పల్‌లో టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ షయ్‌ హోప్‌ (102 నాటౌట్‌) మరో సెంచరీతో కదం తొక్కగా వెస్టిండీస్‌ భారీ స్కోరు చేసింది. పవర్‌ప్లేలో ఎదురుదాడి చేసిన కరీబియన్లు.. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. జెవెల్‌ ఆండ్రూ (21) వికెట్‌తో అక్షర్‌ పటేల్‌ బ్రేక్‌ ఇచ్చినా.. హెట్‌మయర్‌ (33) తోడుగా హోప్‌ కీలక భాగస్వామ్యం నిర్మించాడు. రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో హోప్‌ 28 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. రోవ్‌మాన్‌ పావెల్‌ (24), రూథర్‌ఫోర్డ్‌ (49 నాటౌట్‌)తోడుగా రెచ్చిపోయిన హోప్‌ మరో 22 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేశాడు. హోప్‌, రూథర్‌ఫోర్డ్‌ మెరుపులతో 16.4 ఓవర్లలోనే 200 పరుగులు దాటేసిన వెస్టిండీస్‌.. 20 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోరు చేసింది. హోప్‌ సెంచరీతో రాంచిలో 250 పరుగులు ఛేదించిన కరీబియన్లు.. ఉప్పల్‌లో అతడు మళ్లీ శతకబాదగా మరోసారి భారీ స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌లు తలా ఓ వికెట్‌ పడగొట్టారు. నమన్‌ ధిర్‌, నితీశ్‌కుమార్‌ రెడ్డి, సహా అర్ష్‌దీప్‌ సింగ్‌, మయాంక్‌ యాదవ్‌లు ధారాళంగా పరుగులు ఇచ్చారు.

స్కోరు వివరాలు :

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ : షయ్‌ హోప్‌ నాటౌట్‌ 102, జెవెల్‌ అండ్రూ (ఎల్బీ) అక్షర్‌ పటేల్‌ 21, షిమ్రోన్‌ హెట్‌మయర్ (సి,బి) ప్రిన్స్‌ యాదవ్‌ 33, రోవ్‌మాన్‌ పావెల్‌ (సి) శాంసన్‌ (బి) అర్ష్‌దీప్‌ సింగ్‌ 24, షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ నాటౌట్ 49, ఎక్స్‌ట్రాలు : 18, మొత్తం : (20 ఓవర్లలో 3 వికెట్లకు) 247.

వికెట్ల పతనం : 1-52, 2-110, 3-156.

బౌలింగ్‌ : మయాంక్‌ యాదవ్‌ 4-0-52-0, అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-52-1, ప్రిన్స్‌ యాదవ్‌ 4-0-36-1, అక్షర్‌ పటేల్‌ 4-0-45-1, నమన్‌ ధిర్‌ 1-0-19-0, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 3-0-39-0.

భారత్‌ ఇన్నింగ్స్‌ : సంజు శాంనన్‌ (సి) హెట్‌మయర్‌ (బి) కీమో పాల్‌ 56, అభిషేక్‌ శర్మ (సి) స్పింగర్‌ (బి) మోతీ 29, ఇషాన్‌ కిషన్ (సి) అండ్రూ (బి) కీమో పాల్‌ 6, శ్రేయస్‌ అయ్యర్ (సి) అండ్రూ (బి) స్పింగర్‌ 16, తిలక్‌ వర్మ (సి) పావెల్‌ (బి) షెఫర్డ్‌ 43, నమన్‌ ధిర్‌ (స్టంప్డ్‌) హోప్‌ (బి) మోతీ 0, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) పావెల్‌ (బి) కీమో పాల్‌ 41, అక్షర్‌ పటేల్‌ (సి) రూథర్‌ఫోర్డ్‌ (బి) కీమోపాల్‌, ప్రిన్స్‌ యాదవ్‌ (బి) కీమో పాల్‌ 0, అర్ష్‌దీప్‌ సింగ్‌ రిటైర్డ్‌ హర్ట్‌ 5, మయాంక్‌ యాదవ్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 24, మొత్తం: (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 223.

వికెట్ల పతనం : 1-60, 2-67, 3-97, 4-130, 5-130, 6-200, 7-212, 8-212, 9-213, 10-223 (రిటైర్డ్‌ హర్ట్‌).

బౌలింగ్‌ : రోస్టన్‌ ఛేజ్‌ 4-0-43-0, షమర్‌ జొసెఫ్‌ 2.3-0-47-0, రోమారియో షెఫర్డ్‌ 3-0-32-1, కీమో పాల్‌ 4-0-41-5, షమర్‌ స్పింగర్‌ 4-0-40-1, మోతీ 2-0-13-2.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్