Magazines

బీజేపీ నేతల బిడ్డలకువిదేశీ చదువులు

1 గంట క్రితం

children of BJP leaders
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 4 నిమిషాల చదవడం

కాషాయ నాయకుల 'స్వదేశీ' నినాదాలు వారికి వర్తించవా?
హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌, యేల్‌ వంటి ప్రతిష్టాత్మక వర్సిటీల్లో కమలనాథుల వారసులు
దేశంలోని సామాన్యులకు మాత్రం కష్టాల చదువులు..
భారత్‌లో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై కేంద్రం నిర్లక్ష్యం

ఖరీదైన చదువులతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇక్కట్లు

మరి.. మోడీ 'వికసిత్‌ భారత్‌' ఎవరికి?

'భారత్‌మాతా'..'స్వదేశీ'..'దేశం కోసం.. ధర్మం కోసం'.. ‘వికసిత్‌ భారత్‌’.. ‘విశ్వగురు’.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. ఇవీ ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తరచూ వినిపించే నినాదాలు. కానీ దేశంలో ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందుతోందా? ప్రతి యువకుడికి తగిన ఉద్యోగం దొరుకుతోందా? ఒకవైపు బీజేపీ అగ్రనేతల వారసులు పలువురు విదేశీ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో చదివి ఉన్నత కెరీర్‌లలో కొనసాగుతుండగా.. మరోవైపు సామాన్య కుటుంబాల పిల్లలు మాత్రం ఫీజులు, కోచింగ్‌ ఖర్చులు, పోటీ పరీక్షలు, నిరుద్యోగంతో పోరాడుతున్నారు. నేతల వారసులకు ప్రపంచస్థాయి విద్య అందుబాటులో ఉన్నప్పుడు.. సామాన్యుల పిల్లలకు అలాంటి అవకాశాలు ఎందుకు దక్కటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ : ప్రపంచస్థాయి విద్య.. ఉన్నత ఉద్యో గాలు.. అంతర్జాతీయ కెరీర్‌లు.. ఇవన్నీ రాజకీయ నాయకుల పిల్లలకు అందుబాటులో ఉన్న అవకాశా లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన పలువురు అగ్రనేతల కుటుంబాల్లోని యువత విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివి వ్యాపారం, న్యాయశా స్త్రం, పరిశోధన, ఇతర వృత్తుల్లో స్థిరపడుతున్నారు. కానీ దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మాత్రం నాణ్యమైన విద్య అందుకోవ డం రోజురోజుకూ భారంగా మారుతోంది.

children of BJP leadersవిదేశీ వర్సిటీల్లో బీజేపీ నేతల వారసులు

'ఇండియాటుడే' కథనం ప్రకారం.. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కుమారుడు ధ్రువ్‌ గోయల్‌ హార్వర్డ్‌ కాలేజీ, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చదివి పెట్టుబడుల సంస్థకు సీఈఓగా కొనసాగుతున్నారు. మరోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కుమారుడు నీరజ్‌ సింగ్‌ బ్రిటన్‌లోని లీడ్స్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానార్యమన్‌ సింధియా అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీలో చదివి మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కుమార్తె అనన్య రాజే సింధియా రోడ్‌ ఐలాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌లో చదివి అమెరికాలో గూగుల్‌ డీప్‌మైండ్‌లో డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కుమార్తె వాంగ్మయి పరకాల.. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలో జర్నలిజంలో మాస్టర్స్‌ చేశారు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ కుమార్తె తన్యా వైష్ణవ్‌ బ్రిటన్‌లో ఎంబీఏ చేశారు. బీజేపీ సీనియర్‌ నాయకరాలు స్మృతి ఇరానీ కుమార్తె షనెల్లె ఇరానీ.. అమెరికాలోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి అంతర్జాతీయ న్యాయరంగంలో ఉన్నత బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కుమారుడు కార్తికేయ చౌహాన్‌ అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. వీరి విద్యార్హతలు, కెరీర్‌లు వ్యక్తిగత విజయాలే కావచ్చు. విదేశాల్లో చదవడం తప్పు కాదు. కానీ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నేతలు విద్యా రంగంలో సమాన అవకాశాల గురించి మాట్లాడుతూ, స్వదేశీ నినాదాలు వినిపిస్తూ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నాయకుల పిల్లలతో సమానంగా సామాన్యుల పిల్లలకు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

విదేశాల నుంచి రావాలంటే అవకాశాలు కల్పించాలి

విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చి దేశ సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేయాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు పిలుపునిచ్చారు. అమెరికాలో కొన్ని సంస్థల ఉద్యోగుల గ్రీన్‌కార్డు ప్రక్రియపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే విదేశాల నుంచి ప్రతిభావంతులు తిరిగి రావాలంటే భారత్‌లో నాణ్యమైన ఉద్యోగాలు, పరిశోధన అవకాశాలు, తగిన వేతనాలు, వ్యాపారాలకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. ఈ విషయంలో మాత్రం మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి.

సామాన్యుల పిల్లలకు సమాన అవకాశాలేవి?

బీజేపీ నేతల పిల్లలు విదేశాల్లో చదవడం తప్పుకాదు. వ్యక్తిగతంగా ఎవరైనా తమ పిల్లలకు మెరుగైన విద్య అందించుకోవచ్చు. కానీ దేశంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడం, విద్యా ఖర్చులను తగ్గించడం, యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మోడీ ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ అంటున్నప్పుడు.. విద్యా అవకాశాలు కూడా అందరికీ సమానంగా అందుతున్నాయా అన్నదే అసలు ప్రశ్న. నేతల వారసులకు ప్రపంచస్థాయి విద్య అందుబాటులో ఉండటం ఎవరికీ అభ్యంతరం కాదు. కానీ సామాన్యుల పిల్లలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కలలను వదులుకోవాల్సి వస్తే, ఆ అభివృద్ధి ఎవరి కోసం అన్న ప్రశ్నను ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని మేధావులు హెచ్చరిస్తున్నారు. దేశాభివృద్ధిని కేవలం భారీ నినాదాలతో కొలవలేమనీ, పేద కుటుంబంలోని విద్యార్థి కూడా నాణ్యమైన విద్యను పొంది, ప్రతిభ ఆధారంగా ఉన్నత స్థాయికి చేరుకోగలిగినప్పుడే అభివృద్ధికి నిజమైన అర్థం ఉంటుందని సూచిస్తున్నారు.

వికసిత్‌ భారత్‌ నినాదాలు విద్యార్థులకు భారాలు

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని చెప్తోంది. డిజిటల్‌ ఇండియా, నైపుణ్యాభివృద్ధి, యువతకు ఉపాధి వంటి కార్యక్రమాలను ప్రచారం చేస్తోంది. అయితే అభివృద్ధి నినాదాలు విద్యార్థుల వాస్తవ జీవితాల్లో ఎంత మార్పు తెస్తున్నాయన్నదే చర్చనీయాంశంగా మారింది. ప్రయివేటు పాఠశాలల ఫీజులు, కళాశాలల ఖర్చులు, పోటీ పరీక్షల కోచింగ్‌ భారం సామాన్య కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నియామకాలు వంటి అంశాలు బలహీనంగా ఉంటే.. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు విద్యార్థులు ఖరీదైన ప్రయివేటు విద్యపై ఆధారపడాల్సి వస్తుంది. ఫలితంగా డబ్బున్న కుటుంబాల పిల్లలకు మెరుగైన అవకాశాలు లభిస్తుండగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు పోటీలో వెనుకపడే ప్రమాదం పెరుగుతోంది.

చదివినా ఉద్యోగం దొరుకుతుందా?

దేశంలో మోడీ పాలనలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన యువతకు తగిన ఉద్యోగాలు లభించకపోవడం మరో ఆందోళనకర అంశం. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఏండ్ల తరబడి సమయం, డబ్బు వెచ్చిస్తున్న విద్యార్థులకు నియామకాల ఆలస్యం, పరిమిత ఉద్యోగ అవకాశాలు నిరాశ కలిగిస్తున్నాయి. విద్యారుణాలు తీసుకుని చదివిన యువతకు ఉపాధి దొరకకపోతే కుటుంబాలపై అప్పుల భారం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పాలకులు యువతకు ఉపాధి, విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడంపై స్పష్టమైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని మేధావులు అంటున్నారు. విదేశాల్లో చదివిన నేతల పిల్లల విజయాలను ప్రచారం చేయడం కంటే, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన సామాన్య విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చేరుకునే పరిస్థితులను కల్పించాలనీ, అది ప్రభుత్వ బాధ్యత అని చెప్తున్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్