Magazines

మహి ముగించాడు

28 నిమిషాల క్రితం

mahi
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 2 నిమిషాల చదవడం

ఐపీఎల్‌ కెరీర్‌‌కు ధోని వీడ్కోలు

సూపర్‌‌కింగ్స్‌ మెంటార్‌‌గా కొత్త బాధ్యతలు


చెన్నై (తమిళనాడు)

ఐపీఎల్‌ ‌దిగ్గజ క్రికెటర్‌, తొలి సీజన్‌ ‌వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఎం.ఎస్‌ ‌ధోని ఎట్టకేలకు ఐపీఎల్‌ ‌కెరీర్‌‌ను ముగించాడు. 19 సీజన్లు ఐపీఎల్‌‌లో కెప్టెన్‌‌గా, ఆటగాడిగా అభిమానులను అలరించిన మహేంద్రుడు.. మైలురాయి సీజన్‌ ‌ముంగిట ఐపీఎల్‌‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌ 2027 సీజన్‌కు రిటెన్షన్‌ ‌జాబితా ప్రకటించే మూడు గంటల ముందు చెన్నై సూపర్‌‌కింగ్స్‌ ‌మహేంద్ర సింగ్‌ ‌ధోని వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించింది. ఎం.ఎస్‌ ‌ధోని ఇక నుంచి చెన్నై సూపర్‌‌కింగ్స్‌ ‌మెంటార్‌‌గా వ్యవహరించనున్నాడు.

​మా గుర్తింపే ధోని

ఎం.ఎస్‌ ‌ధోని కెప్టెన్‌‌గా చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ను ఐదుసార్లు ఐపీఎల్‌, రెండు సార్లు చాంపియన్‌ ‌లీగ్‌ ‌చాంపియన్‌‌గా నిలిపాడు. చెన్నై చెపాక్‌ ‌మైదానంలో అభిమానుల నడుమ వీడ్కోలు పలకాలని ఉందని ధోని గతంలో వ్యాఖ్యానించినా.. మోకాలు నొప్పితో మహి వీడ్కోలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘ఎం.ఎస్‌ ‌ధోని లేనిదే చెన్నై సూపర్‌‌కింగ్స్‌ ‌లేదు. సుమారు రెండు దశాబ్దాలు కలిసి నడిచాం. ఇందులో విజయాలు, ఎదురుదెబ్బలు చూశాం. మా బంధం ఎందుకు ఇంత బలమైనదంటే..మేమెప్పుడూ ఉద్దేశాలను ప్రశ్నించలేదు. ఆ నమ్మకమే మా ప్రయాణాన్ని నడిపించింది. 2008లో ధోని మా జట్టులో ఉండాలని నేను పట్టుపట్టాను. నేను తీసుకున్న నిర్ణయాల్లో అదే అత్యుత్తమం. ధోని సాధించిన విజయాలు కాదు, అతడి అంతటి గొప్ప వ్యక్తి కాబట్టి నా నిర్ణయం గొప్పదిగా నిలిచింది. మా గుర్తింపులో ధోని ఎప్పటికీ భాగమే. చెన్నై సూపర్‌‌కింగ్స్‌ ఎప్పటికీ అతడి సొంతిల్లే’ అని చెన్నై సూపర్‌‌కింగ్స్‌ ‌యజమాని, బీసీసీఐ మాజీ కార్యదర్శి ఎన్‌. శ్రీనివాసన్‌ అన్నాడు.

​ఇక మెంటార్‌‌గా ప్రయాణం

ఎం.ఎస్‌ ‌ధోని 2008 ఐపీఎల్‌ ‌వేలంలో రికార్డు ధరకు చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌కు దక్కాడు. ధోని కోసం ముంబయి ఇండియన్స్‌ ఆఖరు వరకు పోటీపడింది. ప్రతి ప్రాంఛైజీ బిడ్‌ ‌వేసిన ఆటగాడిగా ధోని రికార్డు నెలకొల్పాడు. 2010, 2011, 2018, 2021, 2023లో ‌ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్‌‌కింగ్స్‌ ఐపీఎల్‌ ‌చాంపియన్‌‌గా నిలిచింది. 2010, 2014లో చాంపియన్స్‌ ‌లీగ్‌ ‌విజేతగా నిలిచింది. వరుసగా రెండు ఐపీఎల్‌ ‌టైటిల్స్‌.. ఒకే ఏడాదిలో ఐపీఎల్‌, చాంపియన్స్‌ ‌లీగ్‌ ‌టైటిల్‌ ‌సాధించిన తొలి జట్టుగా చెన్నై సూపర్‌‌కింగ్స్‌ ‌నిలిచింది. 2016, 2017 సీజన్లలో రైజింగ్‌ ‌పుణె సూపర్‌‌జెయింట్స్‌‌కు ధోని ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌ ‌కెరీర్‌‌లో ధోని 38.30 సగటు, 137.45 స్ర్టయిక్‌‌రేట్‌‌తో 5439 పరుగులు చేశాడు. సూపర్‌‌కింగ్స్‌‌కు 12 సీజన్లు కెప్టెన్సీ వహించిన ధోని.. 2022లో రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. సీజన్‌ ‌మధ్యలోనే జడేజా తప్పుకోగా.. మహి మళ్లీ సారథ్యం అందుకున్నాడు. 2023లో ఐపీఎల్‌ ‌టైటిల్‌‌ను సూపర్‌‌కింగ్స్‌‌ విజేతగా నిలబెట్టాడు. గత రెండు సీజన్లుగా సూపర్‌‌కింగ్స్‌‌కు రుతురాజ్‌ ‌గైక్వాడ్‌ ‌నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఆటగాడిగా తప్పుకున్న ధోని.. వచ్చే సీజన్‌ ‌నుంచి సూపర్‌‌కింగ్స్‌ ‌మెంటార్‌‌గా పని చేయనున్నాడు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్