దేశంలో ఆర్థికాభివృద్ధి గురించి పాలకుల ప్రచారం ఆకాశాన్ని తాకుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలబెడతామని గొప్పలు చెబుతున్నారు. జీడీపీ వృద్ధి రేటు పెరుగుతోందని గణాంకాలు వల్లిస్తున్నారు. కానీ కోట్లాది మంది ప్రజలు నిత్యావసరాలు కొనలేక సతమతమవుతున్న వాస్తవాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. మాటిమాటికీ అచ్చేదిన్ అంటున్నారు. కానీ అచ్చేదిన్ పక్కన పెడితే సచ్చేదిన్ మాత్రం కనిపిస్తోంది. కష్టపడి సంపాదించిన ఆదాయం కుటుంబ అవసరాలకే సరిపోవడం లేదు. నాలుగు నెలలుగా హైదరాబాద్ మార్కెట్లో ఉల్లి కిలో రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. కూరగాయలు, పప్పులు, నూనెలు, పాలు వంటి నిత్యావసరాల ధరలూ తగ్గడం లేదు. దీనికితోడు ఎల్‌నినో ప్రభావంతో బియ్యం కొరత ఏర్పడుతుందనే వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు బతికేదెలా? ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలన ఎవరికి ఉపయోగం?
ధరల పెరుగుదల తీవ్రతను ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 12.29 శాతానికి చేరింది.
సెప్టెం బర్లో ఇది 11.39 శాతంగా ఉంది. అంటే వ్యాపారులు, ఉత్పత్తిదారుల స్థాయిలో సరుకుల ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులు దుకాణాల్లో కొనుగోలు చేసే వస్తువుల ధరల పెరుగుదలను చిల్లర ద్రవ్యోల్బణం అంటారు. ఇది 5.54 శాతం నుంచి 6.09 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతం నుంచి 8.94 శాతానికి చేరింది. ఉదాహరణకు, గత ఏడాది రూ.100కు లభించిన సరుకులకు ఇప్పుడు సగటున రూ.110 ఖర్చు చేయాల్సి వస్తోంది. మిగతా గణాంకాలూ ఇదే ధరల భారాన్ని సూచిస్తున్నాయి. ఒక్కో వస్తువు ధర పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఉల్లి ధరల సూచీ 116.22 శాతం, వెల్లుల్లి 60.74 శాతం, అల్లం 48.32 శాతం, నిమ్మకాయలు 47.30 శాతం పెరిగాయి. బియ్యం ధరల్లోనూ గణనీయమైన పెరుగుదల నమోదైంది. చిరుధాన్యాల ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది.
క్రిసిల్ నివేదిక ప్రకారం ఇంట్లో తయారు చేసుకునే శాఖాహార భోజనం ఖర్చు గతేడాదితో పోలిస్తే 12 శాతం, మాంసా హార భోజనం ఖర్చు 9 శాతం పెరిగింది.అంటే ఇంట్లో వండు కుని తినడానికీ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
గ్యాస్ ధరల పెరుగుదలతో హోటళ్లలో భోజనం, టిఫిన్ల ధరలూ పెరుగు తున్నాయి. విద్యార్థులు, చిరుద్యోగులు, వలస కార్మికులు, చిన్న వ్యాపారుల జీవన వ్యయమూ పెరుగుతోంది. అసలు సమస్య ప్రజల ఆదాయా లకు, ఖర్చులకు మధ్య పెరుగుతున్న అంతరం. వేతనాలు, కూలి రేట్లు, ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. కానీ ధరలు మాత్రం ఎగబాకు తున్నాయి. నెల జీతం అందగానే ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు, పిల్లల చదువులు, వైద్యం, రవాణా, ఆహార ఖర్చులకే సరిపోతోంది. పొదుపు మాట అటుంచి అప్పులు చేయాల్సి వస్తోంది. పేద కుటుంబాలు పప్పులు, పాలు, పండ్ల వంటి పోషకాహారాన్ని తగ్గించుకుంటుండగా, మధ్యతరగతి కుటుంబాలూ అవసరాలను కుదించుకుంటున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంటే మార్కెట్లో డిమాండ్ ఎలా పెరుగుతుంది? ఆర్థిక వ్యవస్థ బలపడినట్లు ఎలా చెప్పగలం?
ధరల పెరుగుదలను కేవలం ద్రవ్యోల్బణం గణాంకాలతో కొలవడం వల్ల ప్రజల కష్టాలు తగ్గవు. ద్రవ్యోల్బణం తగ్గినా ధరలు పాత స్థాయికి రావు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే వారి కొనుగోలు శక్తి పెరగాలి. ఇందుకోసం నిరుద్యోగాన్ని తగ్గించి, శాశ్వత ఉపాధి కల్పిం చాలి. కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీల ఆదాయాలు పెంచాలి. కనీస వేతనాలను జీవన వ్యయానికి అనుగుణంగా సవరించాలి. మరోవైపు రూపాయి విలువ క్షీణించడం దిగుమతుల వ్యయాన్ని పెంచి నిత్యావసర వస్తువుల ధరలపై అదనపు భారాన్ని మోపుతోంది. ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసి, అక్రమ నిల్వలు, గుత్తాధిపత్యాన్ని అరికట్టి మార్కెట్‌పై సమర్థవంతమైన నియంత్రణ ఉండాలి. ప్రజల ఆదాయాలు పెరగకుండా వడ్డీ రేట్లు పెంచడం, రుణభారాన్ని పెంచడం సమస్యకు పరిష్కారం కాదు. ప్రజల ఆదాయాలను పెంచడంలో విఫలమై, రూపాయి విలువను కాపాడలేక, ఆర్థిక భారాన్ని సామాన్యులపైకి నెట్టే పాలకుల విధానాలే ధరల పెరుగుదలకు మూల కారణాలుగా నిలుస్తున్నాయి.
ప్రభుత్వం ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఫలాలు ఎవరికి అందుతున్నాయో కూడా చెప్పాలి.
సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతూ, మెజారిటీ ప్రజల ఆదాయాలు పెరగకపోతే జీడీపీ వృద్ధి సామాన్యుడి జీవితాన్ని మార్చలేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి ముందు ప్రజలకు కడుపునిండా తిండి అందించాలి. కొనుగోలు శక్తిని పెంచడం, ఉపాధి కల్పించడం, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, చిన్న పరిశ్రమలకు చేయూత నివ్వడం, కార్మికులకు మెరుగైన వేతనాలు కల్పించడం తక్షణ కర్తవ్యం. అభివృద్ధి అంటే జీడీపీ అంకెలు పెరగడం కాదు.. సామాన్యుడి బతుకు భారంగా మారకుండా చూడటం. ప్రజలు బతకడానికే ఇబ్బంది పడుతుంటే మూడో ఆర్థికశక్తిగా ఎదుగుతున్నామనే ప్రచారానికి అర్థమేముంది?
ద్రవ్యోల్బణ దహనం!
34 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026 | 3 నిమిషాల చదవడం





కామెంట్లు (0)