Magazines

బుల్లెట్ ట్రైన్ పై దోబూచులాట

1 గంట క్రితం

train
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 3 నిమిషాల చదవడం

శంషాబాద్–చెన్నై బుల్లెట్ రైలు మార్గం అలైన్మెంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అయితే గతంలో ప్రకటించిన జాతీయ రహదారి 65కు సమాంతరంగా సూర్యాపేట మీదుగా రైలు నిర్మిస్తామని స్పష్టం చేయలేదు. మరోవైపు, అలైన్మెంట్ మార్పునకు రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు వార్తలు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం హైదరాబాద్, అమరావతి రాజధానులను అనుసంధానిస్తూ వేగవంతమైన రైలు సౌకర్యం కల్పించాల్సి ఉంది. రెండేళ్ల క్రితం శంషాబాద్-విశాఖపట్నం మార్గంలో సర్వే నిర్వహించినా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆంధ్ర పెట్టుబడిదారులు, ప్రైవేట్ రవాణా యజమానుల లాబీయింగ్ కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి.


ఇప్పుడు బుల్లెట్ రైలు అలైన్మెంట్ మార్పు వెనుక కూడా ఇలాంటి అదృశ్య శక్తుల ప్రభావం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జాతీయ రహదారి 65పై సూర్యా పేట కీలకమైన వాణిజ్య, చారిత్రక, పారిశ్రామిక కేంద్రం. ఆసియాలో ప్రముఖమైన సుధాకర్ పీవీసీ పాలిమర్స్ పరిశ్రమ, ఆసియాలోనే రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్‌పల్లి జాతర, ఒకప్పుడు తెలంగాణలోనే అతిపెద్దదైన వ్యవసాయ మార్కెట్ ఈ ప్రాంత ప్రత్యేకతలు. పిల్లలమర్రి, ఉండ్రుగొండ దేవాలయాలు, చారిత్రక వేణుగోపాలస్వామి, శివాలయాలు కూడా ఈ ప్రాంత ప్రాధాన్యతను చాటుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సూర్యాపేటకు ఇప్పటివరకు రైల్వే సౌకర్యం లేకపోవడం విచారకరం. 1874 అక్టోబర్ 9న హైదరాబాద్‌లో మొదటి రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. 1873లో నిర్మాణం ప్రారంభమైన వాడి-హైదరాబాద్ బ్రాడ్‌గేజ్ మార్గం ద్వారా హైదరాబాద్ రైల్వే అనుసంధానం సాధించింది. ఆ తర్వాత వరంగల్, బలార్షా వరకు రైల్వే మార్గాలు విస్తరించాయి.

కానీ హైదరాబాద్‌కు సమీపంలోని సూర్యాపేట మాత్రం రైలు మార్గానికి నోచుకోలేదు. పలుమార్లు సర్వేలు జరిగినా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. కృష్ణా నదీ జలాల విషయంలోనూ ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందనే ఆవేదన ప్రజల్లో ఉంది. జాతీయ రహదారి 65పై ప్రతిరోజూ సూర్యాపేట మీదుగా సుమారు ఆరు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అధిక రద్దీతో ప్రమాదాలు, కాలుష్యం, టోల్‌గేట్ల వద్ద గంటల నిరీక్షణ ఎదురవుతున్నాయి. ఈ మార్గంలో బుల్లెట్ రైలు ఏర్పాటైతే ప్రయాణ సమయం తగ్గడంతోపాటు విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అధిక ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రాంతాలను అనుసంధానించడం ద్వారానే భారీ పెట్టుబడులతో నిర్మించే రైల్వే కారిడార్లు ఆర్థికంగా విజయవంతమవుతాయి. వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుందనే కారణంతో అధిక జనాభా కలిగిన పట్టణాలను రవాణా సౌకర్యానికి దూరం చేయడం శాస్త్రీయమైన నిర్ణయం కాదు.

ఈ నేపథ్యంలో అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ అఖిల పక్ష జేఏసీ ఆధ్వర్యంలో పద్నాలుగు వారాలుగా ఉద్యమం కొన సాగుతోంది. ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు, పొలికేక కార్యక్రమాలు, పట్టణ బంద్‌లతో ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. డెబ్బయి రోజులుగా కొనసాగుతున్న నిరా హార దీక్ష శిబిరానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన, మహిళా, వ్యాపార, వృత్తి సంఘాలు ఉద్యమంలో భాగస్వాములవుతున్నాయి. ముస్లిం, క్రైస్తవ మైనార్టీలు సైతం దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది దక్షిణ తెలంగాణ అభివృద్ధి, ప్రజల రవాణా హక్కులకు సంబంధించిన ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం బాధ్యతలు నెట్టుకోకుండా ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి. గతంలో ప్రకటించిన శంషాబాద్–చెన్నై బుల్లెట్ రైలు అలైన్మెంట్‌ను జాతీయ రహదారి 65 వెంట సూర్యాపేట మీదుగా అమలు చేయాలి.


ప్రభుత్వాలు తమ నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను ప్రజలకు బహిరంగంగా వివరించాలి. ఉద్యమకారులు, మేధావులు, ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాటాన్ని మరింత విస్తృతం చేయాలి. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభు త్వాలకు ప్రజాస్వామ్యంలో తగిన సమాధానం తప్పదు. ఈ ఉద్యమ ప్రభావం రానున్న శాసనమండలి, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంది. “ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేరల దాకా తన్ని తరుముతాం! ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తాం!” అన్న కాళోజీ నినాదం ఈ పోరాట స్ఫూర్తిని చాటుతోంది.


చెన్నోజు రమణాచారి, 9989863039

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్