సెప్టెంబర్‌లో రూ.1.29 లక్షల కోట్లకు చేరిన వ్యయం
ఖజానాపై ఆరు నెలల్లో రూ.7.6 లక్షల కోట్లు భారం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమంటుండటం తో భారత దిగుమతుల భారం భారీగా పెరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో అంతరాయాల కారణంగా సెప్టెంబర్‌లో దేశ ముడిచమురు దిగుమతుల బిల్లు 47 శాతం పెరిగి 1,540 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.29 లక్షల కోట్లు) చేరింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) గణాంకాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే దిగుమతుల పరిమాణం కేవలం 7 శాతం పెరిగినప్పటికీ, వ్యయం మాత్రం భారీగా ఎగబాకింది. గతేడాది 2.03 కోట్ల టన్నులుగా ఉన్న దిగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2.17 కోట్ల టన్నులకు చేరాయి. ఇదే సమయంలో భారత ముడిచమురు సగటు ధర బ్యారెల్‌కు 69.61 డాలర్ల నుంచి 116.09 డాలర్లకు పెరిగింది. దీంతో దిగుమతుల పరిమాణం కంటే ధరల పెరుగుదలే దేశంపై అదనపు భారాన్ని మోపుతోంది. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు తగ్గడం కూడా దేశ విదేశీ వాణిజ్యంపై ఒత్తిడిని పెంచుతోంది. సెప్టెంబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 24.6 శాతం క్షీణించాయి. ముడిచమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ తదితర దిగుమతుల వ్యయం నుంచి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ఆదాయాన్ని మినహాయిస్తే నికర చమురు, గ్యాస్ దిగుమతుల బిల్లు దాదాపు 40 శాతం పెరిగి 1,340 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.13 లక్షల కోట్లు) చేరింది. సెప్టెంబర్‌లో ఎల్ఎన్జీ దిగుమతుల కోసం 120 కోట్ల డాలర్లు (సుమారు రూ.10,080 కోట్లు) వెచ్చించగా, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా 480 కోట్ల డాలర్ల (సుమారు రూ.40,320 కోట్లు) ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనూ చమురు దిగుమతుల భారం భారీగా పెరిగింది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ముడిచమురు దిగుమతుల బిల్లు 46.4 శాతం పెరిగి 9,060 కోట్ల డాలర్లకు (సుమారు రూ.7.61 లక్షల కోట్లు) చేరింది. ఇదే కాలంలో నికర చమురు, గ్యాస్ దిగుమతుల వ్యయం 35 శాతం వృద్ధితో 8,110 కోట్ల డాలర్లు (సుమారు రూ.6.81 లక్షల కోట్లు)గా చోటు చేసుకుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగడం దేశ వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడి పెంచే ప్రమాదముంది.






కామెంట్లు (0)