Magazines

ఐడీబీఐ బ్యాంకు అమ్మకంపై ఆందోళన

1 గంట క్రితం

Concerns over the sale of IDBI Bank
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 2 నిమిషాల చదవడం

రెండు రోజుల సమ్మెకు ఉద్యోగుల పిలుపు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకును విదేశీ పెట్టుబడిదారులకు విక్రయించే నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. నవంబర్‌ 2, 3 తేదీల్లో రెండు రోజులపాటు సమ్మె నిర్వహించాలని ఐడిబిఐ బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. ఈ ఆందోళనకు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌‌బీయూ) పూర్తి మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ సంయుక్తంగా ఐడీబీఐ బ్యాంకులో కలిగి ఉన్న సుమారు 60 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌కు విక్రయించే నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారీ డిపాజిట్లు కలిగి, లాభాల్లో కొనసాగుతున్న బ్యాంకును విదేశీ పెట్టుబడిదారులకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శి స్తున్నాయి.

వరుస నిరసనలు..

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్య క్రమాలు చేపట్టాలని యూఎఫ్‌‌బీయూ తన అనుబంధ సంఘాలకు పిలుపునిచ్చింది. అక్టోబర్‌ 23న ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో నిర్వహించే ధర్నాలో బ్యాంకు సంఘాల నాయకులు పాల్గొనాలని కోరింది.

అక్టోబర్‌ 25న సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, 30న నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది. నవంబర్‌ 2న ఐడిబిఐ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని ఇతర బ్యాంకుల ఉద్యోగులకు సూచించింది. ఐడిబిఐ బ్యాంకు ఉద్యోగులు మాత్రం నవంబర్‌ 2, 3 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు.

ప్రభుత్వ హామీకి విరుద్ధంగా విక్రయం!

ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటా విక్రయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు గతంలో పార్లమెంటులో ఇచ్చిన హామీని గుర్తుచేస్తున్నాయి. 2003 డిసెంబర్‌లో ఐడీబీఐ చట్టం రద్దు, సంస్థను బ్యాంకుగా మార్చే బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి జశ్వంత్‌ సింగ్‌ కీలక హామీ ఇచ్చారని యూఎఫ్‌‌బీయూ గుర్తు చేసింది. ఐడీబీఐలో ప్రభుత్వం కనీసం 51 శాతం వాటాను కొనసాగిస్తుందని పార్లమెంటుకు హామీ ఇచ్చినట్లు తెలిపింది.

ఈ హామీ పార్లమెంటు రికార్డుల్లో నమోదైందని తెలిపింది. ఇప్పుడు మెజారిటీ వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధపడటం ఆ హామీకి విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేసింది.


ఆత్మనిర్భర్‌ భారత్‌..?

దేశీయ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బ్యాంకును విదేశీ సంస్థకు అప్పగించడం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు విరుద్ధమని యూఎఫ్‌‌బీయూ విమర్శించింది. లాభాల్లో ఉన్న బ్యాంకును, దాని భారీ డిపాజిట్‌ వనరులను విదేశీ పెట్టుబడిదారుల నియంత్రణలోకి తీసుకెళ్లడం సమంజసం కాదని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రజల విశ్వాసం, ప్రభుత్వ యాజమాన్య పరిరక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రయివేటీకరణను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్