సీఎస్ సంజయ్‌జాజు
నవతెలంగాణ -హైదరాబాద్
రాష్ట్రంలో నియంత్రణల సరళీకరణ అమలులో తెలంగాణ సాధించిన ప్రగతిని సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుకృతి లిఖితో కలిసి శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మొదటి దశలో నిర్దేశించిన మొత్తం 23 ప్రాధాన్యతా అంశాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిందని, తద్వారా 100 శాతం లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర జన విశ్వాస్ బిల్లును చట్టంగా రూపొందించడంతో మొదటి దశలో మిగిలి ఉన్న సంస్కరణ కూడా పూర్తయిందని వివరించారు. డీరెగ్యులేషన్ అండ్ కంప్లయెన్స్ రిడక్షన్ కార్యక్రమం రెండో దశలో మొత్తం 28 ప్రాధాన్యతా అంశాలు ఉన్నాయన్నారు. వీటిలో 23 తప్పనిసరి సంస్కరణలు, ఐదు ఐచ్ఛిక సంస్కరణలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు రెండో దశలో గుర్తించిన 28 అంశాల్లో 12 అంశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. మిగిలిన ప్రాధాన్యతా అంశాలను నవంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. తెలంగాణ సాధించిన ప్రగతిని అభినందించిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుకృతి లిఖి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నదని తెలిపారు. నియంత్రణ నిబంధనలను క్రమబద్ధీకరించడం, వ్యాపార సంస్థలు, పౌరులపై అనుసరణ భారాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమం అమలులో తెలంగాణ సాధించిన ప్రగతిని ఆమె అభినందించారు. ఈ సమావేశంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, పౌర సరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి స్టీఫెన్ రవీంద్ర, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్యతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)