తొమ్మిది రోజుల్లో
రూ.60వేల కోట్ల ఉపసంహరణ
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలతో సూచీలు కుదేలవుతుండగా.. సామాన్య మదుపరుల పెట్టుబడుల విలువ కూడా కరిగిపోతోంది. 2026లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.4 లక్షల కోట్లకు పైగా ఉపసంహరించుకోగా.. గత తొమ్మిది రోజుల్లోనే దాదాపు రూ.60,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. నిఫ్టీ తన గరిష్ఠ స్థాయి నుంచి 15 శాతానికి పైగా పడిపోవడం మార్కెట్లో నెలకొన్న ఒత్తిడికి అద్దం పడుతోంది. అమెరికా మార్కెట్లు పడిపో యినప్పుడు భారత మార్కెట్ కూడా క్షీణించడం ఒక ఎత్తయితే.. అక్కడ సూచీలు పెరిగినప్పటికీ ఇక్కడ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటం మదుపరులను కలవరపెడుతోంది. మార్కెట్ పతనాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధానపరమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా బాండ్ల రాబడులతో పోటీ
భారత మార్కెట్‌పై విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గడానికి అంతర్జాతీయ పెట్టుబడి పరిస్థితులూ కారణమవుతున్నాయి. అమెరికాలో అధిక వడ్డీ రేట్లు, ప్రభుత్వ బాండ్లపై ఆకర్షణీయమైన రాబడులు అందుబాటులో ఉండటంతో పెట్టుబడిదారులు తమ నిధులను తక్కువ రిస్క్ ఉన్న సాధనాల వైపు మళ్లించే అవకాశం ఉంది. డాలర్లలో 5 శాతానికి పైగా రాబడి లభించే పరిస్థితుల్లో రూపాయి పతనంతో పాటు మార్కెట్ ఒడుదొడుకులనూ ఎదుర్కోవాల్సిన భారత ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు వారు వెనుకా డుతున్నారు. ఈ పరిణామాలు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి నిధుల తరలింపునకు దారితీస్తున్నాయి.
దేశీయ మదుపరులే మార్కెట్‌కు అండ
విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు కొనసాగిస్తు న్నప్పటికీ దేశీయ రిటైల్ మదుపరులు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా వస్తున్న పెట్టుబడులు మార్కెట్‌కు కొంత అండగా నిలుస్తున్నాయి. అయితే విదేశీ నిధుల నిరంతర ఉపసంహరణ కొనసాగితే దేశీయ పెట్టుబడుల ఆధారంగా మార్కెట్‌ను దీర్ఘకాలం నిలబెట్టడం కష్టమవుతుందనే ఆందోళనలున్నాయి. బడ్జెట్లో ఫ్యూచర్స్, ఆప్షన్స్ లావాదేవీలపై ఎస్టిటి పెంపు మార్కెట్‌ను ప్రభావితం చేసిన అంశాల్లో ఒకటిగా నిలిచింది. గతంలో మార్కెట్ పతనంపై పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో పన్నుల విషయంలో ఊరట లభిస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. అయితే పెట్టుబడిదారులు ఆశించిన మార్పులు ఇంకా కనిపించడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సమీక్షలు కాదు..!
మార్కెట్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్షణ విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. విదేశీ పెట్టుబడిదా రులు ఎందుకు నిధులు ఉపసంహరించుకుంటున్నారు, పన్నుల నిర్మాణంలో ఏ అంశాలు వారి రాబడులను ప్రభావితం చేస్తున్నాయి, రూపాయి బలహీనతను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు అవసరం అనే అంశాలపై స్పష్టమైన సమీక్ష జరగాలని అంటున్నారు. అదే సమయంలో దేశీయ రిటైల్ మదుపరుల ప్రయోజనాలనూ విస్మరించరాదని పేర్కొంటున్నారు. గత రెండేళ్లుగా మార్కెట్ పరిమిత శ్రేణిలో కదులుతూ క్రమంగా ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ప్రస్తుత పతనం చిన్న మదుపరుల పొదుపుపై ప్రభావం చూపుతోందని విశ్లేషిస్తున్నారు. విధాన సమీక్షలకే పరిమితం కాకుండా, మార్కెట్ ఆకర్షణను పెంచే నిర్ణయాలు తీసుకోకపోతే పెట్టుబడిదారుల విశ్వాసం మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
రూపాయి బలహీనత..
విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్‌కు దూరమవడానికి పలు కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రూపాయి రికార్డ్ పతనం విదేశీ మదుపరుల డాలర్లలో వచ్చే రాబడులను తగ్గిస్తోంది. భారత మార్కెట్లో షేర్ల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ పడిపోతే డాలర్లలో లెక్కించే పెట్టుబడిదారులకు నష్టం వాటిల్లుతుంది. మరోవైపు దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) 12.5 శాతం, స్వల్పకాలిక మూలధన లాభాలపై (ఎస్టీసీఓ) 20 శాతం పన్నులు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) లావాదేవీలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెంపు పెట్టుబడులపై వచ్చే నికర రాబడులను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.





కామెంట్లు (0)