Magazines

సర్ పేరుతో ఓటు చోరికి పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం

46 నిమిషాల క్రితం

Modi government is committing vote theft in the name of Sir.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 3 నిమిషాల చదవడం

జ్ఞానేశ్ కుమార్‌ను ఎంతోకాలం కాపాడలేరు..
ప్రజా ఉద్యమాలను అణచివేసే హక్కు కేంద్ర సర్కారుకు ఎక్కడిది?

ఢిల్లీలో సీపీఐ(ఎం) నేతలు, నిరసనకారులపై పోలీసుల నిర్బంధం సరికాదు :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు 
చుక్క రాములు, ఎండీ జహంగీర్‌

సంగారెడ్డిలో సీఈసీ
 దిష్టి బొమ్మ దహనం

ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో నిరసనలు

నవతెలంగాణ-విలేకర్లు

రాష్ట్ర వ్యాప్తంగా ​​సర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓటు చోరికి పాల్పడుతుందని, జ్ఞానేశ్ కుమార్ ను మోడీ ఎంతోకాలం కాపాడలేరని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్బంధంతో కేంద్ర ప్రభుత్వం ఆపాలని చూడటం అవివేకమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా పోరాటాలను అణచివేసే హక్కు మోడీకి లేదన్నారు. ఢిల్లీలో కొనసాగిన పోలీసుల అణచివేత, అరెస్టులను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం భారత ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేష్‌‌కుమార్‌ ‌దిష్టిబొమ్మను దహనం చేశారు. మోడీకి వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుందన్నారు. అనేక మంది నిరసనకారులతో పాటు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి, పొలిట్బ్యూరో సభ్యులు, కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్, సీనియర్ నేత బృందాకరత్, పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.వి.గోవిందన్, విజయ రాఘవన్, ఇతర కేంద్ర కమిటీ సభ్యులను అరెస్టు చేశారన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలన్నారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సి ఎలక్షన్ కమిషన్ ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకొని సర్ పేరుతో ఓట్లను తొలగించే దుర్మార్గమైన కార్యక్రమం తీసుకుందన్నారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించినట్టుగా ఇప్పటికే లెక్కలు వచ్చాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఈ చర్యను అనేక ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం మల్లేశం, అతిమేల మానిక్, జి. సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, రేవంత్, కృష్ణ నాయకులు అశోక్, బాలరాజు, శివ కుమార్, దత్తు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో...

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో సర్‌ ‌ప్రక్రియను వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియను రద్దు చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసే హక్కును మోడీ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహారిస్తూ కాలరాస్తోందన్నారు. ఢిల్లీలో పోలీసుల నిర్భందకాండను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుంటోజు శ్రీనివాసచారి, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు దోనూరు నర్సిరెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ పోరాట సంఘాల నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గడియారం సెంటర్ లో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నర్రా శేఖర్ రెడ్డి, డీటీఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశం, నాగయ్య, వెంకులు, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ వేదిక అధ్యక్షులు రాములు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న పాల్గొన్నారు.​ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌక్‌ వద్ద నిర్వహించిన నిరసన తెలిపారు. సామాన్య ప్రజల ఓట్ల గల్లంతుకు కారణమైన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలని యూఎస్‌పీసీ జిల్లా నాయకులు వి.అశోక్‌ డిమాండ్‌ చేశారు. ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చౌక్‌లో నిరసన చేపట్టారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్‌ తాహెర్‌ బిన్‌ హుందాన్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, నిర్మల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి, సీపీఐ(ఎం) నాయకులు బొమ్మెన సురేష్‌ పాల్గొన్నారు. మంచిర్యాలలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బెల్లంపల్లిలో డీసీసీ అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్