Magazines

రూ.2,600 కోట్లకు పైగా రుణాలను అందించటాన్ని లక్ష్యంగా చేసుకున్న ఐసీఎల్ ఫిన్‌కార్ప్‌

11 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బంగారు రుణాలపై ప్రధానంగా దృష్టి సారించిన, కేరళకు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌ తమ తదుపరి దశ వృద్ధికి సిద్ధమవుతోంది. 

గత రెండేళ్లలో కంపెనీ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) 2024 మార్చిలో రూ.472 కోట్లుగా ఉండగా, 2026 సెప్టెంబర్‌ నాటికి సుమారు రూ.1,235 కోట్లకు చేరింది. ఈ కాలంలో దాదాపు 160 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీకి సుమారు 300 శాఖల నెట్‌వర్క్‌ ఉంది. సురక్షిత రుణాల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

కంపెనీ వృద్ధి పట్ల తమ నిబద్ధతను చాటుతూ ప్రమోటర్లు 2027 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో సుమారు రూ.60 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని అందించారు. దీంతో 2026 సెప్టెంబర్‌ నాటికి కంపెనీ నికర విలువ సుమారు రూ.242 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో మరో రూ.60 కోట్ల మేర ప్రమోటర్ల పెట్టుబడిని సమకూర్చుకోవాలని కంపెనీ యోచిస్తోంది. 

సంస్థాగత రుణదాతల నుంచి పెరుగుతున్న విశ్వాసం కూడా కంపెనీ వృద్ధికి తోడ్పడుతోంది. ప్రముఖ ఆర్థిక సంస్థలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి రూ.125 కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) నుంచి రూ.200 కోట్ల రుణ సదుపాయాలు పొందింది.

2026 ఆర్థిక సంవత్సరంలో రూ.9.12 కోట్ల పన్నుల అనంతర లాభాన్ని (పీఏటీ) కంపెనీ నమోదు చేసింది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో రూ.12.87 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 65 శాతం వృద్ధి నమోదు చేసింది.

భవిష్యత్తులో రుణాల పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక అంచనాల ప్రకారం నికర రుణాల విలువ 2027 మార్చి నాటికి సుమారు రూ.1,600 కోట్లు, 2028 మార్చి నాటికి రూ.2,100 కోట్లు, 2029 మార్చి నాటికి రూ.2,600 కోట్లకు పైగా చేరనుంది.

కంపెనీ వృద్ధి ప్రణాళికలపై ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ వ్యవస్థాపకుడు కేజీ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌కున్న వృద్ధి అవకాశాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. రానున్న సంవత్సరాల్లో వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించేందుకు సంస్థకు మంచి అవకాశాలున్నాయని భావిస్తున్నాం. బ్యాంకింగ్‌ భాగస్వాములు చూపుతున్న విశ్వాసం, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న ఆసక్తి కంపెనీ దీర్ఘకాలిక సామర్థ్యంపై మా నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. 2030 నాటికి ఈ వ్యవస్థను 600 శాఖలకు విస్తరించి, రుణాల పోర్ట్‌ఫోలియోను రూ.4,000 కోట్లకు చేర్చాలన్నది మా లక్ష్యం’’ అని తెలిపారు.

కేజీ అనిల్‌కుమార్‌, ఉమాదేవి అనిల్‌కుమార్‌ ప్రమోట్‌ చేసిన ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ సురక్షిత రిటైల్‌ రుణాల విభాగంలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. కంపెనీ రుణాల పోర్ట్‌ఫోలియోలో సుమారు 99 శాతం వాటా బంగారు రుణాలదే కావడం విశేషం.

 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్