Magazines

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

12 నిమిషాల క్రితం

Dr. Vamshi Krishna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)కు చెందిన నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఆర్‌పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్‌ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

2026లో ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు సంబంధించినవే వుండనున్నాయి. రాష్ట్రంలో పురుషులకు వచ్చే క్యాన్సర్లలో నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్‌ క్యాన్సర్ల తర్వాత ఇది నాలుగో స్థానంలో ఉంది. తెలంగాణలో పురుషులకు సంబంధించి 21,252 కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతాయని అంచనా వేయగా, వాటిలో 6.1 శాతం, అంటే సుమారు 1,300 ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు ఉండవచ్చని పేర్కొంది. ఇక్కడ కూడా పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో ఇది నాలుగో స్థానంలో ఉంది.

ఏఐజీ ఆస్పత్రుల మెడికల్‌ ఆంకాలజీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం. వంశీకృష్ణ మాట్లాడుతూ ‘‘ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే అభివృద్ధి చెందుతుంది. దీంతో పురుషులు వైద్య సహాయం పొందడంలో ఆలస్యం చేసే అవకాశం ఉంది. మూత్ర సంబంధిత సమస్యలను తరచుగా వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులుగా భావిస్తుంటారు. అయితే మూత్ర విసర్జన అలవాట్లలో నిరంతర మార్పులు, మూత్ర విసర్జనలో ఇబ్బంది లేదా మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాధిని గుర్తించడానికి, సరైన చికిత్సను నిర్ణయించడానికి ప్రమాద కారకాలపై అవగాహన, సకాలంలో వైద్యులను సంప్రదించడం, తగిన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం’’ అని తెలిపారు.

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్స విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యాధి ముదిరిన దశలో ఉన్నప్పటికీ కొంతమంది  రోగులకు కొత్త తరహా సిస్టమిక్‌ థెరపీలు, రేడియోలిగాండ్‌ చికిత్సలు అదనపు అవకాశాలను అందిస్తున్నాయి. 

హైదరాబాద్‌లో 2012 నుంచి 2016 మధ్య నమోదైన క్యాన్సర్‌ రిజిస్ట్రీ గణాంకాల ప్రకారం 241 ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయి. వయసు ఆధారంగా సర్దుబాటు చేసిన వ్యాధి సంభవ రేటు ప్రతి లక్ష మందికి 5.5గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రోస్టేట్‌ ఆరోగ్యంపై అవగాహన పెంచడం, అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు సకాలంలో వైద్యులను సంప్రదించేలా ప్రోత్సహించడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్