నవతెలంగాణ-హైదరాబాద్ : దీపావళి పండగ వేళ పలు చోట్ల చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాద ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మధ్యప్రదేశ్‌లో రెండు ఇళ్లల్లో మంటలు చెలరేగి 12 మంది ప్రాణాలు కోల్పోగా.. యూపీలో ఓ కారు దగ్ధమై ఆరుగురు సజీవదహనమయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని సివానీ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక నగల వ్యాపారి అయిన కుందన్‌లాల్ సోనికి చెందిన మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఘటన సమయంలో ఇంట్లో 10 మంది ఉండగా.. కుందన్‌లాల్, ఆయన భార్య సహా ఆరుగురు సజీవదహనమయ్యారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.
ఇక కట్నీ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఓ భవనంలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. ఈ భవనంలోని ఒక అంతస్తులో పూరన్ అగర్వాల్ బాణసంచా దుకాణం నిర్వహిస్తుండగా.. పైఅంతస్తులో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. నిన్న రాత్రి దుకాణంలో చెలరేగిన మంటలు భవనమంతా వ్యాపించి పూరన్, ఆయన భార్య, కోడలితో పాటు ఇద్దరు మనవరాళ్లు, రెండు నెలల మనవడు సజీవదహనమైనట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హరియాణాలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం హరిద్వార్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో శామ్లీ హైవే వద్ద వీరి కారు అదుపుతప్పి ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొంది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి ఆరుగురు కుటుంబసభ్యులు మరణించారు.






కామెంట్‌లు (0)