Magazines

బంగారు పతకంతో మెరిసిన సాహిత్ పటేల్

1 గంట క్రితం

Sahit Patel shines with gold medal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మంచిర్యాల జిల్లా జైపూర్‌కు చెందిన పాదం సాహిత్‌ పటేల్‌ బంగారు పతకం సాధించాడు. హైదరాబాద్‌లో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌-14 రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో 36-38 కిలోల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి సత్తా చాటాడు. బలమైన ప్రత్యర్థులను ఓడించి స్వర్ణ పతకం సాధించాడు. ఈ విజయంతో ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ తరఫున పాల్గొనేందుకు ఎంపికయ్యాడు.


జైపూర్‌ మండల కేంద్రంలో సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌గా పనిచేస్తున్న పాదం మహేందర్‌ కుమారుడైన సాహిత్‌.. తండ్రి కోచ్‌గా శిక్షణ ఇవ్వడంతో ఎక్కువ సమయం సాధనకు కేటాయించగలిగానని తెలిపాడు. సీనియర్‌ బాక్సింగ్‌ కోచ్‌ నిట్టూరి మైసూర్‌ నేర్పిన మెలకువలు రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నాడు. జాతీయస్థాయిలోనూ పతకం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పాడు.


జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన సాహిత్‌ను జిల్లా విద్యాశాఖాధికారి ఐఏఎస్‌ చంద్రయ్య, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి యాకూబ్‌, సీనియర్‌ బాక్సింగ్‌ కోచ్‌ నిట్టూరి మైసూర్‌, మంచిర్యాల జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌, కార్యదర్శి రాజ్‌కుమార్‌, సీనియర్‌ క్రీడాకారులు జయకృష్ణ, శ్రీకాంత్‌, అసోసియేషన్‌ సభ్యులు జగన్‌, రాజు నాయక్‌, వేముల కిరణ్‌, ఎన్‌ఐఎస్‌ కోచ్‌ సందీప్‌, జగత్‌సాయి తదితరులు అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్