- వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- అశ్వారావుపేట మండలం నారాయణపురం లో పాల్గొన్న డీఏఓ బాబురావు
నవతెలంగాణ - అశ్వారావుపేట
యాసంగి సీజన్‌లో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రైతు నేస్తం 109 ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమాలను శనివారం పీజే టీఏయూ ఎలక్ట్రానిక్ వింగ్ - రైతు నేస్తం విభాగం సాంకేతిక సహాయంతో వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్. బి. గోపి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు వేదికల్లో హాజరైన రైతులు ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాబోయే కాలంలో నీటి లభ్యతపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున బోర్ల కింద అధికంగా నీటిని వినియోగించే వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించడంతో పాటు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి గారు తెలిపారు. రైతులు శాస్త్రీయ సూచనలు పాటిస్తూ నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎల్ నినో ప్రభావం – వాతావరణం,వర్షపాతం పరిస్థితులు పై ఐఎండీ సైంటిస్ట్ - డీ డాక్టర్ శ్రావణి,యాసంగిలో సాగు చేయదగిన పప్పు ధాన్యాలు నూనెగింజల పంటలు పై పీజేటీఏయూ రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త రైతులకు వివరించారు. అనంతరం ఎన్ఎఫ్ఎస్ఎం,ఎన్ఎంఈఓ - ఓఎస్ పధకాల క్రింద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పప్పు ధాన్యాల విత్తనాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమాన్ని అశ్వారావుపేట మండలం నారాయణపురం రైతు వేదికలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వేల్పుల బాబు రావు,ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, సహాయ సంచాలకులు పెంటేల రవి కుమార్ వీక్షించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు నిర్మల పుల్లారావు, స్థానిక సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య,ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్,ఏఓ శ్రీనివాసరావు,ఏఈఓ నార్లపాటి రవీంద్ర పలువురు రైతులు పాల్గొన్నారు.




కామెంట్‌లు (0)