- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు, దర్యాప్తు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో వివాహిత ఒకరు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్‌కు చెందిన ఇమ్మనబోయిన వెంకట నారాయణ, విష్ణుప్రియ (38) పదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. వీరు ప్రస్తుతం సత్తుపల్లి మండలం కిష్టారం బీసీ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం రాత్రి 10 గంటల వరకు కుటుంబ సభ్యులతో ఎంతో ఉత్సాహంగా గడిపిన విష్ణుప్రియ, ఆ తర్వాత లోపలి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆమె మృతికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న సత్తుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతదేహాన్ని సందర్శించిన డాక్టర్ దయానంద్ విజయకుమార్
విష్ణుప్రియ మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సత్తుపల్లి ఆసుపత్రి మార్చురీని సందర్శించారు. మృతదేహానికి నివాళులర్పించి, విష్ణుప్రియ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరును బంధువులను అడిగి తెలుసుకున్న ఆయన, ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిష్టారం, సత్తుపల్లి మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)