- సాధారణ విస్తీర్ణం కంటే 29,265 ఎకరాలు తక్కువ
- ప్రస్తుతం పలు దశల్లో వరి పంట
- అధిక ఉష్ణోగ్రతలతో చీడపీడల ఉధృతి
- రైతులు అప్రమత్తంగా ఉండాలి
- ఏడీఏ పెంటేల రవి కుమార్
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఎల్నినో ప్రభావంతో ఈ వానాకాలం పంటల సాగు ఒడిదుడుకులకు గురైందని అశ్వారావుపేట వ్యవసాయ సహాయ సంచాలకులు పెంటేల రవి కుమార్ తెలిపారు. ముఖ్యంగా నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. జూన్, జులై, ఆగస్టు నెలల్లో లోటు వర్షపాతం కారణంగా వరి సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. సెప్టెంబర్ చివరి వరకు కూడా నాట్లు వేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వర్షాధారంగా సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూప గా, కొందరు నేరుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశారని వివరించారు. ఈ వానాకాలంలో మొత్తం 1,39,977 ఎకరాల్లో వరి సాగు కాగా, సాధారణ సాగు విస్తీర్ణం 1,69,242 ఎకరాలు అని తెలిపారు. దీంతో సాధారణ విస్తీర్ణం తో పోలిస్తే 29,265 ఎకరాల మేర వరి సాగు తగ్గిందన్నారు. ప్రస్తుతం పంటలు అంకుర, పిలక, పొట్ట, గింజ గట్టిపడే తదితర దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వరి పంటలో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉందని రవి కుమార్ హెచ్చరించారు. ముఖ్యంగా ఆకుముడత పురుగు ఆశించేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు.దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అలాగే పలు ప్రాంతాల్లో బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ కనిపిస్తోందన్నారు. దీని నివారణకు 10 లీటర్ల నీటికి 2 గ్రాముల ప్లాంటోమైసిన్, 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 గ్రాముల అగ్రిమైసిన్, 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అక్కడక్కడా కాండం తొలుచు పురుగు ఆశించినట్లు తెలిపారు. దీని నివారణకు లీటరు నీటికి 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. రైతులు పంటలను క్రమం తప్పకుండా పరిశీలించి, చీడపీడల లక్షణాలు కనిపించిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.






కామెంట్లు (0)