Magazines

ఎల్‌-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి

1 గంట క్రితం

impact of El-Nino
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 2 నిమిషాల చదవడం

- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి 

- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

- గులాబీ శ్రేణులతో సండ్ర సన్నాహక సమావేశం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​ఎల్‌-నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తక్షణమే ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కరువు నివారణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం దాన్ని విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్తుపల్లి పట్టణ, మండల, వేంసూరు మండల ముఖ్య నాయకులతో సండ్ర  సన్నాహక సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ​ఎల్‌-నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, కరువు ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కోరారు. కరువు మండలాల ప్రకటన, ఉపాధి హామీ పనిదినాల పెంపుపై ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి, కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు, గ్రామీణ ప్రజలకు సాయం అందించాలన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆర్థికంగా ఆదుకుని అండగా నిలిచిన ఘనత నాటి కేసీఆర్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.


రాష్ట్రంలో సమృద్ధిగా బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, కేటీపీఎస్‌, మణుగూరు థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సింగరేణి బొగ్గు వ్యవహారంపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి

​రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో, సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గులాబీ శ్రేణులను కోరారు. పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు.


ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు దొడ్డా శంకరరావు, మల్లూరు అంకమరాజు, ఎస్కే చాంద్ పాషా, నడ్డి ఆనందరావు, బెల్లంకొండ రాము, అమరవరపు కృష్ణారావు,  వల్లభనేని పవన్, ఆయూబ్ పాషా, మేకల నరసింహారావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్