- యాసంగిలో తక్కువ నీటి అవసరమున్న పంటలనే సాగు చేయాలి
- జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు
నవతెలంగాణ - అశ్వారావుపేట
అపరాల సాగులో ఆత్మనిర్భరత సాధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు సూచించారు. శనివారం అశ్వారావుపేట మండలంలోని తిరుమలకుంట, నారాయణపురం, అనంతారం క్లస్టర్లలో మినుము పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ‘నవతెలంగాణ’తో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వానాకాలంలో వరికి బదులుగా తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటల సాగును వ్యవసాయ శాఖ ప్రోత్సహించిందన్నారు. ఇందులో భాగంగా పెసర, మినుము, కంది విత్తనాలను రైతులకు రాయితీపై పంపిణీ చేసినట్లు తెలిపారు. అశ్వారావుపేట మండలంలో సుమారు 3,000 ఎకరాల్లో మినుము సాగు జరిగిందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యాసంగిలోనూ వరికి బదులుగా తక్కువ నీటి అవసరమున్న పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. తద్వారా నీటి వనరులను పొదుపుగా వినియోగించడంతో పాటు రైతులకు కొంతమేర ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
జిల్లాలో ఈ వానాకాలంలో 4,29,535 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 1,25,506, పత్తి 2,37,240, మొక్కజొన్న 66,471, పెసర 7,446, మినుము 3,049, కంది 3,635, వేరుశెనగ 4,217 ఎకరాల్లో సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటలు 83,297 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో సాధారణం కంటే 21.9 శాతం వర్షపాతం లోటు నమోదైందని బాబురావు తెలిపారు. ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 15 మండలాల్లో లోటు పరిస్థితి నెలకొందన్నారు. వర్షపాతం లోటు పంటల సాగుపై ప్రభావం చూపడంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడిందని పేర్కొన్నారు. రైతులు పంటల ఎంపిక, సాగునీటి వినియోగం విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాల్లో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అందించే సలహాలు, సూచనలను రైతులు పాటించాలని కోరారు.




కామెంట్‌లు (0)