Magazines

గల్ఫ్ కార్మికుడికి అండగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి

13 అక్టోబర్, 2026

avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-జన్నారం

ప్రమాదంలో గాయపడి స్వదేశానికి తిరిగి రాలేక ఇబ్బందులు పడుతున్న తెలంగాణ గల్ఫ్ కార్మికుడికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి (TGWWC) అండగా నిలిచింది. జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య చొరవతో ట్రావెల్ బ్యాన్ తొలగించడంతోపాటు, విమాన టికెట్ కోసం రూ.20 వేలకు పైగా ఆర్థిక సాయం అందించారు.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన గుప మణికంఠ దుబాయ్‌లోని ఓ కంపెనీలో బైక్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా బైక్‌పై వెళ్తుండగా గత నెల 26న కారు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన ఎడమ చేయి కీలు, వెన్నెముకకు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం భారత్‌కు వెళ్లేందుకు విమాన టికెట్ కొనుగోలు చేసి విమానాశ్రయానికి చేరుకోగా, ప్రమాదానికి సంబంధించిన కేసు కారణంగా దుబాయ్ పోలీసులు ట్రావెల్ బ్యాన్ విధించడంతో వెనుదిరగాల్సి వచ్చింది.


భూమయ్య చొరవతో వైద్యం..

మణికంఠ పరిస్థితిని ఆయన సోదరుడు విజయ్ ద్వారా తెలుసుకున్న TGWWC వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య వెంటనే స్పందించారు. ట్రావెల్ బ్యాన్ కోర్టు పరిధిలో ఉండటంతో ప్రక్రియకు సమయం పడుతుందని గుర్తించి, తొలుత ఆసుపత్రిలో చికిత్స పొందేలా సూచించారు. కంపెనీ, బీమా సహకారంతో వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించారు. మెరుగైన వైద్యం, విశ్రాంతి అవసరం కావడంతో స్వదేశానికి వెళ్లేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేశారు.

 ఉచితంగా కేసు పరిష్కారం.. విమాన టికెట్‌కు ఆర్థిక సాయం..

ట్రావెల్ బ్యాన్ తొలగింపుతోపాటు కేసు పరిష్కారం కోసం భూమయ్య పోలీస్ స్టేషన్, కంపెనీ యాజమాన్యం, కోర్టు వర్గాలతో పలుమార్లు చర్చలు జరిపారు. ఎలాంటి రుసుము లేకుండా ట్రావెల్ బ్యాన్, కేసు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశారు. అనంతరం మణికంఠ స్వదేశానికి చేరుకునేందుకు విమాన టికెట్ కోసం సంస్థ సభ్యుల సహకారంతో 800 దిర్హామ్‌లు (రూ.20 వేలకు పైగా) ఆర్థిక సాయం అందించారు. దీంతో మణికంఠ క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు.

 సహకరించిన వారికి కృతజ్ఞతలు..

ఈ సందర్భంగా సహకరించిన దుబాయ్ పోలీసులకు, కంపెనీ యాజమాన్యానికి TGWWC తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీమ్‌తోపాటు మణికంఠ సోదరుడు విజయ్, కడెం మండల ఇన్‌చార్జి ధర్మాజీ సత్తన్న, బర్ దుబాయ్ కోఆర్డినేటర్ కునారపు రమేష్, కల్లెడ నరసయ్య, మేడి రామన్న, గుమ్ముల మల్లయ్య, సంగిపు నంబయ్య, కోండ్ర కిష్టయ్య, తిరుపతి తదితరులు సహకరించారు. ఆపదలో ఉన్న గల్ఫ్ కార్మికులకు అండగా నిలిచి, అవసరమైన వైద్య సహాయం, న్యాయపరమైన సహకారం అందించి స్వదేశానికి చేర్చడంలో TGWWC సభ్యులు ముందుంటారన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్